Share News

Bollywood Celebrity Brands: భామల బ్రాండ్స్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 02:26 AM

బాలీవుడ్‌ బ్యూటీలు తెర మీద అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో పాటు, అంతకు మించిన అద్భుతమైన బ్రాండ్లకు అధిపతులవుతున్నారు. ప్రముఖ తారలు, వాళ్ల సొంత బ్రాండ్ల గురించి...

Bollywood Celebrity Brands: భామల బ్రాండ్స్‌

ట్రెండ్‌

బాలీవుడ్‌ బ్యూటీలు తెర మీద అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో పాటు, అంతకు మించిన అద్భుతమైన బ్రాండ్లకు అధిపతులవుతున్నారు. ప్రముఖ తారలు, వాళ్ల సొంత బ్రాండ్ల గురించి తెలుసుకుందామా?

గ్లామర్‌, స్టైల్‌కు మారుపేరుగా నిలిచే హిందీ తారలు బ్రాండ్ల ప్రచారానికే పరిమితం కాకుండా సొంత దుస్తులు, సౌందర్య సాధనాల బ్రాండ్లను లాంచ్‌ చేసుకుంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలో తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి కొందరు ప్రముఖులు, వారి బ్రాండ్లు ఇవే...

మసాబా.. లవ్‌ ఛైల్డ్‌

నీనా గుప్తా కూతురు మసాబా గుప్తా తనదైన ప్రత్యేకమైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌కు గుర్తింపు పొందింది. హౌస్‌ ఆఫ్‌ మసాబా అనే దుస్తుల లేబుల్‌ను కలిగి ఉన్న మసాబా, బ్యూటీ బ్రాండ్‌, లవ్‌చైల్డ్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఈ చర్మసౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌లో పలురకాల లిప్‌స్టిక్‌లూ, ఫౌండేషన్‌లూ ఉంటాయి. నీనా గుప్తా, క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ ప్రేమ ఫలితంగా పుట్టిన తాను ‘లవ్‌చైల్డ్‌’గా గుర్తింపు పొందడాన్ని ప్రారంభంలో ప్రతికూలంగానే భావించాననీ, కానీ ఆ స్టేట్‌సను సవాలు చేసేలా, అసాధారణమైన అంశాన్ని సరళతరం చేయాలని సంకల్పించినట్టు మసాబా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆ క్రమంలోనే లవ్‌ఛైల్డ్‌ అనే బ్రాండ్‌ను సృష్టించి, తనదైన విప్లవాత్మక నైజాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది మసాబా.

అక్కాచెల్లెళ్ల... రీసన్‌

అత్యంత ఫ్యాషన్‌గా కనిపించే సోనమ్‌ కపూర్‌, రియా కపూర్‌లను ప్రస్థావించకుండా ఫ్యాషన్‌ గురించి మాట్లాడడం అసంభవం. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు రీసన్‌ అనే సొంత దుస్తుల బ్రాండ్‌ను కలిగి ఉన్నారు. ట్రెండీగా, అందుబాటు ధరల్లో దొరికే వస్త్ర ప్రపంచం వీరిది. వీటిలో క్యాజువల్‌ వేర్‌ బాగా ప్రసిద్ధి పొందింది. 2017లో లాంచ్‌ చేసిన ఈ బ్రాండ్‌ ఎంతో తక్కువ కాలంలోనే మహిళల ఆదరణను చూరగొనడం విశేషం.


ముగ్గురు ప్రముఖుల... లేబుల్‌ లైఫ్‌

సుసాన్‌ ఖాన్‌, బిపాషా బసు, మలైకా అరోరా... ఎవరి పరిధిలో వాళ్లు తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు ప్రముఖులూ కలిసి లేబుల్‌ లైఫ్‌ అనే దుస్తుల బ్రాండ్‌ను రూపొందించారు. 2012లో లాంచ్‌ అయిన ఈ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌, దుస్తులతో పాటు, గృహాలంకరణ వస్తువులు, మహిళల యాక్సెసరీ్‌సలను అందిస్తుంది. మహిళల వస్త్రాలకే పరిమితం కాకుండా మహిళలు ఇష్టపడే గృహాలంకరణ ఉత్పత్తుల మీద దృష్టి సారించి, తమలోని వ్యాపార మెలకువలను చాటుకున్నారు.

కత్రినా ఖైఫ్‌... కె బ్యూటీ

తన పేరులోని మొదటి అక్షరమైన ‘కె’ పేరుతో.. 2019లో కె బ్యూటీ బ్రాండును లాంచ్‌ చేసింది కత్రినా ఖైఫ్‌. అత్యుత్తమ నాణ్యతతో కూడిన, మేకప్‌ ఉత్పత్తులను ఈ బ్రాండ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. లిప్‌స్టిక్స్‌, ఐలైనర్స్‌, ఫౌండేషన్‌ మొదలైన సౌందర్యసాధనాలు ఈ బ్రాండ్‌లో దొరుకుతాయి.

అనుష్క శర్మ... నష్‌

అద్భుతమైన నటనా నైపుణ్యాలతో అభిమానులను అలరించిన అనుష్క సొంత బ్రాండ్‌ గురించి తెలిసిన వాళ్లు తక్కువ. 2017లోనే ఈమె దుస్తుల బ్రాండ్‌ ‘నష్‌’ను లాంచ్‌ చేసింది. సౌకర్యంగా ఉండే దుస్తుల కొరతను గమనించిన అనుష్క, సౌకర్యంతో పాటు స్టైల్‌కు ప్రాధాన్యమిస్తూ వినూత్నంగా, విభిన్నంగా ఉండే దుస్తుల బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌... జస్ట్‌ ఎఫ్‌

ఫ్యాషన్‌ ప్రపంచ రారాణిగా పేరుపొందిన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫ్యాషన్‌ సెన్స్‌కు అభిమానులు దాసోహమవుతూ ఉంటారు. ట్రెండీగా, అధునికంగా కనిపించే వస్త్రధారణను అనుసరించే జాక్విలిన్‌ 2018లో జస్ట్‌ ఎఫ్‌ పేరుతో వస్త్రాల బ్రాండ్‌కు శ్రీకారం చుట్టింది. సరికొత్త ఫ్యాషన్లను అనుసరిస్తూ, అందుబాటు ధరల్లో రూపొందే జస్ట్‌ ఎఫ్‌ దుస్తులు అన్ని వయసుల మహిళలనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరీముఖ్యంగా క్యాజువల్‌ వేర్‌ దుస్తుల అవసరతను గుర్తించిన జాక్వెలిన్‌, తెలివిగా తన బ్రాండ్‌తో ఆ ఖాళీని భర్తీ చేయడం తెలివైన ఎత్తుగడ అని వ్యాపార నిపుణులు భావిస్తూ ఉంటారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వర్షాలు..

బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత

For More AP News And Telugu News

Updated Date - Nov 27 , 2025 | 02:26 AM