Share News

Agakara Health Benefits: ఆగాకర... అమోఘం

ABN , Publish Date - Dec 20 , 2025 | 06:41 AM

ఆకు కాకర అనే పదమే ఆగాకర అయ్యింది. దానికదే పుట్టి పెరిగే మొక్క అని బహుశా దాని భావం కావచ్చు! తోటల్లో కంపల మీద పాకుతూ పెరుగుతుందీ మొక్క.

Agakara Health Benefits: ఆగాకర... అమోఘం

భోజన కుతూహలం

కర్కోటకీ కటుష్ణా చ తిక్తా విషవినాశినీ వాతఘ్నా పిత్తహృచ్చైవ దీపనీ రుచికారిణీ!

ఆకు కాకర అనే పదమే ఆగాకర అయ్యింది. దానికదే పుట్టి పెరిగే మొక్క అని బహుశా దాని భావం కావచ్చు! తోటల్లో కంపల మీద పాకుతూ పెరుగుతుందీ మొక్క.

కాకరకాయలో ఆరో వంతుకూడా ఉండవు ఆగాకర కాయలు. కానీ శక్తి సమానంగా ఉంటుంది. ఆహార పరంగా, వైద్య పరంగా కూడా ప్రాముఖ్యత కలిగిన మొక్క. అధిక పోషక విలువ గల కూరగాయ ఇది.

కొద్దిగా కారంగా, చేదుగా, ఉంటాయి. రుచిని కలిగిస్తాయి. రుచిగా వండుకుంటే అనేక రోగాలలో తినదగినవిగా ఉంటాయి ఆగాకర కాయలు. విషదోషాలను హరించే శక్తివంతమైన కూరగాయ ఆగాకర. వాత వ్యాధులున్నవారికి ఇది అమోఘమైన ఔషధం. వేడిని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా వాతాన్ని తగ్గించే ద్రవ్యాలు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ ఆగాకర వేడిని తగ్గిస్తూ వాతాన్ని హరిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

గాయాలు, జ్వరం, పైల్స్‌, నేత్ర వ్యాధులు, జీర్ణకోపాలు, కామాల (జాండిస్‌), ఆస్థమా, బ్రోంకైటిస్‌, మూత్రనాళ సమస్యల వంటి వైవిధ్యమైన సమస్యల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలోని ఔషధ క్రియాశీల రసాయనాలతో విస్తృత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాధినిరోధక పోషక ఆహారంగానూ ఇది ఉపయోగపడుతుంది.

జీర్ణకోశాన్ని బలసంపన్నం చేస్తుంది. మొలలు, రక్తస్రావ వ్యాధుల్లో తినదగినది. లివరు సంబంధిత సమస్యల్లో ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో ఇది తప్పనిసరిగా తినవలసిన ఔషధం.


జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలనేది పెద్ద ప్రశ్న! ఆగాకర కాయల ఇగురుకూర పెడితే జ్వరానికి ఔషధంగా పని చేస్తుంది. ముఖ్యంగా మలేరియా జ్వరానికి ఇది మంచి విరుగుడు. కుక్క తదితర జంతువులు కరచినప్పుడు ఆ గాయం మీద ఆగాకర గుజ్జుతో కట్టు కడతారు. ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యల్లో ఆగాకర బాగా పని చేస్తుంది. బీపీని తగ్గించే గుణం కూడా ఆగాకరకి ఉంది. గుండె జబ్బులున్న వారికి ఇది మేలు చేస్తుంది.

ఆగాకరని రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం లేకుండా వాటికవే కంపల మీద, అడవుల్లోనూ పెరుగుతాయి. కాబట్టి సురక్షితం. అయితే రోజుకు ఏడెనిమిది కాయల కన్నా ఎక్కువ తినకూడదు. వాంతులౌతాయి.

గంగరాజు అరుణాదేవి

ఆగాకర కాయలకు కాకరకాయతో సమానంగా షుగరు వ్యాధిలో పని చేసే శక్తి ఉంది. దీని వేరుకి షుగరుని అదుపు చేసే శక్తి ఎక్కువ. తక్కువ నూనెలో మగ్గబెట్టిన ఆగాకర ఇగురు కూర అన్ని వ్యాధుల్లోనూ మేలు చేస్తుంది. ఆగార కాయతో కట్టు కడితే పుండ్లు త్వరగా తగ్గుతాయి. ఆపరేషన్లు, గాయాలు అయిన వారికి ఆగాకర వండిపెడితే త్వరగా మానుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 06:41 AM