Share News

Jiddu Krishnamurti: నిజమైన స్వాతంత్య్రం కోసం

ABN , Publish Date - Aug 08 , 2025 | 02:09 AM

‘‘మనిషికి అతని చైతన్యం మీద ఉండే ప్రభావాలు మాయమైతేనే అతనికి నిజమైన స్వాతంత్య్రం వస్తుంది. సత్యాన్ని గ్రహించే శక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచ ద్వారం తెరుచుకుంటుంది’’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. పెంపకం, సమాజం, చరిత్ర...

Jiddu Krishnamurti: నిజమైన స్వాతంత్య్రం కోసం

చింతన

‘‘మనిషికి అతని చైతన్యం మీద ఉండే ప్రభావాలు మాయమైతేనే అతనికి నిజమైన స్వాతంత్య్రం వస్తుంది. సత్యాన్ని గ్రహించే శక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచ ద్వారం తెరుచుకుంటుంది’’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. పెంపకం, సమాజం, చరిత్ర లాంటి ఎన్నో ప్రభావాలు మనమీద ఉంటాయి. శ్రమపడి వాటిని వదిలించుకోవచ్చు. అయితే అవి మనల్ని పూర్తిగా వదిలిపెట్టవు. మన చైతన్యంలోని గాఢమైన లోతుల్లో... మనం సులువుగా గుర్తించలేని, ఘనీభవించిన మూడు ప్రభావాలు ఉంటాయి, అవి: ఆలోచనా ప్రక్రియ, కాలం, అహంకారం. ఇవి కూడా మనల్ని వదిలినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం వస్తుంది.

ఆలోచన...

మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. నిద్రలో కూడా ఆలోచనలను కలల రూపంలో కొనసాగిస్తాం. వాటిని అరికట్టాలనే నిర్ణయం తీసుకుంటే... దానిలోంచే రకరకాల ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఇది మన అదుపులో లేని నిరంతర కార్యక్రమం. దీనికి కారణం ఏమిటి? ఒక ఉదాహరణకు... నిన్న సాయంత్రం రమ్యమైన సూర్యాస్తమయాన్ని ఆనందించాను. ఆ ఆనందాన్ని కొనసాగించాలనే ధ్యేయంతో, వీలైతే ఆ ఆనందం మరోసారి అనుభవించాలనే కోరికతో నేను ఆ సూర్యాస్తమయం గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచన సుఖ సూత్రంతో (ప్రెజర్‌ ప్రిన్సిపల్‌) ముడిపడి ఉంటుంది. అలాగే ‘‘మనం కష్టాలను, దుఃఖాలను తప్పించుకోవాలని అనుకుంటాం. అందువల్ల కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనల్లో కాలం, అహంకారం పుడతాయి’’ అని చెబుతారు జిడ్డు కృష్ణమూర్తి.

కాలం...

సూర్యాస్తమయాన్ని చూస్తున్నప్పుడు... చైతన్యంలో ఆ అనుభవం మాత్రమే ఉంటుంది, కాలం ఉండదు. ఆ తరువాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు... ‘‘నిన్న సాయంత్రం సూర్యాస్తమయాన్ని అనుభూతి చెందాను. వచ్చే ఆదివారం మళ్ళీ అది అనుభవించాలి’’ అనే ఆలోచనలతో... గతం, భవిష్యత్తు- అంటే కాలం పుడుతుంది.


అహం...

