Share News

Venice Film Festival Award: అంతర్జాతీయ వేదికపై మన అనుపర్ణ

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:22 AM

అంతర్జాతీయ వేదికపై మన అనుపర్ణ ఉన్నత చదువు... ఐటీ కంపెనీలో అందుకు తగిన కొలువు... చేతి నిండా సంపాదన కాదనుకొని... చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. ఇంట్లోవాళ్లు వద్దన్నా... ఊరు కట్టుబాట్లు పేరు చెప్పినా...

Venice Film Festival Award: అంతర్జాతీయ వేదికపై మన అనుపర్ణ

న్యూస్‌మేకర్‌

అంతర్జాతీయ వేదికపై మన అనుపర్ణ ఉన్నత చదువు... ఐటీ కంపెనీలో అందుకు తగిన కొలువు... చేతి నిండా సంపాదన కాదనుకొని... చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. ఇంట్లోవాళ్లు వద్దన్నా... ఊరు కట్టుబాట్లు పేరు చెప్పినా... అవరోధాలను దాటి... ప్రతిష్ఠాత్మక ‘వెనిస్‌ చిత్రోత్సవం’లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి... అభిరుచికి పట్టం కట్టి... అంతర్జాతీయ వేదికపై మెరిసిన అనుపర్ణా రాయ్‌ అంతరంగం ఇది...

‘‘జీవితం ఎప్పుడూ మనకు సవాళ్లు విసురుతూనే ఉంటుంది. వాటిని అధిగమించి ముందుకు సాగితేనే అనుకున్నది దక్కుతుంది. ఇది అనుభవ పాఠం. పశ్చిమబెంగాల్‌ పురులియా జిల్లాలోని నారాయణపూర్‌ గ్రామం మాది. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం సాగింది. తరువాత అసన్‌సోల్‌లో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చేశాను. కాలేజీ రోజుల్లోనే నాకు సినిమాలపై ఆసక్తి కలిగింది. ఎప్పటికైనా సరే... దర్శకురాలినో, రచయితనో అవ్వాలని అనుకునేదాన్ని. కానీ ఎక్కడ మొదలుపెట్టాలి, పరిశ్రమలోకి ఎలా వెళ్లాలి అనేవాటిపై కనీస అవగాహన లేదు. అందరిలానే చదువు పూర్తవగానే ఉద్యోగంలో చేరాను. తొలుత ఢిల్లీలోని ఒక కాల్‌సెంటర్‌లో పని చేశాను. కొన్నాళ్ల తరువాత నా నివాసం ముంబయికి మార్చాను. సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం మొదలుపెట్టాను. మంచి జీతం. దేనికీ ఇబ్బందిలేదు. ముంబయి వెళ్లాలనుకోవడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. అదే... సినిమా ప్రయత్నాలు. దాని కోసం అనుపమ్‌ఖేర్‌ ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నా. కొన్ని యాక్టింగ్‌ వర్క్‌షాపుల్లో కూడా పాల్గొన్నాను.


అవరోధాలు అధిగమించి...

సినిమాల మీద ఇష్టంతో ఉద్యోగం వదిలేద్దామని అనుకున్నాను. విషయం అమ్మానాన్నకు చెప్పాను. కానీ వాళ్లు వద్దంటే వద్దన్నారు. అంతేకాదు... నేను సినిమాల్లోకి వెళితే ఊరు ఊరంతా కోపగిస్తుందని అన్నారు. సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్ల పేరుతో నన్ను నియంత్రించాలని చూశారు. అయినా నేను నా అభిప్రాయం మార్చుకోలేదు. అవరోధాలు దాటి ఎంచుకున్న లక్ష్యం వైపు నడవాలని నిర్ణయించుకున్నాను. కాదనలేక చివరకు ఇంట్లోవాళ్లు కూడా సరేనన్నారు.

ఎన్నో సవాళ్లు...

2022లో ఉత్సాహంగా ముంబయి వెళ్లాను కానీ... ఎంతో కష్టపడాల్సివచ్చింది. కొత్త నగరం, కొత్త మనుషుల మధ్యలో కొత్త జీవితం. సరైన వనరులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. క్రమంగా అన్నిటినీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అజాద్‌నగర్‌లోని ఒక అపార్టుమెంటులో అద్దెకు ఉండేదాన్ని. అక్కడే ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఫర్‌గాటెన్‌ ట్రీస్‌’ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్‌ సిద్ధం చేసుకున్నాను. అదృష్టం ఏంటంటే... నాకు మంచి టీమ్‌ లభించింది. అందరం కలిసి వండుకోవడం, తినడం, షూటింగ్‌ చేయడం... ప్రతి క్షణం ఎంతో ఆస్వాదించాం. మధుర జ్ఞాపకాలు ఎన్నిటినో పదిలపరుచుకున్నాం. మా కష్టం ఫలించింది. ఇటీవల ముగిసిన ‘వెనిస్‌ చిత్రోత్సవం’ ఒరిజోన్టీ విభాగంలో ఉత్తమ దర్శకురాలిగా నాకు అవార్డు దక్కింది. తొలి సినిమాకే అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది.


భావోద్వేగ క్షణాలు...

ఇటలీలోని వెనిస్‌ నగరంలో అడుగుపెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. నేను రచించి, దర్శకత్వం వహించిన ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఫర్‌గాటెన్‌ ట్రీస్‌’ను థియేటర్‌లో ప్రదర్శించారు. మొదటిసారి వేదిక మీదకు వెళ్లాను. భావోద్వేగంతో నా కళ్లు చెమర్చాయి. ఆహూతులందరూ లేచి నిల్చుని, దాదాపు ఏడు నిమిషాలు చప్పట్లతో అభినందించారు. వేదికపైనున్న మా టీమ్‌ సభ్యులందరిపై మొబైల్‌ ఫ్లాష్‌లైట్స్‌ వేసి, వెలుగులు అద్దారు. నా జీవితంలోనే అత్యద్భుత సమయం అది. తీయని జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది. మన సినిమా ఎప్పుడూ ఇలాగే ప్రకాశించాలని కోరుకొంటున్నాను.

ఇది ఒక గెలుపు మాత్రమే కాదు...

ఇప్పుడు నన్ను చూసి మా ఊరు గొప్పగా చెప్పుకొంటుందని ఆశిస్తున్నా. ఇది ఒక గెలుపు మాత్రమే కాదు... అనేక అడ్డంకులను అధిగమించి సాధించిన గొప్ప విజయం. పాయల్‌ కపాడియా, కిరణ్‌రావు, జోయా అక్తర్‌, రీమా దాస్‌, మీరా నాయర్‌ వంటి మహిళా దర్శకులు నాకు ఆదర్శం. వాళ్లే లేకపోతే ఇవాళ నేను ఇక్కడ ఉండేదాన్నికాదు. ఈ చిత్రానికి మద్దతుగా నిలిచిన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, ఇందులో నటించిన నాజ్‌ షేక్‌, సుమీ బఘేల్‌, ఇతర టీమ్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. అందుకే ఈ అవార్డును ఇద్దరు అద్భుతమైన నటులతో పాటు, ఇన్నాళ్లుగా నాతో కలిసి ప్రయాణించిన ప్రతిఒక్కరికీ అంకితం ఇస్తున్నా. ఇన్నేళ్ల కష్టాన్ని ఈ అవార్డు మరిపించింది. ఈ అద్భుతమైన సందర్భాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా.

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 12:22 AM