Share News

Actress Sameera Sherief: అమ్మగా అమృతం పంచుతున్నారు

ABN , Publish Date - Sep 06 , 2025 | 02:30 AM

అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలే ఆహారం. తల్లీబిడ్డల అనుబంధాన్ని పెంచి పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి కూడా తల్లి పాలే దోహదం చేస్తాయి. అలాంటి తల్లి పాలను ఎన్‌ఐసీయూ శిశువుల కోసం దానం చేస్తూ తన ఉదారతను....

Actress Sameera Sherief: అమ్మగా అమృతం పంచుతున్నారు

అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలే ఆహారం. తల్లీబిడ్డల అనుబంధాన్ని పెంచి పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి కూడా తల్లి పాలే దోహదం చేస్తాయి. అలాంటి తల్లి పాలను ఎన్‌ఐసీయూ శిశువుల కోసం దానం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు హైదరాబాద్‌కు చెందిన సమీరా షెరీఫ్‌. ఇటీవల ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన తరవాత 50 రోజుల వ్యవధిలో 13 లీటర్ల చనుబాలను ఆమె దానం చేశారు తల్లిపాల ఉత్పత్తి, నిల్వ, దానం చేసే విధానాల గురించి ఎన్నో ఆసక్తికరమై అంశాలను ఆమె ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘సాధారణంగా బిడ్డ పుట్టిన తరవాత కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు... తల్లి చుట్టూ చేరి ‘‘పాలు వస్తున్నాయా? బిడ్డకు పాలు సరిపోతున్నాయా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. అలా అడగడం మంచిది కాదని నా అభిప్రాయం. స్త్రీ శరీరం ఒక అద్భుతం. అందుకే భగవంతుడు పిల్లలను కనే బాధ్యతను ఆడవారికి అప్పగించాడు. పాలకోసం బిడ్డ ఏడిస్తే వెంటనే తల్లి మెదడుకు సంకేతాలు అందుతాయి. మెల్లగా రొమ్ములు పాలతో నిండుతాయి. బిడ్డ పుట్టిన తరవాత మొదటి రెండు రోజులు పాలు తక్కువగా వస్తాయి. క్రమంగా బిడ్డ తాగుతున్న కొద్దీ పాలు ఎక్కువగా వస్తుంటాయి. బిడ్డకు పాలు సరిపోకపోవడం అనేది ఉండదు.


ఆలోచన ఇలా వచ్చింది...

కొవిడ్‌ సమయంలో మా పెద్దబ్బాయి పుట్టాడు. పుట్టిన వెంటనే బాబుకు కామెర్లు వచ్చాయి. చికిత్స చేస్తున్నప్పటికీ కామెర్లు తగ్గకపోవడంతో ‘‘బాబుకి తల్లిపాలు సరిపోతున్నాయా?’’ అని వైద్యులు ప్రశ్నించారు. బిడ్డ కడుపు నిండా పాలు తాగితేనే మూత్రం ద్వారా కామెర్లు తొలగిపోతాయని చెప్పారు. ఫొటోథెరపీ చేసి బాబుకి తల్లి పాలు సరిపోవడం లేదని తేల్చారు. తల్లి పాలలో కొన్ని ఫార్ములా పాలు కలిపి బాబుకి పట్టించారు. బాబు వెంటనే వాంతి చేసుకున్నాడు. వాడికి తల్లిపాలు మాత్రమే కావాలని నాకు అర్థమయింది. ‘పాలు ఎక్కువగా కావాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?’ అనే విషయం గురించి అంతర్జాలంలో వెతికి, పుస్తకాలు చదివి చాలా విషయాలు తెలుసుకున్నాను. అలాగే బంధువుల్లో పెద్దవారిని అడిగి కొంత సమాచారం సేకరించాను. అలా నాకు నేనుగా ఒక పద్ధతిని అనుసరించడం ప్రారంభించాను. క్రమంగా పాలు పెరిగాయి. బాబు తాగిన తరవాత కూడా చాలా పాలు మిగిలి ఉండేవి. వాటిని అలాగే ఉంచితే రొమ్ములు బరువెక్కి నొప్పిగా అనిపించేది. మామూలుగా తల్లులందరూ ఇలా అదనంగా ఉన్న పాలను బాత్‌రూమ్‌లో పిండేస్తుంటారు. లేదంటే బిడ్డకు స్నానం చేసే నీటిలో కలిపేస్తుంటారు. ఎంతో అమూల్యమైన తల్లి పాలను వృథా చేయడానికి నాకు మనస్కరించలేదు. అప్పుడే చనుబాలను దానం చేయాలనే ఆలోచన వచ్చింది. సాధారణంగా ఎన్‌జీఓ సెంటర్లకు వెళ్లి తల్లులు పాలు దానం చేస్తుంటారు. నాకు హైదరాబాద్‌లో అలాంటి వెసులుబాటు కనిపించలేదు. కానీ నిలోఫర్‌ ఆసుపత్రిలోని మిల్క్‌ బ్యాంక్‌లో దానం చేయవచ్చని తెలిసింది. అప్పుడు రెండు నెలల వ్యవధిలో ఎనిమిది లీటర్ల తల్లిపాలను దానం చేశాను. ప్రస్తుతం అంకుర, రెయిన్‌బో ఆసుపత్రుల్లో కూడా తల్లిపాలను దానం చేసే వీలుంది. ఇప్పుడు రెండో బాబు పుట్టిన తరవాత 27 రోజుల వ్యవధిలోనే ఆరు లీటర్ల పాలను నిల్వ చేశాను. వీటితో కలిపి 50 రోజుల్లో 13 లీటర్ల చనుబాలను రెయిన్‌బో ఆసుపత్రిలో దానం చేశాను. బిడ్డ పుట్టిన తరవాత మొదటి వారం కొలెస్ట్రమ్‌ విడుదలవుతుంది. దాన్నే ‘ముర్రుపాలు’ అని కూడా అంటారు. వాటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పాలను కూడా విడిగా తీసి ఆసుపత్రిలో ఇచ్చాను. ఇలా తల్లులు దానం చేసిన పాలను ‘ఎన్‌ఐసీయూ’ (నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లో ఉన్న శిశువుల కోసం వినియోగిస్తారు.’’

