Woman Tied To Tree And Beaten: మహిళల దారుణం.. తోటి మహిళను చెట్టుకు కట్టేసి..
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:40 AM
ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న చెట్టుకు కట్టేశారు. బాధితురాలి దస్తులు తొలగించే ప్రయత్నం చేశారు. ‘మీరు నన్ను దారుణంగా కొడుతున్నారు. జైలుకు వెళ్లక తప్పదు’ అని బాధితురాలు వార్నింగ్ ఇచ్చింది.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు తోటి మహిళపై దాడి చేశారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆమె దుస్తులు తొలగించి అవమానించే ప్రయత్నం చేశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడలూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళకు అదే గ్రామానికి చెందిన నలుగురు మహిళలతో స్థలం విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కొద్దిసేపటికే చినికి చినికి గాలి వానలా తయారైంది. ఆ నలుగురు మహిళలు బాధితురాలిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టారు.
ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న చెట్టుకు కట్టేశారు. బాధితురాలి దస్తులు తొలగించే ప్రయత్నం చేశారు. ‘మీరు నన్ను దారుణంగా కొడుతున్నారు. జైలుకు వెళ్లక తప్పదు’ అని బాధితురాలు వార్నింగ్ ఇచ్చింది. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ‘నువ్వు కుక్కతో సమానం’ అంటూ బాగా కొట్టారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది. ఇక, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఓ నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ..‘స్థలం విషయంలో నిందితులకు బాధితురాలికి మధ్య గొడవ జరిగింది. బాధితురాలిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆమె దుస్తులు తొలగించే ప్రయత్నం చేశారు. జుట్టు పట్టుకుని లాగి, కర్రతో కొట్టి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఒక నిందితురాలిని పట్టుకున్నాం. మిగిలిన వారి కోసం అన్వేషిస్తున్నాం’ అని అన్నారు. ఈ దాడిలో కుల పరమైన అంశం ఉందా అని మీడియా అడిగినపుడు ‘ఇప్పుడే ఏమీ చెప్పలేము. దర్యాప్తులో తెలుస్తుంది’ అని పోలీసులు సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది.. కానీ ఇంతలోనే..
భక్తులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత