Share News

Healthy Tamarind Dishes: వామన చింతకాయలతో వెరైటీగా

ABN , Publish Date - Sep 06 , 2025 | 02:40 AM

పుల్లటి వామన చింతకాయలను చూడగానే నోరూరని వారుండరు. వాటితో పప్పు, పచ్చడి చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. అలాంటి వామన చింతకాయలతో చేసే రుచికరమైన వెరైటీ వంటకాలు మీ కోసం...

Healthy Tamarind Dishes: వామన చింతకాయలతో వెరైటీగా

వంటిల్లు

పుల్లటి వామన చింతకాయలను చూడగానే నోరూరని వారుండరు. వాటితో పప్పు, పచ్చడి చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. అలాంటి వామన చింతకాయలతో చేసే రుచికరమైన వెరైటీ వంటకాలు మీ కోసం...

చింతకాయ

పులిహోర

కావాల్సిన పదార్థాలు

చిన్న చింతకాయలు- 100 గ్రాములు, పొడి పొడిగా ఉడికించిన అన్నం- మూడు కప్పులు, పచ్చి మిర్చి- పది, అల్లం- చిన్న ముక్క, పసుపు- అర చెంచా, ఉప్పు- తగినంత, నూనె- మూడు చెంచాలు, పల్లీలు- తగినన్ని, మినప్పప్పు- ఒక చెంచా, పచ్చి శనగపప్పు- ఒక చెంచా, ఎండు మిర్చి- రెండు, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, ఇంగువ- చిటికెడు, జీడిపప్పు- కొద్దిగా, కరివేపాకు- కొద్దిగా, నెయ్యి- అర చెంచా

తయారీ విధానం

  • ముందుగా చింతకాయలను నీళ్లతో బాగా కడగాలి. తరవాత తొడిమలు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. మిక్సీలో చింతకాయల ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం, పసుపు, ఉప్పు, కొన్ని నీళ్ల చుక్కలు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. పల్లీలు, జీడిపప్పు వేసి దోరగా వేపి పళ్లెంలోకి తీయాలి. తరవాత ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేపాలి. ముందుగా గ్రైండ్‌ చేసి పెట్టుకున్న చింతకాయ పేస్టు కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు వేగనిచ్చి నెయ్యి వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి.

  • వెడల్పాటి గిన్నెలోకి ఉడికించిన అన్నం తీసుకోవాలి. అందులో వేయించిన పల్లీలు, జీడిపప్పు, చింతకాయ మిశ్రమం వేసి బాగా కలపాలి. ఉప్పు సరి చూసుకోవాలి. అంతే కమ్మని చింతకాయ పులిహోర రెడీ..!

చిట్కాలు

  • చింతకాయలకు ఉన్న పీచును పూర్తిగా తీసివేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అప్పుడే పులిహోర రుచిగా ఉంటుంది.

  • ఇష్టమైతే కొద్దిగా నువ్వుల పొడి కలుపుకోవచ్చు.


01-navya.jpg

చింతకాయ చికెన్‌

కావాల్సిన పదార్థాలు

చిన్న చింతకాయాలు- 100 గ్రాములు, బోన్‌లెస్‌ చికెన్‌- పావు కేజీ, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగు, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, కారం- తగినంత, ఉప్పు- తగినంత, పసుపు- చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, జీలకర్ర పొడి- ఒక చెంచా, గరం మసాల పొడి- ఒక చెంచా, కొత్తిమీర- కొద్దిగా, నూనె- మూడు చెంచాలు

తయారీ విధానం

  • ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి. చింతకాయలను శుభ్రంగా కడగాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో చింతకాయలు వేసి అవి మునిగేవరకు నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. తరవాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి. చింతకాయలను చేత్తో గట్టిగా పిండి పిప్పిని తీసివేసి గుజ్జును సిద్ధం చేసుకోవాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపాలి. తరవాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి మిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి వేసి బాగా కలపాలి. అరగ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. అయిదు నిమిషాల తరవాత చింతకాయ గుజ్జు వేసి కలపాలి. ఇది రెండు నిమిషాలు ఉడికిన తరవాత చికెన్‌ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఇలా తయారుచేసుకున్న చింతకాయ చికెన్‌ వేడి అన్నం, చపాతీ, పుల్కాల్లోకి రుచిగా ఉంటుంది.

వామన చింతకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ని నివారిస్తాయి. వీటిని తినడం వల్ల గర్భిణుల్లో వాంతులు, వికారం తగ్గుతాయి. మహిళల్లో రుతు సమస్యలు రావు. వామన చింతకాయలతో చేసిన వంటకాలు తినిపిస్తే చిన్న పిల్లలకు కడుపులో నులిపురుగుల సమస్య తీరుతుంది.

చిట్కాలు

  • కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా జీడిపప్పు, పల్లీలు, గసగసాల పేస్టు వేసి కలిపితే కమ్మటి రుచి వస్తుంది.

  • చికెన్‌ ముక్కలను తగుమాత్రం ఉడికిస్తే తినడానికి బాగుంటుంది.


2-navya.jpg

చింతకాయ పప్పుచారు

కావాల్సిన పదార్థాలు

చిన్న చింతకాయలు- 150 గ్రాములు, కందిపప్పు- 200 గ్రాములు, పసుపు- అర చెంచా, కరివేపాకు- కొద్దిగా, పచ్చిమిర్చి- అయిదు, నూనె- మూడు చెంచాలు, కారం- ఒక చెంచా, ఉప్పు- తగినంత, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఎండు మిరపకాయలు- మూడు, ఉల్లిపాయలు- రెండు, ఇంగువ- పావు చెంచా, టమాటా- ఒకటి, కొత్తిమీర- కొద్దిగా

తయారీ విధానం

  • చింతకాయలను నీళ్లతో శుభ్రంగా కడగాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి చింతకాయలు వేసి అవి మునిగేవరకు నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. తరవాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి. అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి చేత్తో పిసికి రసం తీసుకోవాలి.

  • స్టవ్‌ మీద కుక్కర్‌ పెట్టి అందులో కందిపప్పు వేసి ఒక గ్లాసు నీళ్లు పోయాలి. తరవాత పావు చెంచా పసుపు, పచ్చిమిర్చి చీలికలు, ఒక చెంచా నూనె వేసి మూతపెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

తరవాత కుక్కర్‌ను స్టవ్‌ మీద నుంచి దించి అది చల్లారాక మూత తీసి అందులో చింతకాయ రసం వేసి బాగా కలపాలి. తరవాత కారం, ఉప్పు, మరో రెండు గ్లాసుల నీళ్లు పోసి కలపాలి.

  • స్టవ్‌ మీద మందపాటి పెద్ద గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపాలి. తరవాత టమాటా ముక్కలు వేసి కలపాలి. అయిదు నిమిషాల తరవాత పప్పు-చింతకాయ రసం మిశ్రమాన్ని పోసి బాగా కలపాలి. పెద్ద మంటమీద పది నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్‌ మీద నుంచి దించాలి.

చిట్కాలు

  • కందిపప్పును పావుగంటసేపు నీళ్లలో నానబెడితే మెత్తగా ఉడుకుతుంది.

  • ఆలుగడ్డ, సొరకాయ, కేరట్‌, బెండకాయ, మునక్కాడలు, ముల్లంగి లాంటి కూరగాయల ముక్కలను విడిగా ఉడికించి ఇందులో కలుపుకోవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

 ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..

మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి

Read Latest TG News and National News

Updated Date - Sep 06 , 2025 | 02:40 AM