Share News

Misinformation in War: కూల్చుడు పేరిట కుట్రలెన్నో

ABN , Publish Date - May 12 , 2025 | 05:44 AM

యుద్ధాల సమయంలో ఆయుధ కంపెనీలు, మీడియా, ప్రభుత్వాల మద్దతుతో తప్పుడు ప్రచారాలు విస్తృతంగా జరుగుతాయి. రాఫెల్, ఎఫ్-16ల మధ్య మాలిన సమాచార పోరు మిలిటరీ వ్యాపార పోటీకి నిదర్శనం.

Misinformation in War: కూల్చుడు పేరిట కుట్రలెన్నో

భారత్‌-పాక్‌ యుద్ధం మాటున ఆయుధ కంపెనీల ప్రచార సమరం

రాఫెల్‌పై దుష్ప్రచారం వెనుక ప్రత్యర్థుల పన్నాగం!

ఎఫ్‌-16ను యుద్ధానికి దూరం పెట్టిన వైనం

గతంలో ఎఫ్‌-15పై అమెరికాలో అంతర్గత దుష్ప్రచారం

భారత్‌తో విన్యాసాల్లో దెబ్బతిందంటూ వార్తలు

ఇవన్నీ ఆయుధ వ్యాపారంలో భాగమే!

‘‘భారత్‌కు చెందిన మూడు రాఫెల్‌ విమానాల్ని పాకిస్థాన్‌ నిజంగానే కూల్చిందా’’

‘‘పాక్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని భారత్‌ దెబ్బతీసిందా?’’

‘‘పాక్‌ జేఎఫ్‌-17 విమానాన్ని భారత్‌ పడగొట్టిందా?’’

లాంటి విషయాలపై రక్షణ నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వస్తుంటాయి. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థల్లో వివిధ కథనాలు ప్రసారం అవుతుంటాయి. వాటి ఆధారంగా సోషల్‌ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తుంటాయి. వీటిలో ఏది నిజం? ఏది అబద్ధం? తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీటిలో కొన్ని ప్రచారాల వెనక పెద్ద పెద్ద ఆయుధ కంపెనీలు ఉంటాయి. తమ ఆయుధాల గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడానికి, తమ ప్రత్యర్థి కంపెనీల ఆయుధాలపై దుష్ప్రచారం చేయడానికి అవి పన్నే కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా కొన్ని వార్తాసంస్థలు చేసే గిమ్మిక్కులు ఉంటాయి. అంతేకాదు.. కొన్ని సాయుధ దళాల ‘‘వర్గాలు’’, ప్రభుత్వ ‘‘వర్గాలు’’ ఉద్దేశపూర్వకంగా ఇచ్చే తప్పుడు సమాచారాలు సైతం ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం వచ్చిందంటే ఆయుధ కంపెనీలు అక్కడ వాలిపోతాయి. ఆ యుద్ధంలో ఇరుపక్షాలు ఉపయోగిస్తున్న ఆయుధాలకు అనుకూలంగా, ప్రతికూలంగా మీడియాలో కథనాలు వచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టేస్తాయి.


రాఫెల్‌ యుద్ధ విమానం సంగతే తీసుకుందాం. దీనిని ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ సంస్థ తయారుచేసింది. ప్రస్తుతం ఇది 4.5జనరేషన్‌ యుద్ధ విమానాల్లో అత్యధిక డిమాండ్‌ కలిగినది. ఈజిప్టు, భారత్‌, ఖతార్‌, గ్రీస్‌, క్రొయేషియా దేశాలు దీనిని కొన్నాయి. ఇండొనేషియా, సెర్బియా, యూఏఈలు కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.2029 వరకూ సరిపడే ఆర్డర్లు దసో కంపెనీ వద్ద ఇప్పటికే ఉన్నాయి.

GK.jpg

తాజాగా భారత్‌ తన నౌకాదళం కోసం 26 యుద్ధ విమానాలకు ఆర్డర్‌ పెట్టగా వాటిని 2031 నాటికి డెలివర్‌ చేస్తామని ఫ్రాన్స్‌ చెప్పిందంటే రాఫెల్‌కు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.


