Golden Hour Reel: రీల్స్ పిచ్చి.. బ్రిడ్జిపై నుంచి పడి యువకుడు బలి..
ABN , Publish Date - Dec 03 , 2025 | 09:13 PM
బ్రిడ్జిపై నిలబడి రీల్స్ చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డంతో తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
రీల్స్ పిచ్చి కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 50 అడుగుల బ్రిడ్జిపై నుంచి కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉదయ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్‌నగర్ గ్రామానికి చెందిన మదన్ నూరియా అనే యువకుడు చిల్లీ సిలారీలో ఉన్న డాబాలో పని చేస్తున్నాడు. మదన్ తరచూ రీల్స్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం జైపూర్-జబల్‌పూర్ నేషనల్ హైవేపై ఉన్న బ్రిడ్జిపై రీల్స్ చేయడానికి వెళ్లాడు. బ్రిడ్జి సేఫ్టీవాల్‌పై నిలబడి సూర్యాస్తమయం వీడియో తీస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పట్టుతప్పి కిందపడిపోయాడు. 50 అడుగుల ఎత్తు మీద నుంచి కిందపడటంతో తీవ్రగాయాలు అయ్యాయి. వెన్నెముక విరిగిపోయింది. తల పగిలి రక్తం కారుతూ ఉంది. రక్తం విపరీతంగా పోవటంతో అతడు స్ప్రహకోల్పోయాడు. కిందపడ్డ అతడిని చూసిన డాబా సిబ్బంది హుటాహుటిన స్పందించారు. ఉదయ్‌పురలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మదన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. మదన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మదన్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను చెక్ చేయగా రీల్ చేస్తుండగా అతడు ప్రమాదానికి గురయ్యాడని తేలింది. బుధవారం మదన్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే
ఐదెన్ మార్‌క్రమ్ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో సఫారీల అద్భుత పోరాటం..