Weather Alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:51 PM
Weather Alert: వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. అలాంటి వేళ.. భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. పలు ప్రాంతాాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అదీకాక వేసవి కాలం కూడా కావడంతో.. గాలిలో తేమ సైతం లేక ప్రజలు ఓ విధమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాంటి వేళ మే మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పాడనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతోపాటు బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఛత్తీస్‌గఢ్, జార్కండ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భా, ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్‌లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం అక్కడక్కడా విస్తృతంగా కురుస్తుందని చెప్పింది. ఈ గాలులు సైతం 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వీస్తాయని పేర్కొంది. ఈ తరహా వాతావరణం మే 3వ తేదీ వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఒడిశాలో మాత్రం ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
వాయువ్య భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మే 1 నుంచి 5వ తేదీ వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఉరుములు, మెరుపులతోపాటు గాలులు 30 నుంచి 50 కిలోమీటర్లు వీచే అకాశముందని తెలిపింది. పంజాబ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో సైతం ఏప్రిల్ 30 నుంచి మే 4వ తేదీ వరకు ఈ తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరి ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
న్యూఢిల్లీలో మే 2వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన సాధారణ వర్షం కురిసే అవకాశముందంది. ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే కనిష్టంగా ఉండనున్నాయి. అంటే 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉండవచ్చని తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాల్లో అయితే.. వర్షాలు విస్తృతంగా కరువనున్నాయి. అలాగే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు అరుణాచల్‌ప్రదేశ్ అసోం, మేఘాలయా, త్రిపురతోపాటు మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని తెలిపింది.
ఇక దక్షిణ రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లు కురిసే అవకాశం ఉందంది.
అయితే తమిళనాడు, పుదుచ్చెరీ, కేరళ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, గుజరాత్, మరట్వాడతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మే 1వ తేదీ వరకు వాతావరణంలో వేడి, తేమ కూడిన పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ వివరించింది.
For National News And Telugu News