Building Inner Strength: ఇలా మనసు దిటవు
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:33 AM
జీవితంలో ఎన్నో హఠాత్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి ఊహించని సందర్భాన్ని ఎదుర్కొని, మనసును కుదుటపరుచుకుని, జీవితంలో ముందుకు సాగే ఆత్మస్థయిర్యం...
అక్టోబరు 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
జీవితంలో ఎన్నో హఠాత్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి ఊహించని సందర్భాన్ని ఎదుర్కొని, మనసును కుదుటపరుచుకుని, జీవితంలో ముందుకు సాగే ఆత్మస్థయిర్యం అందరికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆ విపత్కర పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో తెలుసుకుందాం!
సమస్యలు చెప్పి రావు. ఒక్కోసారి అందుకు సంసిద్ధమయ్యే సమయం కూడా చిక్కకపోవచ్చు. ఊహించని సమయంలో అకస్మాత్తుగా తలెత్తే జీవిత సమస్యలు ఎంతటివారినైనా అతలాకుతలం చేసేస్తాయి. హఠాత్తుగా రాత్రికి రాత్రే కుటుంబ పెద్ద గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవచ్చు. కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి బయల్పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఒక్కసారిగా కుదేలైపోతూ ఉంటాం. కానీ కాలాన్ని వెనక్కి మళ్లించలేకపోయినా, ఆ పరిస్థితితో ఎలా నడుచుకోవాలో, మనసును ఎలా దిటవు చేసుకోవాలో తెలుసుకోవాలి. సమిష్ఠిగా సమస్యతో పోరాడే ఆత్మస్థైర్యాన్ని కుటుంబం కూడగట్టుకోవాలి.
ధైర్యం నూరిపోస్తూ... ధైర్యంగా ఉంటూ...
కుటుంబంలో ఒకరికి తీవ్ర అనారోగ్యం సోకితే మిగతా కుటుంబ సభ్యులు ఎంతో వేదనకు లోనవుతారు. మరీ ముఖ్యంగా పెద్దలు ఓ పక్క బాధను దిగమింగుకుంటూనే, మిగతా కుటుంబసభ్యులను ఓదార్చవలసి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో బెంబేలు పడిపోకుండా, అనారోగ్యానికి గురైన వ్యక్తులను భరోసా కల్పించాలి. వ్యాధికి సంబంధించిన లోతైన అవగాహనను ఏర్పరుచుకుంటూ, అందుబాటులోకొచ్చిన విజయవంతమైన చికిత్సల గురించి, కోలుకున్న వ్యక్తుల విజయగాధల గురించి రోగికి వివరిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. రోగి పట్ల జాలి కనబరచడం, విషాదకరమైన వృత్తాంతాలను గుర్తు చేసుకోవడం, చికిత్సకయ్యే ఖర్చుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి రోగి ముందే చర్చించడం లాంటివి చేయకూడదు. రోగిని తన గదికే పరిమితం చేయకుండా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం కల్పిస్తూ ఉండాలి. వారికి నచ్చిన వ్యక్తులను ఇంటికి పిలిపిస్తూ, నచ్చిన పనులు చేయిస్తూ కాలక్షేపాన్ని అందించాలి. కుంగుబాటులోకి కూరుకుపోతున్నారేమోనని గమనిస్తూ ఉండాలి. వారి అభిరుచులకు సంబంధించిన వీడియోలు, సినిమాలు చూపించాలి. అవసరమనుకుంటే కౌన్సెలింగ్ థెరపి్‌స్టను ఇంటికి పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించాలి. రోగితో వ్యవహరించవలసిన తీరు గురించి కౌన్సెలర్‌ను అడిగి తెలుసుకోవాలి.
భాగస్వామిని కోల్పోతే...
గుండెపోటుతో అకస్మాత్తుగా భాగస్వామిని కోల్పోయినప్పుడు ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచమంతా కుప్పకూలిపోతుంది. జీవితంలో శూన్యం ఆవహిస్తుంది. నిజానికి ఈ దుస్థితిని ఎదుర్కొన్న ఎవరికైనా ఈ లోటు పూడ్చలేనిదే! అయినా ఆ పరిస్థితిని అంగీకరించే ఆత్మనిబ్బరాన్ని పెంపొందించుకోవాలి. జరిగిపోయినదాన్ని సరిదిద్దలేమనే విషయాన్ని మొదట అర్థం చేసుకుని, మున్ముందు జరగబోయే పనుల గురించి ఆలోచించాలి. భాగస్వామి లేని లోటును భర్తీ చేసే బాధ్యత తమ మీద ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ కష్టం నాకే రావాలా? నాకే ఇలా ఎందుకు జరిగింది? అనుకుంటూ కుంగుబాటుకు లోనవడం సరికాదు. మనకంటే ఎక్కువ కష్టాలను ఎదుర్కొనే వాళ్లు కూడా ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పిల్లలకు మనోధైర్యాన్ని నూరిపోస్తూ, మనోనిబ్బరంతో మసలుకోవడం అలవాటు చేసుకోవాలి. భాగస్వామిని కోల్పోయిన వేదన కొన్ని రోజుల పాటు వేధించవచ్చు. నిద్ర కరవవవచ్చు. నీరసించిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వైద్యుల సహాయం తీసుకోవాలి. నెలల తరబడి కుంగుబాటు వేధిస్తే మానసిక వైద్యులను ఆశ్రయించాలి. వీలైనంత త్వరగా జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి. మనసు దిగులులో కూరుకుపోకుండా పనులు కల్పించుకోవాలి. గతాన్నే గుర్తు చేసుకునే ధోరణికి స్వస్థి చెప్పాలి. పాత జ్ఞాపకాలు పదే పదే వేధిస్తుంటే, స్థల మార్పిడి కొంత మేరకు సహాయపడుతుంది.
డాక్టర్ పి.రాధిక,
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్,
విజయవాడ
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News