పి. హిమబిందు


66-navya.jpg

నేటి తల్లులు ఇవి తెలుసుకోవాలి...

పాలు తాగిన తరవాత కూడా బిడ్డ ఏడుస్తూ ఉంటే పాలు సరిపోవడం లేదనుకొని ఫార్ములా పాలు పట్టాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఫార్ములా పాలు మంచివి కాదని నేను చెప్పను కానీ వాటి అవసరం బిడ్డకు రాదని నా అభిప్రాయం. బిడ్డకు కావాల్సినన్ని పాలు ఉత్పత్తి చేసే శక్తి తల్లికి ఉంటుంది. గ్యాలెక్ట్‌ గ్రాన్యూల్స్‌ అనే పౌడర్‌ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఒక చెంచా చొప్పున ఒక గ్లాసు పాలలో కలుపి... ఉదయం, సాయంత్రం తాగితే చనుబాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దాని రుచి చాలా బాగుంటుంది. తల్లి పాలలో యాంటీబాడీలు ఉంటాయి. వీటివల్లనే పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నిరోధించే విధంగా తల్లిపాలు ఉత్పత్తి అవుతాయి. పిల్లలకు ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో ఉండే అవసరాలకు తగ్గట్టుగా చనుబాలు వస్తుంటాయి. పాలు రాకపోయినా నిపుల్‌ను బిడ్డ నోట్లో ఉంచితే కొంతసేపటికి పాలు ఉత్పత్తి అవుతాయి. రొమ్ములు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా; నిపుల్స్‌ చదునుగా ఉన్నా, కాస్త ఎత్తుగా ఉన్నా పాల ఉత్పత్తికి అవరోధాలు కావు. నిపుల్స్‌ చదునుగా ఉంటే మాత్రం నిపుల్‌ సక్కర్‌ వాడడం మంచిది. నిపుల్‌తోపాటు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా కొద్దిగా బిడ్డ నోట్లో ఇమిడ్చి, సరైన విధానంలో బిడ్డ పాలుతాగేలా తల్లులు చూసుకోవాలి. పిల్లలకు కావాల్సినప్పుడల్లా ఒక రొమ్ములో పాలిస్తూ అదే సమయంలో రెండో రొమ్మునుంచి పాలు తీసి భద్రపరచి దానం చేస్తే పది మంది పిల్లలకు సహాయం చేసినవారవుతారు.’’


సమీర... ప్రముఖ తెలుగు నటి సన కోడలు. ఆమె భర్త సయ్యద్‌ అన్వర్‌ అహ్మద్‌. వీరికి అర్హాన్‌, అమీర్‌ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. సమీర కూడా పలు తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటించారు. ‘ఆడపిల్ల’, ‘అభిషేకం’, ‘భార్యామణి’, ‘మూడుముళ్ల బంధం’, ‘ప్రతిబింబం’, ‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్స్‌ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సమీర సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు. తల్లిగా తన అనుభవాలను, బిడ్డలతో అనుబంధం, కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను ప్రతిబింబించే పలు వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఉంటారు. చనుబాలను దానం చేసే విధానాన్ని వివరిస్తూ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి..

 ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..

మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి

Read Latest TG News and National News

Updated Date - Sep 06 , 2025 | 02:30 AM