Emmiganur Handlooms: ఎమ్మిగనూరు చేనేత మన సంస్కృతికి చిహ్నం
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:22 AM
సంప్రదాయ సోయగం... అచ్చమైన తెలుగుదనం... ఎమ్మిగనూరు చేనేత వస్త్రం. ఇక్కడి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకొనే జరీ అంచు సీకో, పట్టు, కాటన్ చీరలు వేటికవే ప్రత్యేకం. కోటగుమ్మాలు, బుట్టలు, ఏనుగులు, పూలు... విభిన్న అంచులతో... నవీన హంగులతో...
సంస్కృతి
సంప్రదాయ సోయగం... అచ్చమైన తెలుగుదనం... ఎమ్మిగనూరు చేనేత వస్త్రం. ఇక్కడి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకొనే జరీ అంచు సీకో, పట్టు, కాటన్ చీరలు వేటికవే ప్రత్యేకం. కోటగుమ్మాలు, బుట్టలు, ఏనుగులు, పూలు... విభిన్న అంచులతో... నవీన హంగులతో... ఆకట్టుకొంటున్న ఈ చేనేతకు దేశవిదేశాల్లోనూ మంచి ఆదరణ ఉంది. అరుదైన ఈ కళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ఉద్దేశంతో... ఇటీవల ఓ సంస్థ జియోగ్రాఫికల్ ఇండెక్స్ (జీఐ) కోరుతూ నివేదిక పంపింది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు చేనేతలపై ‘నవ్య’ ప్రత్యేక కథనం.
కర్నూలు జిల్లాలో చేనేతపురిగా ఖ్యాతి పొందింది... ఎమ్మిగనూరు పట్టణం. మూడు వేల కుటుంబాలు ఇక్కడ చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ అరుదైన కళకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1930ల్లో పేదరికం, నిరుద్యోగం, కరువు, ఆకలి చావులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మగ్గం ఆదుకుంది. ఆకలి తీర్చింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత, దివంగత మాచాని సోమప్ప 1938లో ‘ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్’ను స్థాపించారు. స్వాతంత్ర్యానికి ముందే సహకార వ్యవస్థకు బీజం వేశారు. నేతన్నలకు ఉపాధి కల్పించారు. ఆయన కృషితో అత్యుత్తమ చేనేత వస్త్రాలకు ఎమ్మిగనూరు ఒక బ్రాండ్‌గా ఎదిగింది. జిందగీ దుప్పట్లు, బర్డ్స్ ఐ తువాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, దోమతెరలు, దోతీలు, చీరల తయారీకి కేంద్రంగా మారింది. ఎప్పటికప్పుడు వినూత్న హంగులు అద్దుతూ ఆకట్టుకొంటున్న నేతన్నలు... తరువాతి కాలంలో జరీ అంచు కుట్టు సీకో, పట్టు, కాటన్ చీరలు రూపొందించడం ప్రారంభించారు. సహజసిద్ధమైన రంగులు, సంప్రదాయ సొగసులతో విభిన్న డిజైన్ల చీరలు నేస్తున్నారు. వారసత్వంగా వస్తున్న కళకు జీవం పోస్తూ... ప్రత్యేకతను చాటుకొంటున్నందుకు గానూ గతంలో జాతీయ పురస్కారం సైతం అందుకున్న ఘనత ఇక్కడి కళాకారులది.

ఎంతో ప్రత్యేకం...
సీకో, పట్టు చీరల తయారీకి బెంగళూరు, ధర్మవరం, రాయదుర్గం నుంచి నాణ్యమైన పట్టును నేతన్నలు దిగుమతి చేసుకొంటున్నారు. వీరు తయారు చేసే చీరలకు మరో ప్రత్యేకత ఉంది. అదే ‘కుట్టు’. అంటే అల్లిక. సాధారణంగా చీర నేసేటప్పుడు ఈ చివర నుంచి ఆ చివరకు ఒకే దారం వేస్తారు. కానీ ఇక్కడ అంచును, చీర బాడీని విభిన్న రంగు దారాలతో కలుపుతూ కుట్టు వేస్తారు. ఈ చీరలను హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరు, కోల్‌కత్తా తదితర ప్రధాన నగరాలకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు కూడా ఎగుమతి అవుతాయి.
ఐదు వేల కుటుంబాలకు...
ఒక చీర నేయడానికి డిజైన్, జరీ బుట్టుల సంఖ్యను బట్టి ఐదు నుంచి పన్నెండు రోజుల సమయం పడుతుంది. జరీ అంచు కాటన్ చీరకు రూ.3 వేలు, సీకో చీరకు రూ.3,500 నుంచి రూ.4 వేలు, పట్టు చీరకు రూ.5 నుంచి 8 వేలు, టర్నింగ్ బోర్డర్ చీరకు గరిష్టంగా రూ.12 వేల వరకు కూలీ చెల్లిస్తారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని ప్రాంతాల్లో 120 మందికిపైగా మాస్టర్ వీవర్స్ ఉన్నారు. దాదాపు ఐదు వేల చేనేత కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.
