Rahul Gandhi Warns EC Officials: అధికారంలోకి వచ్చాక..మిమ్మల్ని వదలం
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:04 AM
ఎన్నికల మోసాలతో ప్రమేయం ఉన్న ప్రతి ఎన్నికల అధికారీ.. పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని
ఓటర్ల జాబితాల్లో మోసాలెందుకు?
జవాబులివ్వకుండా మాకు బెదిరింపులా?
బీజేపీ ఏజెంటులా ఎందుకు పనిచేస్తున్నారు?
ఎన్నికల అధికారులపై రాహుల్‌గాంధీ ఆగ్రహం
బెంగళూరులో ‘ఓటు అధికార ర్యాలీ’
బెంగళూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల మోసాలతో ప్రమేయం ఉన్న ప్రతి ఎన్నికల అధికారీ.. పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. ఏదో ఒక రోజు తాము అధికారంలోకి వస్తామని.. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తామో చూడండని హెచ్చరించారు. ప్రతి ఎన్నికల కమిషనర్, అధికారి దీనిని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరెంత సీనియర్ అధికారి అయినా.. జూనియర్ అయినా లెక్కచేసేది లేదని చెప్పారు. శుక్రవారం బెంగళూరులో ఆయన ఓటు అధికార ర్యాలీలో ప్రసంగించారు. గురువారం ఢిల్లీలో విలేకరుల భేటీలో తాను చూపిన డాక్యుమెంట్లపై సంతకం చేసి.. తమకు ప్రమాణ పత్రం సమర్పించాలని, అప్పుడు ఆయన ఆరోపణలపై విచారణ చేపడతామని ఈసీ చేసిన ప్రకటనపై రాహుల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తాను రాజ్యాంగాన్ని కాపాడతానని పార్లమెంటులో ప్రమాణం చేశానని గుర్తుచేశారు. ఓట్ల చోరీ ఆరోపణను పునరుద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికలను దొంగిలించేందుకు ఈసీ, బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. ‘నేను గురువారం విడుదల చేసిన డేటాను చూసి ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి.. ఈసీ తన వెబ్‌సైట్‌ను మూసివేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్‌లలోని ఈసీ వెబ్‌సైట్లను మూసివేశారు. ప్రజలు నిలదీస్తే తమ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని వారికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈసీకి ఆయన ఐదు ప్రశ్నలు సంధించారు. తనను బెదిరించడానికి బదులు వీటికి బదులివ్వాలని స్పష్టంచేశారు. ‘డిజిటల్ మెషీన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఓటర్ల జాబితాలను మీరెందుకు ఇవ్వడం లేదు? వీడియో ఆధారాలను మీరెందుకు ధ్వంసం చేస్తున్నారు? ఓటర్ల జాబితాల్లో భారీగా ఎందుకు మోసాలకు పాల్పడుతున్నారు? మా ప్రశ్నలకు జవాబులివ్వకుండా మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? ఈసీ బీజేపీ ఏజెంటులా ఎందుకు పనిచేస్తోంది’ అని అడిగారు.
ఎన్నికల చోరీపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని తమ పార్టీ ప్రభుత్వాన్ని రాహుల్ కోరారు. మోదీని 25 సీట్ల మార్జిన్‌తో ఎన్నికైన ప్రధానిగా పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా మేం కోరిన ఎలకా్ట్రనిక్ ఓటర్ డేటా గనుక మాకిస్తే.. భారత ప్రధాని దొంగతనం ద్వారా ఆ పదవిని అంటిపెట్టుకుని ఉన్నారని రుజువుచేస్తాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మా కూటమి గెలిచింది. అయితే 4 నెలలకే అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. కోటి మంది కొత్త ఓటర్లు ఓటేశారని వెల్లడైంది. ఆ కొత్త ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. కొత్త ఓటర్లు ఓటేసిన చోటల్లా ఆ పార్టీ గెలిచింది. కానీ మా కూటమి ఓట్లు తగ్గలేదు. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చాయి. నిజాలు తవ్వేందుకు మాకు 6నెలలు పట్టాయి. చిందరవందరగా పడేసిన ఎన్నో కాగితాల నుంచి మేం వెలికితీసిన డేటా.. ఓట్ల చౌర్యమనే నేరానికి ఆధారం’అని చెప్పారు. ఓటర్ల జాబితా సాఫ్ట్‌కాపీ ఇవ్వాలని ఈసీని అడిగితే తిరస్కరిస్తోందన్నారు. రాహుల్ రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని.. ఇందులో వేల శతాబ్దాల చరిత్ర గలిగిన సిద్ధాంతం ఉందని సభలో చెప్పారు. ‘బీజేపీ సిద్ధాంతం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది. డబ్బులిచ్చి కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని తస్కరించింది’ అని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలనూ దొంగిలించిందని పూర్తి నమ్మకంతో, ఆధారాలతో చెబుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాల కారణంగా గుల్బర్గాలో తాను ఓడిపోయానన్నారు.
మీ ఆరోపణలు నిజమైతే డిక్లరేషన్‌పై సంతకం చేయండి.. లేదంటే క్షమాపణ చెప్పండి: ఈసీ
రాహుల్‌గాంధీ ఆరోపణలను ఈసీ మరోసారి ఖండించింది. ఆయన ఆరోపణలు నిజమైతే డిక్లరేషన్‌పై సంతకం చేసి ఓటర్ల జాబితాలో తప్పుగా వేసిన ఎంట్రీలు, తొలగింపుల వివరాలను తమతో పంచుకోవాలని పేర్కొంది. ‘మీ విశ్లేషణపై మీకు నమ్మ కముంటే.. మీ ఆరోపణలు నిజమని భావిస్తే.. డిక్లరేషన్‌పై సంతకం చేయడానికి.. తప్పుగా చేర్చిన, తొలగించిన ఓటర్ల వివరాలివ్వడానికి ఇబ్బంది ఉండకూడదు. డిక్లరేషన్‌పై సంతకం చేయలేదంటే.. ఆయన అనాలిసి్‌సపై ఆయనకే నమ్మకంలేనట్లు లెక్క. చేసిన నిరాధార ఆరోపణలకు ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి’అని ఈసీ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. తమ వెబ్‌సైట్లను మూసివేశామన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. అన్ని భేషుగ్గా పనిచేస్తున్నాయని పేర్కొంది.