Shri Satyapramoda Tirtha: ధర్మదీక్షాచార్యుడు
ABN , Publish Date - Oct 24 , 2025 | 02:30 AM
అది ఉత్తరాది మఠం యతివరేణ్యుడైన శ్రీసత్య ధ్యానతీర్థులు తిరుచానూరులో స్థాపించిన విద్యాపీఠం. అక్కడ అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, ఫలితాలను ఒక కాగితం పై రాసి స్వామికి అధ్యాపకులు...
విశేషం
అది ఉత్తరాది మఠం యతివరేణ్యుడైన శ్రీసత్య ధ్యానతీర్థులు తిరుచానూరులో స్థాపించిన విద్యాపీఠం. అక్కడ అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, ఫలితాలను ఒక కాగితం పై రాసి స్వామికి అధ్యాపకులు అందజేశారు. సాధించిన ఫలితాలకు తగిన నగదు బహుమతిని విద్యార్థులకు స్వామివారు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఒక విద్యార్థికి మొదటి శ్రేణి మార్కులు వచ్చినా... స్వామి తక్కువ నగదు అందజేశారు. ఇది గమనించిన మఠం దీవాన్... ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. అప్పుడు స్వామి మందహాసం చేసి... ‘‘ఈ విద్యార్థి తీసుకొనేవాడు కాదు. భవిష్యత్తులో ఎంతోమందికి తానే ఇస్తాడు’’ అంటూ భవిష్యవాణి వినిపించారు. ఆ విద్యార్థి పేరు గురురాజాచార్. అతనే ఆ తరువాత ‘శ్రీసత్య ప్రమోద తీర్థులు’గా... ఉత్తరాది మఠానికి 41వ అధిపతిగా... వేదాంత సామ్రాజ్యాన్ని ఏలారు.
తర్కశిరోమణి...
శ్రీసత్య ప్రమోద తీర్థులు 1918 ఆగస్టు 28న... కర్ణాటకలోని ధార్వాడలో శ్రీరంగాచార్యగుత్తల్, కమలాదేవి దంపతులకు ‘గురురాజాచార్’గా జన్మించారు. ఆయన చిన్న వయసు నుంచే సంస్కృతం, వేద, శాస్త్రాధ్యయనాలలో చక్కటి ప్రతిభా పాటవాలు చూపి, గురువుల మెప్పు పొందారు. తర్కశాస్త్రంలో పాండిత్యానికి గాను ‘తర్కశిరోమణి’ అనే బిరుదు లభించింది. ఉత్తరాది మఠం 40వ అధిపతి అయిన శ్రీసత్యాభిజ్ఞ తీర్థులు... తన తరువాత మఠాధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు... ఆయన కలలో శ్రీసత్య ధ్యానతీర్థులు కనిపించి... గురురాజాచార్ అందుకు అర్హుడని సూచించారు. అయితే ఈ విషయాన్ని బహిర్గతం చేయడానికి ముందే శ్రీసత్యాభిజ్ఞతీర్థులు మంచానపడి, అచేతనులయ్యారు. ఆయన తన వారసుణ్ణి ప్రకటించకుండానే పరమపదిస్తారేమోనని అందరూ ఆందోళనలో ఉండగా... శ్రీసత్యాభిజ్ఞ తీర్థులు మళ్ళీ స్వస్థత చెందారు. 1947లో గురురాజాచార్యులకు సన్న్యాస దీక్షను అనుగ్రహించి, ‘శ్రీసత్య ప్రమోద తీర్థులు’గా నామకరణం చేశారు. ఉత్తరాది మఠాధిపతిగా నియమించారు.
అచంచల గురుభక్తి
మహా పండితులైన తమకు బదులుగా దక్కిన మఠాధిపత్యాన్ని శ్రీసత్య ప్రమోద తీర్థులు ఎలా నిలుపుకోగలరో చూద్దామనే అనేకమంది పండితుల అసూయా ద్వేషాలు, బలహీనమైన తన ఆరోగ్య స్థితి, క్షీణించిన మఠం ఆర్థిక పరిస్థితి... ఇలా ఎన్నో సవాళ్ళను, సమస్యలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతటి క్లిష్ట సమస్య అయినా... శ్రీసత్య ప్రమోదులు ఎన్నుకొన్న పరిష్కార మార్గం ఒక్కటే... అదే అచంచలమైన గురుభక్తి. తన గురువుల మీద ఉన్న అపారమైన విశ్వాసమే ఆయనకు శ్రీరామరక్షగా నిలిచింది. మలఖేడ్‌లో శ్రీజయతీర్థుల మూల బృందావనం దగ్గర ఆయన నిర్వహించిన మొదటి ‘సుధామంగళ’ కార్యక్రమం.. అనేకమంది పండితులను ఆయన విద్వత్తుకు దాసోహం చేసింది. అది ఆయన మొదటి విజయం. ఆయనది అద్భుతమైన జ్ఞాపకశక్తి. అలాగే ఆయన ధర్మ దీక్ష అనితర సాధ్యం. రోజూ జ్ఞానకార్యమైన ‘సుధాపాఠం’ లేనిదే... శ్రీమూలరాముల పూజ చేసేవారు కాదు.
విద్యాప్రదాత...
శ్రీసత్య ప్రమోదులు... ముంబాయిలో శ్రీసత్య ధ్యాన పీఠం, బెంగళూరులో శ్రీ జయతీర్థ విద్యాపీఠం నెలకొల్పి, ఎందరో వేద విద్యార్థులకు ప్రత్యక్షంగా తత్త్వ జ్ఞానాన్ని బోధించారు. అసంఖ్యాకమైన భక్తులకు బోధలు, మంత్రోపదేశాలు చేశారు, దీక్షలను అనుగ్రహించారు. భగవదానుగ్రహం పొందే జ్ఞానాన్ని ప్రసాదించారు. గ్రంథాలు రచించారు. ఆయన ప్రారంభించిన విద్యాదానం నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుత మఠాధిపతి శ్రీసత్యాత్మ తీర్థులకు కూడా ఆయనే మంత్రోపదేశం చేసి, సన్న్యాస దీక్ష ప్రసాదించారు. శ్రీసత్య ప్రమోదులు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి... విష్ణుభక్తిని ప్రచారం చేశారు. ఉత్తరాది మఠం పరంపరలో... శ్రీనరహరి తీర్థుల తరువాత... ఒడిశాకు విచ్చేసిన మొదటి మఠాధిపతి ఆయనే. పల్లెటూర్లకు సైతం వెళ్ళి... హిందూ ధర్మాన్ని, మధ్వ సిద్ధాంతాన్ని బోధించి, ప్రజలను జాగృతం చేశారు. వారిలో భక్తి విశ్వాసాలను దృఢపరిచారు. ఎటువంటి భోగాలను ఆశించకుండా, నిస్వార్థమైన జీవనాన్ని సాగించిన శ్రీసత్య ప్రమోదుల ఆరాధనోత్సవాలు ఈనెల 23న ప్రారంభమయ్యాయి. 25వ తేదీ వరకూ కొనసాగుతాయి. శ్రీసత్య ప్రమోదుల 108వ జయంతి సందర్భంగా... ఆయన పేరు మీద 108 రూపాయల వెండి నాణేన్ని ఈ ఏడాది ఆగస్టు ముప్ఫైన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
శ్రీ మధ్వ ప్రచార పరిషత్
ఈ వార్తలు కూడా చదవండి..
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు
Read Latest AP News And Telugu News