Durga Navaratri 2025: దుర్గా నవరాత్రులు
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:06 AM
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా... నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని నవరాత్రుల సందర్భంగా...
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా... నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని నవరాత్రుల సందర్భంగా వివిధ రూపాల్లో కొలుస్తారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారి పూజ, ఆరాధన ఈ దసరా రోజుల్లో అత్యంత వైభవంగా సాగుతాయి. ఈ ఏడాది ఉత్సవాలు 11 రోజులపాటు జరుగుతాయి. ఈ సందర్భంగా దుగగ్గాదేవి అలంకార విశేషాలు, సమర్పించే నైవేద్యాల వివరాలు రోజూ ‘నవ్య’ పాఠకుల కోసం...
నేటి అలంకారం
శ్రీ బాలాత్రిపురసుందరీదేవి
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, సోమవారం
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజున శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అవతారంలో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైంది. శ్రీబాలామంత్రాన్ని సమస్త దేవీమంత్రాల్లో అత్యున్నతమైనదిగా ప్రధానమైనదిగా భావిస్తారు. శ్రీవిద్యోపాసకులకు ఉపదేశించే మొదటి మంత్రం ఇదే. మహాత్రిపురసుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలోని తొలి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని పెద్దలు చెబుతారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం బాలాత్రిపురసుందరీదేవి. ఈ అమ్మవారిని పూజిస్తే సర్వ సంపందలూ కలుగుతాయనీ, మనోవికారాలు తొలగిపోతాయనీ భక్తుల విశ్వాసం.
బాలాత్రిపుర సుందరీదేవి చతుర్భుజాలతో ఉంటారు. జపమాల, పుస్తకం ధరించి, అభయ, వరద హస్తాలతో కరుణిస్తారు. కలువ పువ్వులో ఆసీనురాలై, సమస్త శుభాలను ప్రసాదించే దివ్యమంగళ రూపంతో మూడేళ్ల బాలికలా ఆమె కనిపిస్తుందని పురాణాలు వర్ణించాయి. షోడశ విద్యలకు ఆమె అధిష్ఠాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ‘లలితా త్రిశ తి’ పారాయణ చేస్తారు.
నైవేద్యం : పాయసం, పులగం
అలంకరించే చీర రంగు : లేత గులాబీ రంగు
అర్చించే పూల రంగు : అన్ని రకాలూ!
పారాయణ: : లలితా త్రిశతి
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి