బ్రిటన్ నిఘాకు లేడీ బాస్
ABN , Publish Date - Jun 18 , 2025 | 02:14 AM
116 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో బ్రెయిస్ మెట్రివెలీ అనే 47 ఏళ్ల మహిళ... తొలిసారిగా చీఫ్‌గా ఎంపికైంది. ప్రపంచ అస్థిరతతో పాటు పెరుగుతున్న భద్రతాపరమైన సవాళ్లను...

న్యూస్ మేకర్
116 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో బ్రెయిస్ మెట్రివెలీ అనే 47 ఏళ్ల మహిళ... తొలిసారిగా చీఫ్‌గా ఎంపికైంది. ప్రపంచ అస్థిరతతో పాటు పెరుగుతున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో మెట్రివెలీతో పాటు గతంలో ఇంటెలిజెన్స్ సర్వీ్‌సలో సేవలందించిన మరికొందరు మహిళలు కూడా అమోఘమైన ప్రతిభను కనబరిచారు. వాళ్ల గురించిన ఆసక్తికరమైన విశేషాలు...
జేమ్స్‌బాండ్ 007 సినిమాలు చూసే అలవాటున్న వాళ్లకు, శక్తివంతమైన ‘ఎమ్’ పాత్ర పోషించిన నటి ‘జూడి డెంచ్’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు నిజ జీవితంలో అదే పాత్రను పోషించబోతోంది బ్రెయిస్ మెట్రివెలీ. తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్, ఎమ్‌ఐ6 మెట్రివెలీని చీఫ్‌గా ఎంచుకుంది. దాంతో ప్రస్తుతం ఎమ్‌ఐ6లో, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్‌కు డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్న మెట్రివెలీ, అక్టోబరు 1న, ఎమ్‌ఐ6కు 18వ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతోంది. గతంలో ఎమ్‌ఐ5లో దేశ భద్రతకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహించిన మెట్రివెలీ, 1999లో కేస్ ఆఫీసర్‌గా ఇంటెలిజెన్స్ సేవల్లోకి అడుగుపెట్టింది. సేవల సంప్రదాయం ప్రకారం కొత్త చీఫ్ కాబోతున్న మెట్రివలీ ‘సి’ అనే పేరును ఉపయోగించుకోబోతోంది. వెస్ట్ మినిస్టర్ స్కూల్‌లో ఎ లెవల్స్ పూర్తి చేసిన మెట్రివెలీ కేంబ్రిడ్జ్, పెంబ్రోక్ కాలేజీలో ఆంథ్రొపాలజీ చదివింది. 1997లో మహిళల పడవ పందెంలో గెలుపొందిన సిబ్బందిలో ఈమె కూడా ఒక సభ్యురాలు. 1999లో ఇంటెలిజెన్స్‌లో చేరిన ఈమె, ఎమ్‌ఐలో డైరెక్టర్ స్థాయిలో సేవలందించింది. 2021లో టెలిగ్రా్‌ఫకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి వివరిస్తూ, పిల్లలు స్వయంగా దర్యాప్తు చేసి తన అసలు వృత్తి గురించి తెలుసుకున్నారనే విషయాన్ని బహిర్గతం చేసింది. మెట్రివెలీ మాదిరిగానే నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూ, అత్యద్భుతమైన మేథస్సును ప్రదర్శిస్తూ, ఇంటెలిజెన్స్, గూఢచర్య రంగాల్లో గణనీయమైన కృషి చేసిన మహిళాధికారులు గతంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ల గురించి కూడా తెలుసుకుందాం!
వర్జీనియా హాల్
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అత్యంత విశిష్టమైన గూఢచారిగా మారిన అమెరికా మహిళ ఈమె. కృత్రిమ చెక్క కాలుతో విధులు నిర్వహించిన ఈ మహిళ, ఆఫీస్ ఆఫ్ ది స్ట్రాటెజిక్ సర్వీసె్‌సకు ఫీల్డ్ ఏజెంట్‌గా పని చేస్తూ, విధ్వంసక మిషన్లు చేపట్టడంలో మిత్రదేశాల సైనికులు తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించింది. యుద్ధ సమయంలో విశిష్టమైన సర్వీస్ క్రాస్‌ను అందుకున్న ఏకైక మహిళా పౌరురాలు.. ఈ వర్జీనియా హాల్.
నూర్ ఇనాయత్ ఖాన్
బ్రిటిష్ ఇండియన్ రాకుమారి, మొట్టమొదటి మహిళా వైర్‌లెస్ ఆపరేటర్ అయిన ఈమెకు నోరా బేకర్ అనే మరో పేరు కూడా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈమెను నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లోకి పంపించారు. మ్యాడెలీన్ అనే కోడ్ నేమ్‌తో విధులు నిర్వర్తించిన నూర్, చివరకు పట్టుబడి ప్రాణాలు పోగొట్టుకునే వరకూ కీలకమైన సమాచారాన్ని చేరవేస్తూనే ఉంది. నూర్ కనబరిచిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఆమెను జార్జ్ క్రాస్ బిరుదుతో గౌరవించారు.
ఏమీ ఎలిజబెత్ థోర్ప్
ఈ ఆంగ్లో అమెరికన్ మహిళా గూఢచారికి బెట్టీ ప్యాక్, బెట్టీ థోర్ప్, ఎలిజెబెత్ ప్యాక్ అనే ఇతరత్రా పేర్లు కూడా ఉన్నాయి. ఈమె రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కూ, అమెరికాకూ సేవలందించింది. సింథియా అనే కోడ్ నేమ్ కలిగి ఉన్న ఏమీ, తన అందచందాలతో విదేశీ అధికారులను ఆకట్టుకుని, వారి నుంచి జర్మన్ ఎనిగ్మా కోడ్స్, ఫ్రెంచ్ నావిక రహస్యాలతో పాటు సున్నిత సమాచారాన్ని రాబట్టింది.
మెలిటా నార్‌ఉడ్
ఈ బ్రిటిష్ ప్రభుత్వోద్యోగిని, కొన్ని దశాబ్దాల పాటు సోవియట్ యూనియన్‌కు రహస్యంగా అణు రహస్యాలను చేరవేసింది. బ్రిటనల్‌లో దీర్ఘకాలం పాటు పని చేసిన సోవియట్ గూఢచారి ఈమె. ‘హోలా’ అనే కోడ్ నేమ్‌తో పని చేసినన మెలిటా గూఢచర్యం ఆమె మరణానంతరం బహిర్గతమైంది.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News