Share News

Best Countries in the World for Women: మహిళలకు స్వర్గధామం ఈ దేశాలే

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:20 AM

మహిళలు స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించడానికి, సమాన అవకాశాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రపంచంలో అత్యుత్తమ దేశాలు ఏవి? ఈ ప్రశ్నకు జార్జిటౌన్‌ ఫర్‌ ఉమెన్‌, పీస్‌ అండ్‌ సెక్యూరిటీ, పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌...

Best Countries in the World for Women: మహిళలకు స్వర్గధామం ఈ దేశాలే

మహిళలు స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించడానికి, సమాన అవకాశాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రపంచంలో అత్యుత్తమ దేశాలు ఏవి? ఈ ప్రశ్నకు జార్జిటౌన్‌ ఫర్‌ ఉమెన్‌, పీస్‌ అండ్‌ సెక్యూరిటీ, పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఓస్లో సంయుక్తంగా విడుదల చేసిన ‘ఉమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ (డబ్ల్యూపీఎస్‌) ఇండెక్స్‌ 2025-26 నివేదిక సమాధానం ఇచ్చింది. ఈ జాబితాలో యూరోపియన్‌ దేశాలు మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. మహిళల భద్రత, సాధికారతకు చిరునామాగా నిలుస్తూ తొలి ఏడు స్థానాల్లో కొలువుదీరాయి.

అగ్రపీఠంపై డెన్మార్క్‌

ఈ జాబితాలో 0.939 స్కోర్‌తో డెన్మార్క్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ మహిళలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. బలమైన సంక్షేమ పథకాలు, తక్కువ ఖర్చుతో శిశు రక్షణ, సురక్షితమైన పబ్లిక్‌ ప్రదేశాలు, లింగ ఆధారిత హింస చాలా తక్కువగా ఉండటం వంటి అంశాలు డెన్మార్క్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఆ తర్వాత 0.932 స్కోర్‌తో ఐస్‌లాండ్‌ రెండోస్థానంలో ఉంది. ఇక్కడ మహిళల భాగస్వామ్యం దాదాపు పురుషులతో సమానంగా ఉంది. గృహహింసకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇక 0.924 స్కోర్‌తో నార్వే, స్వీడన్‌ సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకున్నాయి. ఈ రెండు దేశాల్లోనూ రాజకీయాలు, ఉన్నత యాజమాన్యాల్లో మహిళలకు పెద్దపీట వేయడంతోపాటు బలమైన కార్మిక సంఘాలు, సమాన వేతన చట్టాలు వారి భద్రతకు భరోసా ఇస్తున్నాయి.

ఫిన్‌లాండ్‌ (0.921), లక్జెంబర్గ్‌ (0.918), బెల్జియం (0.912) వరుసగా 5,6,7 స్థానాల్లో నిలిచాయి. పార్లమెంటులో అధిక మహిళా ప్రాతినిధ్యం, మెరుగైన విద్య, ఆర్థిక స్వేచ్ఛ, వివక్షకు వ్యతిరేకంగా పటిష్టమైన చట్టాలు ఈ దేశాలను జాబితాలో ముందు వరుసలో నిలబెట్టాయి. మొత్తంమీద ఈ దేశాలన్నీ మహిళల భద్రత, సాధికారతకు కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటిని సమర్థంగా అమలు చేస్తూ, సామాజికంగా సమానత్వ భావనను పెంపొందించడం ఎంత ముఖ్యమో ఈ ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 05:20 AM