Bathukamma Celebrations 2025: తీరొక్క పూల పండుగ
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:24 AM
చెలకల్లో, చేనుల్లో వాటంతట అవే మొలిచే సహజ పూలనే సేకరించి, రంగురంగుల గుండ్రటి ఆకారంలో శిఖరంగా పేర్చడం బతుకమ్మ పండుగకు జీవం. ‘పెత్రామాస’ (పితృ అమావాస్య) నాడు ఎంగిలిపూల బతుకమ్మతో...
విశేషం
21నుంచి బతుకమ్మ సంబురాలు
చెలకల్లో, చేనుల్లో వాటంతట అవే మొలిచే సహజ పూలనే సేకరించి, రంగురంగుల గుండ్రటి ఆకారంలో శిఖరంగా పేర్చడం బతుకమ్మ పండుగకు జీవం. ‘పెత్రామాస’ (పితృ అమావాస్య) నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలతో ఊరూ, వాడా కళకళలాడుతుంది. పూల రంగుల మేళవింపుతో ప్రతి ప్రాంతం బతుకమ్మ పూదోటగా గుబాళిస్తుంది. సాయంత్రం ఆడబిడ్డలు ముస్తాబై, వలయాకారంలో నిలబడి, నెమ్మదిగా కదులుతూ, కోలాటమాడుతూ, పాటలు పాడుతూ నృత్యాలు చేయడం ఈ పండుగ గుండెచప్పుడు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
అచ్చ తెలుగు తెలంగాణ గీతసుధలలో బతుకమ్మ పాటలకు ప్రత్యేక స్థానం ఉంది...
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
గోరింటాకు గోరుముద్దలో...
తంగేడు పువ్వు తాలంలో...
జాతి పూల జడలో..
ఇలాంటి పాటలు సజీవంగా పల్లెల గాలిలో వినిపిస్తాయి. ప్రతి పాటలో మహిళల మనసు, ప్రకృతి, పంటల పట్ల మమకారం ధ్వనిస్తూ ఉంటుంది. బతుకమ్మ పండుగను తెలంగాణ మహిళలు తమ ఆత్మగౌరవంగా భావిస్తారు. బతుకమ్మ పాటలు అన్నిట్లో ఒక కథ, ఒక సంస్కృతి, ఒక ఆశ, ఒక స్ఫూర్తి ఉంటాయి. ఈ వేడుకల్లో ప్రతి పువ్వుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రధానంగా ఉపయోగించే తంగేడు పువ్వు శక్తికి, గుమ్మడి పువ్వు సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి
ప్రపంచమంతటా...
తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. ఆయా దేశాలలో తెలంగాణ యాసతో జానపదాలు మారుమోగుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా... అన్ని ప్రాంతాల్లో కాకపోయినా... పల్నాడు ప్రాంతంలోని మాచెర్ల, కంభంపాడు, కారెంపూడి గ్రామాల్లో మహిళలు బతుకమ్మను జరుపుకొంటారు. బతుకమ్మ పండుగ బొడ్డెమ్మ సందడితో ప్రారంభం కావడం ఆనవాయితీ. అయితే తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల వారికి ఈ సంప్రదాయం లేదు. కాగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని గ్రామాలలో బతుకమ్మ కనిపించదు. అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూడా ఈ పూల పండుగను జరుపుకోరు.
నేలతో, నీటితో అనుబంధం
ఈ మధ్య కాలంలో పలు కారణాల వల్ల తంగేడుకు కరువొచ్చింది. చెలక భూముల్లో కాంక్రీట్ అరణ్యాలు విస్తరించడంతో ప్రకృతికి సహజ అలంకారాలైన పూలమొక్కలు కనిపించడం లేదు. ఫలితంగా కాగితం పూల బతుకమ్మలు మార్కెట్‌లోకి వచ్చాయి. వెదురు కర్రతో బుట్టలను చేసి వాటికి పూల మాలలు చుట్టడం ప్రారంభమైంది. బతుకమ్మ వేడుకల సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటలాడి, పాటలు పాడి పూలను నీటిలో వదులుతారు. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు నిండుకుండల్లా ఉండే సమయంలో వచ్చే ఈ పండుగ... నేలతో, నీటితో మానవులకు ఉన్న అనుబంధాన్ని చాటుతుంది.
కసుపు వెంకటరమణ
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి