Gallbladder Cancer Symptoms: ఆ లక్షణాలు అసాధారణం
ABN , Publish Date - Sep 16 , 2025 | 02:27 AM
పిత్తాశయానికి క్యాన్సర్ సోకినప్పుడు తొలి దశల్లోనే గుర్తించడం ఒకింత కష్టమవుతూ ఉంటుంది. కానీ ఈ క్యాన్సర్‌లో బయల్పడే కొన్ని అసాధారణ లక్షణాల మీద కన్నేసి ఉంచగలిగితే తొలినాళ్లలోనే...
క్యాన్సర్ కేర్
పిత్తాశయానికి క్యాన్సర్ సోకినప్పుడు తొలి దశల్లోనే గుర్తించడం ఒకింత కష్టమవుతూ ఉంటుంది. కానీ ఈ క్యాన్సర్‌లో బయల్పడే కొన్ని అసాధారణ లక్షణాల మీద కన్నేసి ఉంచగలిగితే తొలినాళ్లలోనే కనిపెట్టి, క్యాన్సర్ నుంచి విముక్తి పొందడం సులభమే! ఆ అసాధారణ లక్షణాలు ఏవంటే...
చర్మం దురద: పిత్తాశయ క్యాన్సర్‌లో ప్రధాన లక్షణం కామెర్లు. అయితే దురదలు వేధిస్తూ ప్రత్యేకించి రాత్రివేళల్లో తీవ్రమవుతూ ఉంటాయి. క్యాన్సర్ గడ్డ బైల్ డక్ట్‌కు అడ్డుపడడం వల్ల, బైల్స్ బయటకు వెళ్లలేక కణజాలాల్లో బైల్ సాల్ట్స్ పేరుకుపోయి దురదలు వేధిస్తాయి. కాబట్టి కామెర్లతో పాటు, దురదలు కూడా వేధిస్తుంటే అప్రమత్తం కావాలి.
ముదురు రంగు మూత్రం: కామెర్ల కంటే ముందు కనిపించే లక్షణమిది. మూత్రం, మలం ముదురు రంగులోకి మారిపోతాయు. కణితి వల్ల బైల్ డక్ట్ మూసుకుపోయి, బైల్ స్రావాలు పేగుల్లోకి చేరుకోలేకపోవడంతో, రక్తంలో బైల్ సాల్ట్స్ పేరుకుపోవడం మూలంగా మలమూత్రాలు రంగు మారతాయి.
పొత్తికడుపులో గడ్డ: చివరి దశలో బయల్పడే లక్షణమిది. పొత్తికడుపులో గడ్డ ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది. బైల్‌డక్ట్ మూసుకుపోవడం మూలంగా పిత్తాశయం ఉబ్బిపోతుంది. లేదంటే క్యాన్సర్ పిత్తాశయం నుంచి కాలేయానికి పాకినప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది.
బరువు, ఆకలి తగ్గడం: అకారణంగా బరువు తగ్గడం, ఆకలి కోల్పోవడం కూడా పిత్తాశయ క్యాన్సర్ లక్షణాలే! శరీరం శక్తిని ఖర్చు చేసుకునే తీరు, జీర్ణ ప్రకియలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఈ లక్షణాలు మొదలవుతాయి. కొద్దిపాటి ఆహారానికే కడుపు నిండిపోతున్నా, ఆకలి తగ్గిపోయినా, బరువు కోల్పోతున్నా అప్రమత్తం కావాలి.
నొప్పి, అసౌకర్యం: పొత్తికడుపు పైభాగంలో కుడి వైపు స్వల్ప నొప్పి, అసౌకర్యం కొనసాగుతూ ఉంటాయి. ఈ నొప్పి, పిత్తాశయంలో రాళ్ల నొప్పిని పోలినట్టు తీవ్రంగా ఉండదు. విడతలవారీగా వస్తూ, పోతూ వెన్నులోకీ, భుజాల మధ్యకూ పాకుతూ ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News