ఒక ప్రబలమైన అనుభవంలో నిజానికి ‘నేను’ లేదా ‘అహం’ అనే స్ఫురణ ఉండదు. ఉత్త అనుభవం మాత్రమే ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు ‘అహం’ పుడుతుంది. ‘సూర్యాస్తయమాన్ని నిన్న సాయంత్రం అనుభవించాను, వచ్చే ఆదివారం మళ్ళీ అనుభవించాలి’ అని బయలుదేరే ఆలోచనల్లో అహం పుట్టి, అది ఒక కేంద్రంగా మారుతుంది. ఈ సత్యాన్ని ప్రప్రథమంగా చెప్పినవారు జిడ్డు కృష్ణమూర్తి. అలా పుట్టిన అహం... చైతన్యాన్ని కేంద్రం, పరిధులుగా విభజిస్తుంది. అన్ని అనుభవాలు కాలంతో కలిసి, జ్ఞాపకాలుగా మారి అహాన్ని పెనవేసుకుంటాయి. ప్రభావాలను సంపూర్ణంగా వదిలించుకోవాలంటే... ఆలోచనలను, కాలాన్ని, ‘నేను’ అనే భావాన్ని నిర్మూలించాలి. ఇదే జిడ్డు కృష్ణమూర్తి చెప్పే డీకండిషనింగ్‌. మంత్రోపదేశాలతో, దీక్షలతో, దీర్ఘమైన తపస్సులతో, కఠోరమైన వ్రతాలతో ఇది వీలుకాదనే విషయాన్ని ఆయన విశ్లేషించి చూపారు. శాస్త్రాల మార్గం అహంతో ముడిపడి ఉంటుంది. ‘‘పక్షమో, ఆరు నెలలో సాధన చేస్తే ఫలితం భవిష్యత్తులో కనిపిస్తుంది’’ అంటుంది సంప్రదాయం. ‘‘సాధన వల్ల సాధకుడిలో క్రమంగా కుండలినీ శక్తి మేలుకొని, షట్చక్రాలను ఛేదిస్తూ... సహస్రారాన్ని చేరినప్పుడు చైతన్య విస్తరణ జరుగుతుంది’’ అంటుంది శాస్త్రం. అంటే ఈ సాధన ఆలోచన, కాలం పరిధులలో ఉంటుంది. కానీ ‘‘ఈ కుండలినీ శక్తి కాలానికి, ఆలోచనలకు, అహంకారానికి అతీతమైనది’’ అని ఆ శాస్త్రమే చెబుతుంది. అంటే శాస్త్రం తనను తానే ఖండించుకుంటోంది. ఇదే జిడ్డు కృష్ణమూర్తి చేసిన విమర్శ. ‘‘సంప్రదాయ మార్గం నిరర్థకం. ఆ ప్రభావాలన్నింటినీ ఒక్క క్షణంలో ధ్వంసం చేయాలి. అహంకారం బాంబులా పేలి, రెప్పపాటులో మాయమైపోవాలి’’ అంటారాయన.


అది ఎలా సాధ్యం?

సూర్యాస్తమయాన్ని చూస్తున్న క్షణంలో... ఆలోచనలు మాయమైపోతాయి, కాలం, అహం తాలూకు స్పృహ ఉండదు. సూర్యుడు, చైతన్యం ఒక్కటైపోతాయి. ఆ అనుభవాన్ని అక్కడితో పరిసమాప్తి చేయాలి. లేకుంటే... దానినుంచి ఆలోచనాపరంగా దూరమవుతున్నప్పుడు... కాలం, అహం తలెత్తుతాయి. చైతన్యాన్ని కబ్జా చేస్తాయి. కాగా... ‘తీవ్రమైన అనుభవం కావాలి’ అనే ఉద్దేశంతో... ఒక కొండ మీద కూర్చొని, సూర్యాస్తమయం కోసం ఎదురు చూడడం కూడా నిరర్థకమే. ఆ ఉద్దేశం... కాలంతో, అహంతో ముడిపడిన ఆలోచనే కదా! ఆనందకరమైన అనుభవాల విషయంలోనే కాదు... ప్రతి అనుభవ స్వరూపమూ ఇంతే. క్రోధంలో క్రోధం ఒక్కటే ఉంటుంది. ఆలోచన, కాలం, అహం మాయమైపోతాయి. అసూయ, ద్వేషం, దుఃఖం లాంటి అనుభవాలు కూడా ఇంతే. ‘మంచి అనుభవం, చెడ్డ అనుభవం’ అనే భేదం ఉండదు. మనకు తారసిల్లే అనుభవాలకు మనం నిష్పాక్షికంగా లొంగిపోయి, వాటిలో లీనమైపోవాలి. అలా లీనమైన క్షణంలోనే ఆధ్యాత్మిక రహస్యాలన్నీ దాక్కొని ఉన్నాయి. ఆ క్షణంలోనే నిజమైన డీకండిషనింగ్‌ జరుగుతుంది, సంపూర్ణ స్వాతంత్య్రం దొరుకుతుంది.

గుంటూరు వనమాలి (www.gunturu.de)

ఈ వార్తలు కూడా చదవండి..

కుట్టిన సాలీడు.. బాలిక మృతి

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

For More Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2025 | 02:10 AM