అంతర్జాతీయ గుర్తింపు కోసం...
స్వాతంత్ర్యానికి పూర్వమే ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చారు మాచాని సోమప్ప. చెక్క మగ్గంపై నేతన్నలు ఉత్పత్తి చేసే జిందగీ దుప్పట్లు, బర్డ్స్ ఐ తువ్వాళ్లు వారి నైపుణ్యానికి అద్దం పడతాయి. ‘నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్’ పంపిణీ చేసే మృదువైన నూలు దారాలను వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మాత్రమే ఉత్పత్తి చేసే ఈ చేనేతలకు అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చే జియోగ్రాఫికల్ ఇండెక్స్ (జీఐ) లేదు. దాని కోసం హైదారాబాద్‌కు చెందిన ‘రిజల్యూట్ బీ2బీ’ సంస్థ ఎమ్మిగనూరులో క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ఒక నివేదిక సిద్ధం చేసి, జీఐ కోసం సంబంధిత శాఖకు పంపించింది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం 2025-26కు ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) కింద ఎమ్మిగనూరు చేనేతలను ఎంపిక చేసింది.

‘మిస్ వరల్డ్’లో మెరుపులు...
గద్వాల పట్టు చీరలుగా మార్కెట్‌లో అమ్మకాలు సాగించే ఎమ్మిగనూరు చేనేతలు ‘మిస్ వరల్డ్’లో పోటీపడ్డ అందగత్తెల మనసు దోచుకున్నాయి. హైదరాబాద్‌లో ఈ ఏడాది మేలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌కు వచ్చిన విదేశీ భామలు... ఓరుగల్లు, వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయాలను సందర్శించారు. ఆ సమయంలో కొందరు అందగత్తెలు ఎమ్మిగనూరు పట్టు చీరలు, పరికిణీలు ధరించి అలరించారు.
గోరంట్ల కొండప్ప, కర్నూలు
ఫొటోలు, ఎస్‌ఎండీ రఫీ
బతుకుతూ... బతుకునిస్తూ...
నేను మాస్టర్ వీవర్‌ని. జరీ అంచు పట్టు, సీకో చీరలు తయారు చేస్తున్నాను. మగ్గమే నాకు ఆధారం. నేనే కాకుండా... మరో యాభై మంది మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నాను. అందుకు నాకు ఎంతో సంతృప్తిగా, సంతోషంగా ఉంది. మా అమ్మ లక్ష్మమ్మ, నాన్న కాశీనాథప్పలది నందవరం గ్రామం. మేం ముగ్గురు సంతానం. అందరికీ చేనేతే జీవనాధారం. ఈ కళ నాకు వారసత్వంగా వచ్చింది. నేను ఆరో తరగతిలో ఉండగా, చదువు మాన్పించి ఇంట్లోవాళ్లు మగ్గంపై నేయడం నేర్పించారు. తరువాత ఎమ్మిగనూరుకు చెందిన ఈరన్నకు ఇచ్చి నా పెళ్లి చేశారు. మాకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు. అత్తింటివారికి కూడా మగ్గమే ఆధారం. నేను, మావారు పట్టు చీరలు నేసేవాళ్లం. మాస్టర్ వీవర్ అయిన మావారు... ఆర్థిక స్థోమత లేని కార్మికులకు మగ్గాలు ఇచ్చి ఆదుకున్నారు. అంతా ఆనందంగా సాగిపోతుందనుకున్న సమయంలో అనారోగ్యంతో మావారు మరణించారు. అప్పటి నుంచీ కుటుంబ భారం నా మీద పడింది. ఆత్మస్థైర్యంతో నిలబడ్డాను. నా కళకు మరింత సృజన జోడించి మాస్టర్ వీవర్‌గా రాణిస్తున్నాను. నెలకు దాదాపు వంద చీరలు నేస్తున్నాను. హైదరాబాద్, గద్వాలకు సరఫరా చేస్తున్నాను. అయితే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహమూ లేదు. అన్‌సీజన్‌లో తక్కువ వడ్డీలకు బ్యాంకు రుణాలు ఇప్పించి ఆదుకొంటే... ఈ కళను నమ్ముకుని జీవిస్తున్న మాలాంటి కుటుంబాలకు భరోసా కలుగుతుంది.
జొల్లి శాంతి ఈరమ్మ,
మాస్టర్ వీవర్
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News