Anahad Singh Kohli: అమెరికాలో మన తుపాకుల రాణి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:53 AM
గన్స్, పిస్టల్స్, రైఫిల్స్... ఈ పేర్లు వినగానే అమ్మాయిలు ఉలిక్కిపడతారు. కానీ చండీగఢ్‌కు చెందిన అనహద్ సింగ్ కోహ్లీకి ఇవే క్రీడా వస్తువులు. స్వదేశంలో షూటింగ్ మీద పట్టు పెంచుకున్న ఈ 16 ఏళ్ల బాలిక, అమెరికాలో...
స్ఫూర్తి
గన్స్, పిస్టల్స్, రైఫిల్స్... ఈ పేర్లు వినగానే అమ్మాయిలు ఉలిక్కిపడతారు. కానీ చండీగఢ్‌కు చెందిన అనహద్ సింగ్ కోహ్లీకి ఇవే క్రీడా వస్తువులు. స్వదేశంలో షూటింగ్ మీద పట్టు పెంచుకున్న ఈ 16 ఏళ్ల బాలిక, అమెరికాలో పతకాల పంట పండిస్తోంది. ఒలింపిక్స్‌లో పతకాల మీద గురి పెట్టిన అనహద్ గురించిన ఆసక్తికరమైన విశేషాలివి...
అమెరికాలో పుట్టిన అనహద్ మూడేళ్ల వయసులో తల్లితండ్రులతో భారత్‌లోని స్వస్థలం చండీగఢ్‌కు చేరుకుంది. అప్పటి నుంచి గత మూడేళ్ల వరకూ అక్కడే ఉండిపోయిన అనహద్, త్రినేత్ర షూటింగ్ అకాడమీలో కోచ్, అర్చిత్ ఠాకూర్ ఆధ్వర్యంలో షూటింగ్‌లో శిక్షణ పొందింది. ఆ తర్వాత 2022లో అమెరికాకు వెళ్లిపోయి, స్వదేశంలో తీసుకున్న శిక్షణ సహాయంతో, అమెరికాలోని లఫాయిట్ గన్ క్లబ్‌లో షూటింగ్ నైపుణ్యాలను పెంచుకోగలిగే అర్హత సాధించింది. 1948లో వర్జీనియాలోని గ్రాఫ్టన్‌లో నెలకొల్పిన 28 ఎకరాల విస్తీర్ణంలోని ఈ గన్ క్లబ్‌కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఇక్కడ తీసుకున్న శిక్షణతో, సాల్వో ఓపెన్ షూటింగ్ ఛాంపియన్‌షి్‌పలో ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకోగలిగింది. ‘‘అమెరికాలో నేనెన్ని పతకాలను గెలుచుకున్నప్పటికీ, సాల్వో ఓపెన్ మెడల్ గెలుచుకోవడం నాకెంతో సంతృప్తినిచ్చింది. అమెరికాలో షూటింగ్ ప్రతిభను, మెలకువలను మెరుగుపరుచుకోవడం నాకొక గొప్ప అనుభవం’’ అంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది.
అమ్మ స్ఫూర్తితో...
శిమ్లాలో అనహద్ తాతయ్యకు తుపాకుల దుకాణం ఉండేది. అలాగే అనహద్ తల్లికి కూడా పిస్టల్‌ను షూట్ చేయడం తెలుసు. తుపాకీ పేల్చే తల్లిని చూసిన అనహద్ క్రమేపీ తుపాకుల మీద ఇష్టాన్ని పెంచుకుంది. అలాగే తాతయ్య దుకాణంలో కనిపించే పిస్టల్స్, గన్స్‌తో ప్రేమలో పడిపోయింది. అలా అనహద్, బాల్యంలో సంగ్రూర్‌లో స్టాండింగ్ 60 షాట్ ప్రెసిషన్ ఎయిర్ రైఫిల్ లేదా త్రీ పొజిషన్ ఎయిర్ రైఫిల్, స్మాల్ బోర్ పాయింట్ 22 షూటింగ్ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఆ పోటీల గురించి గుర్తు చేసుకుంటూ... ‘‘పిస్టల్ ఉపయోగించే ఆలోచనే నన్నెంతో ఆకర్షించింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. షూటింగ్‌లో మా అమ్మను ఆదర్శంగా తీసుకోడానికి అదొక కారణం’’ అని చెప్పుకొచ్చింది. అనహద్ కుటుంబంలో ఆమెకూ, ఆమె తల్లికీ మినహా మరెవరికీ తుపాకీల పట్ల ఆసక్తి లేదు. వాళ్ల కుటుంబంలో ఏ ఒక్కరూ షూటింగ్ క్రీడలో పాలుపంచుకోలేదు. ఆ విషయం గురించి మాట్లాడుతూ... ‘‘ఇది ప్రణాళికాబద్ధంగా ఎంచుకున్న క్రీడ కాదు.
