Elections: పారని పథకాలు
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:23 AM
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నుంచి.. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల దాకా.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా అవేవీ కేసీఆర్‌ను ఓటమి కోరల నుంచి కాపాడలేకపోయాయి!!

సంక్షేమమే విజయానికి వీసా కాదు!
ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా.. ఓటమి నుంచి తప్పించుకోలేకపోయిన పలు రాజకీయ పార్టీలు
ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్.. తాజాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీదీ అదే దుస్థితి
సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే మరో అవకాశం
ఒక్కసారి అధికారంలోకి వస్తే ముప్పై ఏళ్లు సీఎంగా కొనసాగుతానంటూ ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం జగన్.. సంక్షేమ పథకాల రూపంలో జనానికి రూ.లక్షల కోట్లు పంచినా ఎందుకు ఓడిపోయానో అర్థం కాలేదని ఐదేళ్లు తిరక్కుండానే వాపోవాల్సిన పరిస్థితి! కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నుంచి.. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల దాకా.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా అవేవీ కేసీఆర్‌ను ఓటమి కోరల నుంచి కాపాడలేకపోయాయి!! కేవలం సంక్షేమ పథకాలే ఓట్లు రాల్చవనే చేదు నిజం.. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల రూపంలో మరోసారి రుజువైంది. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్తు, ఉచిత తాగు నీరు, మొహల్లా క్లినిక్‌ల వంటివేవీ కేజ్రీవాల్ ఓటమిని ఆపలేకపోయాయి. నిజానికి, ఓట్ల కోసమో ఓటుబ్యాంకు కోసమో ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను చాలామంది ప్రతికూల ధోరణితో చూస్తారుగానీ.. బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం, బడికెళ్లే ఆడపిల్లలకు సైకిళ్ల పంపిణీ వంటి పథకాలు బడుగు, బలహీనవర్గాల్లో అక్షరాస్యత పెంచడానికి ఎంతగానో దోహదపడతాయనడంలో సందేహం లేదు.
అలాగని సంక్షేమం పేరుతో అడ్డగోలుగా ప్రజల ఖాతాల్లోకి రూ.లక్షల కోట్లు వేసేసినంతమాత్రాన.. ఎన్నికల్లో గెలవడానికి వీసా దొరికేసినట్టు కాదు! వాటికి ఒక పరిమితి.. అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య సమతౌల్యం లేకపోవడమే అసలు సమస్య. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లనే రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి మరొకటి విచక్షణ రహితంగా హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాయి. ఆ పథకాల అమలుకు దొడ్డిదోవన కార్పొరేషన్ల పేరుతో రూ.లక్షల కోట్లు అప్పులు తెస్తున్నాయి. బడ్జెట్ అప్పులను మాత్రమే లెక్కల్లో చూపుతూ.. బడ్జెటేతర అప్పుల్ని దాచేసి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అభివృద్ధి మృగ్యమై అప్పులు మాత్రమే మిగలడంతో.. అసలు, వడ్డీలు కట్టే దారి తెలియక, ప్రభుత్వ భూములు, ఆస్తులను తాకట్టు పెట్టే/తెగనమ్మే దుస్థితికి దిగజారుతున్నాయి. జగన్ సర్కారు ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో రోడ్ల దుస్థితి గురించి చెప్పుకోనే అక్కర్లేదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. కేసీఆర్ సర్కారు భూముల విక్రయం చేపట్టడం, ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లపాటు ఒక ప్రైవేటు సంస్థకు కేవలం రూ.7వేల కోట్లకు లీజుకు కట్టబెట్టడం తెలిసిందే. ఢిల్లీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేసిన పలు పథకాలను కొనసాగించడంతోపాటు వాటికి అదనంగా మరిన్ని పథకాలు అమలుచేస్తామన్న బీజేపీ.. తన హామీలను ఎలా నిలబెట్టుకుంటుందో చూడాల్సి ఉంది!
ఆశ.. కోపం.. సానుభూతి..
సంక్షేమ పథకాలే తమను మళ్లీ మళ్లీ అధికారపీఠంపై కూర్చోబెడతాయని చాలామంది రాజకీయ నాయకులు విశ్వసిస్తారుగానీ.. కేవలం సంక్షేమం.. కేవలం అభివృద్ధి.. ఇలా ఏదో ఒకదానికి మాత్రమే కట్టుబడే ప్రభుత్వాన్నీ ప్రజలు సహించలేరు. ఉద్యోగ, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం వంటివి ఏమేరకు జరిగాయన్నది కూడా గమనిస్తారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైన సందర్భాల్లో మాత్రమే అధికారంలో ఉన్న పార్టీకి మరో అవకాశాన్ని ఇస్తారని,. ఎన్నికల్లో గెలుపోటములకు ఇంకా చాలా కారణాలు దోహదం చేస్తాయని చాలా సందర్భాల్లో వెల్లడైంది.
ఉచితంగా ఎంత డబ్బు ఇచ్చినా కూడా.. మనసులో మాట బయటకు చెప్పుకొనే స్వేచ్ఛ లేని వాతావరణాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛలేని ఉక్కబోత పరిస్థితిని, నాయకుల అహంభావాన్ని ప్రజలు ఎక్కువకాలం సహించలేరు. 2019లో జగన్ గెలుపునకు ఆశ, సానుభూతి అనే బలమైన భావోద్వేగాలు ఎలా పనిచేశాయో.. 2024లో జగన్ సర్కారు అవినీతి, అక్రమాలు, భూకబ్జాల వంటివాటిపై ప్రజల్లో కోపం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేని నిర్బంధ వాతావరణంపై ఆగ్రహం అంతకన్నా ఎక్కువగా బలంగా పనిచేయడం వల్లే ఆ పార్టీ అంత ఘోరంగా ఓటమిపాలైంది! 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి కూడా ఆ పార్టీ నాయకుల అహంకారపూరిత వైఖరి ఎంతో కొంత కారణమైందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు, ఆప్ ఓటమికి కూడా ఈ భావోద్వేగాలే ప్రధాన కారణాలుగా నిలిచాయి. పదేళ్ల పాలన నేపథ్యంలో ప్రజల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, పెరిగిన నిరుద్యోగ రేటు, అభివృద్ధి లేమి వంటివి కూడా తోడవడం.. ఆయనతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి.
- సెంట్రల్ డెస్క్

ఇవి కూడా చదవండి..
Delhi: ముంచుకొస్తున్న మరో ఎన్నిక, ఇక పార్టీల ఫోకస్ దానిపైనే..
Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
For More National News and Telugu News..