Share News

ప్రేమను పంచేందుకే వచ్చాం

ABN , Publish Date - Feb 14 , 2025 | 02:58 AM

మనలో చాలామంది కనీసం ఇరవై మంది సభ్యులు ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించడం చూసిన తరం నుంచి వచ్చారు. ప్రస్తుత తరంలో వివాహం చేసుకోకూడదని లేదా పిల్లలను...

ప్రేమను పంచేందుకే వచ్చాం

బ్రహ్మకుమారీస్‌

మనలో చాలామంది కనీసం ఇరవై మంది సభ్యులు ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించడం చూసిన తరం నుంచి వచ్చారు. ప్రస్తుత తరంలో వివాహం చేసుకోకూడదని లేదా పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్న యువతీ యువకుల తరాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సంబంధాలను ఒత్తిడితో కూడుకున్నవిగా, వాటివల్ల చాలా భావోద్వేగాలకు గురికావలసి ఉంటుందనే ఆలోచనతో... వాటికి దూరంగా ఉండాలని, ఒంటరిగా జీవించాలనీ చాలామంది నిశ్చయించుకుంటున్నారు. కానీ ఈ ధోరణి సరైనది కాదు. ఎందుకంటే మానవులు ప్రేమ జీవులు. మనలో ఎంతో ప్రేమ ఇప్పటికే ఉంది. ఇతరుల నుంచి మనం ప్రేమ కోసం యాచించవలసిన అవసరం లేదు. అయితే ఇతరులు మనకు ప్రేమను ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వారు కూడా ప్రేమకోసం ఎదురుచూస్తున్నారు. మనమందరం మనలో ఉన్న ప్రేమను గుర్తించడం లేదు, దాన్ని పెంపొందించుకోవడం లేదు. ప్రేమించడం అనేది ఆత్మ తాలూకు అసలు స్వభావం. ‘నేను ప్రేమను పంచడం కోసమే ఇక్కడకు వచ్చాను’ అనేది తెలుసుకోవాలి. మనం మన అంచనాలను తగ్గించుకొని, బేషరతుగా ప్రేమించినప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి.


రీఛార్జ్‌ చేసుకుందాం...

మరి ప్రేమను ఇవ్వగలిగేలా మనం మనల్ని ఎలా సిద్ధం చేసుకోగలం? దీనికి బ్యాటరీని ఉదాహరణగా తీసుకుందాం. మన ‘అంతరాత్మ’ను ఒక బ్యాటరీ అని అనుకుందాం. అది పూర్తిగా ఛార్జ్‌ అయి ఉన్నప్పుడు... మీరు భావోద్వేగపరంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆనందం, శాంతి, ప్రేమ... ఇదే మన సహజమైన జీవన విధానం. మన నిర్లక్ష్యం కారణంగా బ్యాటరీలోని ఛార్జ్‌ తగ్గిపోయినప్పుడు... అంటే మనలోపలి నుంచి ఆనందాన్ని, శాంతిని, ప్రేమను మనం పొందలేనప్పుడు... కొనుగోలు చేసిన వస్తువులలో, మనం సాధించిన విషయాల్లో వాటిని వెతకడం ప్రారంభిస్తాం. తీర్థయాత్రల్లో, సెలవు రోజుల్లో శాంతిని వెతుక్కుంటాం. ఇతరులు మనల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాం, సరే! కానీ మనం వారికి తిరిగి ఏమి ఇవ్వాలి? మీలో లేని వాటిని లేదా తక్కువైన వాటిని ఇతరులకు ఎలా ఇవ్వగలరు?


మనమే ప్రేమగా మారాలి..

కాబట్టి మనల్ని మనం రీఛార్జ్‌ చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా మనల్ని మనం శక్తిమంతం చేసుకోవాలి. ఉదయం లేవగానే ధ్యానం చేయడం, మంచి గ్రంథాలను చదవడం, సంతోషంగా, సంతృప్తి ఉండడం లాంటి సానుకూల చర్యలతో రోజును ప్రారంభించాలి. దీనికోసం ప్రతి ఉదయం కనీసం ముప్ఫై నిమిషాల నుంచి ఒక గంట వరకూ కేటాయించాలి. దీనివల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. రోజును సజావుగా సాగించడానికి ఇది దోహదం చేస్తుంది. మనల్ని మాత్రమే మనం ప్రేమించుకోవడానికి అలవాటు పడిన పరిస్థితుల్లో... స్వార్థ వూరితంగా మారకుండా మనల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రేమతో నిండినప్పుడు, అందరికీ ప్రేమను అందించగలం. మన లోపల అంతా ఖాళీ అయితే... ఇతరులు కనబరిచే కాస్త ప్రతికూలత కూడా మనల్ని తీవ్రంగా బాధపడుతుంది. మన తిరస్కరణకు, నియంత్రణకు గురైనట్టు భావిస్తాం. ఎందుకంటే మన లోపల శక్తి లేదు. మనం మానసికంగా ఆరోగ్యంగా లేము. దీనివల్ల ఇతరుల నుంచి వైదొలగుతాం. మనం ప్రేమను కోరుకోవడం కాదు, మనమే ప్రేమగా మారాలి. మన ఆత్మను నిరంతరం శక్తిమంతం చేసుకోవడం మనం మనంగా ఉండడమే దీనికి మార్గం.

బ్రహ్మకుమారి బి.కె.శివాని


Also Read:

ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..

బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..

అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 14 , 2025 | 02:58 AM