ఇదంతా యాధృచ్ఛికంగా జరిగిపోయింది. పంజాబ్ సందర్శించినప్పుడు, ఆసక్తికొద్దీ అకాడమీలో కొన్ని షాట్స్ పేల్చాను. ఆ సమయంలో అక్కడున్న కోచ్, నాకు ఆ క్రీడ నేర్పించమని నాన్నను అడిగారు. అంతే, అప్పటి నుంచీ నాకు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ప్రస్తుతం అమెరికాలో జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్‌కు చెందిన నేను, అలబామాలోని ఆనిస్టన్‌లో జరిగిన యుస్ నేవీ జెఆర్‌ఒటిసి జాతీయ పోటీల్లో రెండు రజత పతకాలు సాధించాను. సాల్వో ఓపెన్ షూటింగ్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాను. మున్ముందు ఈ క్రీడలో ఇంతకంటే మెరుగ్గా రాణిస్తాననే ఆశిస్తున్నా’’ అంటోంది.
షూటర్ లేదా పైలట్
మూడేళ్ల వయసులో భారత్‌కు తిరిగొచ్చి, పదేళ్ల పాటు షూటింగ్ నేర్చుకుని అమెరికాలోని వర్జీనియాకు తిరిగెళ్లిపోయిన అనహద్... ‘‘భారత్‌లో కోచ్ అర్చిత్‌లాగే, ఇక్కడ యుఎస్ నేవీ వెటరన్, జేసన్, కోచ్, మైక్‌ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాను. నిజానికి భారత్‌లోనే ఈ క్రీడలో పైకి ఎదగాలనుకున్నాను. కానీ నేను అమెరికాలోనే పుట్టాను. కాబట్టి ఇక్కడికే తిరిగొచ్చేశాను’’ అంటూ వివరిస్తోంది. అమెరికాలో షూటర్లు నిలబడి తుపాకీ పేల్చడం కష్టంగా భావిస్తారు. కానీ పడుకుని, మోకాళ్ల మీద కూర్చుని తుపాకీ పేల్చడం కంటే నిలబడి పేల్చడమే తనకు సులువనిపిస్తోందని అంటోందామె. ‘‘అందరు క్రీడాకారుల్లాగే నాక్కూడా ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించాలని ఉంది. భౌతికంగా నేను అమెరికన్‌నే అయినా నా మనసంతా భారతీయమే! ప్రస్తుతం అమెరికాలోని జూనియర్ ఒలింపిక్స్ అగ్ర 30 షూటర్లలో నేను నాల్గో ర్యాంకును పొందాను. మున్ముందు భారత్ గర్వించదగిన షూటర్‌గా ఎదగాలని అనుకుంటున్నాను’’ అని అంటోంది అనహిద్. ప్రస్తుతం నేవీ నేషన్స్‌లో నాల్గవ స్థానంలో ఉన్న అనహద్, షూటర్‌గా ఎదుగుతాననీ లేదంటే, యుఎ్‌సఎ సైన్యంలో షూటర్‌గా లేదా కమర్షియల్ పైలట్‌గా ఎదుగుతాననీ అంటోంది. ‘‘షూటింగ్ నా తొలి ప్రేమ. గన్స్, పిస్టల్స్, రైఫిల్స్ నన్నెంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ క్రీడలో ఎదగడం కోసం శాయశక్తులా కృషి చేస్తాను. లేదంటే, కమర్షియల్ పైలట్‌గా మారతాను’’ అని అంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News