Kumbh Mela : సంగమ ముఖద్వారం.. ఎందుకంత కీలకం?
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:53 AM
ప్రయాగరాజ్‌లో ఉత్తర దిశ నుంచి ప్రవహించే గంగా నది, దక్షిణ దిశ నుంచి వచ్చిన యమునా నది రెండూ సంగమించే ప్రదేశం త్రిభుజాకారంలో ఒక ముక్కులాగా కనిపిస్తుంది. అందుకే దీనిని సంగమ ముఖద్వారంగా వ్యవహరిస్తారు. ఇక్కడే సరస్వతీ నది(అంతర్వాహిని) కూడా వీటితో

మహాకుంభ్ నగర్, జనవరి 29: ప్రయాగరాజ్‌లో ఉత్తర దిశ నుంచి ప్రవహించే గంగా నది, దక్షిణ దిశ నుంచి వచ్చిన యమునా నది రెండూ సంగమించే ప్రదేశం త్రిభుజాకారంలో ఒక ముక్కులాగా కనిపిస్తుంది. అందుకే దీనిని సంగమ ముఖద్వారంగా వ్యవహరిస్తారు. ఇక్కడే సరస్వతీ నది(అంతర్వాహిని) కూడా వీటితో సంగమిస్తుందని చెబుతారు. ఈ త్రివేణీ సంగమ ప్రదేశం హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. మాఘ మేళాలో ఇక్కడ స్నానం చేయడానికి మనుషులతో పాటు దేవతలు, రాక్షసులు కూడా వస్తారని నమ్మిక. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, జనన మరణ చక్రం నుంచి జీవుడికి విముక్తి లభించి, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అదీ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా సమయంలో ఇక్కడ స్నానాలు ఆచరిస్తే దాని ఫలితం అనంతమని బలంగా నమ్ముతారు. ఈ కారణంగా ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వేణీ మాధవుడు స్వయంగా ఇక్కడ వెలిసినందున ఈ సంగమానికి ప్రాధాన్యం మరింత ఎక్కువ. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు సంగమ ముఖద్వారం ప్రాంతంలోనే అమృత స్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానాలకు అత్యంత డిమాండ్ ఉన్న ప్రదేశం ఇదే.
రెండు నదుల నీరు వేర్వేరు రంగుల్లో..
సంగమ ముఖద్వారం వద్ద యమునా నదిలో నీరు లేత నీలం రంగులోనూ, గంగా నదిలో నీరు కొద్దిగా బురదగానూ కనిపిస్తాయి. ఇక్కడే యమునా నది ప్రయాణం అంతమైపోయి... గంగలో పూర్తిగా లీనమైపోతుంది. ఇక్కడినుంచి గంగానది బనారస్ దిశగా ప్రవహిస్తుంది. కుంభమేళాలో ఈ ప్రాంతాన్ని సంగమ ఘాట్‌గా గుర్తించారు. కుంభమేళా జరిగే 4వేల హెక్టార్లలో సంగమ ముఖద్వారంతో పాటు రెండు నదీ తీరాల్లోనూ అనేక ఘాట్‌లను సిద్ధం చేశారు. మొత్తం 25 సెక్టార్లుగా ఈ ప్రాంతాన్ని విభజించారు. ఇందులో 5 సెక్టార్లు సంగమ ముఖద్వారం పరిధిలో ఉన్నాయి. ఇక్కడకు అతి సమీపంలో ఉన్న సెక్టార్ 1, 2లలో పోలీసు పోస్టులు, తప్పిపోయిన వారి కోసం సహాయక కేంద్రాలు తదితర తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. సెక్టార్ 3, 4 కూడా సంగమ ప్రాంతానికి దగ్గరగానే ఉంటాయి.
సామర్థ్యం 4 రెట్లు పెంపు
కుంభమేళాను దృష్టిలో ఉంచుకొని యూపీ ప్రభుత్వం ముందుగానే సంగమ ముఖద్వారం తూర్పు ప్రాంతాన్ని విస్తరించింది. గంగా నదిపై శాస్త్రి బ్రిడ్జి, సంగమ ముఖద్వారం మధ్య 26 హెక్టార్ల స్థలాన్ని అదనంగా అందుబాటులోకి తెచ్చింది. 1,650 మీటర్ల పొడవునా ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక ఘాట్లు సిద్దం చేసింది. దీంతో ఒకేసారి ఎక్కువమంది భక్తులు స్నానాలు చేసే అవకాశం లభించింది. 2019లో సంగమ ముఖద్వారం వద్ద గంటకు 50వేల మంది వరకూ భక్తులు స్నానాలు చేస్తే ప్రస్తుతం ప్రతి గంటకు 2లక్షల మందికి పైగా స్నానం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, జనవరి 13న పుష్య పౌర్ణమి నాడు, 14న తొలి అమృత స్నానాల వేళ ఇక్కడ గంటకు 3లక్షల మంది చొప్పున భక్తులు స్నానాలు ఆచరించారు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News