అంతర్జాతీయ మార్కెట్లో అమెరికాకు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానం రాఫెల్‌కు ప్రధాన పోటీదారుగా ఉంది. గతంలో భారత్‌ 126 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు బిడ్లు ఆహ్వానించగా అందుకోసం రాఫెల్‌తోపాటు ఎఫ్‌-16 కూడా పోటీ పడింది. అయితే భారత్‌ దీనిని కాదని రాఫెల్‌ను ఎంచుకుంది. 2019లో బాలాకోట్‌ దాడుల మర్నాడు పాక్‌ ఎఫ్‌-16 విమానాన్ని భారత్‌కు చెందిన పాత మిగ్‌-21 విమానం కూల్చివేసిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎఫ్‌-16కు అంతర్జాతీయ మార్కెట్లో కొంత ఎదురుదెబ్బ తగిలింది. రాఫెల్‌కు ఆర్డర్లు పెరిగాయి. భారత వాయుసేన తాజాగా మరో 110 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇందులో కూడా రాఫెల్‌తో నాలుగు అమెరికన్‌ యుద్ధ విమానాలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఎఫ్‌-16 (ఎఫ్‌-21 అని పేరు మార్చారు), ఎఫ్‌-18, ఎఫ్‌ 15ఈఎక్స్‌ విమానాలు ఉండగా ట్రంప్‌ ప్రకటన తర్వాత ఎఫ్‌-35 కూడా వచ్చి చేరింది. భారత్‌ రాఫెల్‌ బదులు వీటిలో దేనిని ఎంచుకున్నా అది అమెరికన్‌ కంపెనీలకు లాభం. ఎఫ్‌-16, ఎఫ్‌-35లను అమెరికన్‌ లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ తయారు చేస్తుండగా ఎఫ్‌-18, ఎఫ్‌-15ఈఎక్స్‌ విమానాల్ని బోయింగ్‌ తయారు చేస్తోంది.

hl.jpg

ఈ నేపథ్యంలో తాజా భారత్‌-పాక్‌ యుదఽ్ధం అటు ఫ్రెంచ్‌, ఇటు అమెరికన్‌ కంపెనీల మధ్య సమాచార యుద్ధంగా మారి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. రాఫెల్‌ విమానాలు కూలిపోయాయని ప్రచారం జరిగితే అది లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌లకు లాభం. రాఫెల్‌ విమానం కూలిపోయిన మాట నిజమేనంటూ ఒక ఫ్రెంచ్‌ ఇంటెలిజన్స్‌ అధికారి ధ్రువీకరించినట్లు అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్‌ ఇటీవల ఒక వార్తను ప్రచురించింది. ఆ అధికారి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. అయితే ఒక భారతీయ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్త ఆధారంగా ఆ అధికారి సీఎన్‌ఎన్‌కు అలా చెప్పినట్టు బయటపడింది. నిజానికి ఆ వెబ్‌సైట్‌ ప్రచురించినది తప్పుడు వార్త. భారత్‌కు చెందిన ఒక మిరాజ్‌ యుద్ధ విమానం తన చమురు ట్యాంక్‌(దీనిని డ్రాప్‌ ట్యాంక్‌ అంటారు)ను కిందికి జారవిడిస్తే ఆ ట్యాంకు తాలూకు శకలాలను విమాన శకలాలుగా చూపుతూ ఆ వెబ్‌సైట్‌ కథనం ప్రచురించింది. దాని ఆధారంగా సీఎన్‌ఎన్‌ కథనం వచ్చింది. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో ఎఫ్‌-16, రాఫెల్‌ల మధ్య తీవ్ర పోటీ ఉన్న తరుణంలో ఒక అమెరికన్‌ వార్తాసంస్థ ఇలాంటి వార్త ఇవ్వడం కేవలం యాదృచ్ఛికమే అని అనుకోనక్కర్లేదు.


మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాక్‌పై దాడికి భారత్‌ సన్నాహాలు చేస్తుండగానే పాక్‌ తన ఎఫ్‌-16 యుద్ధ విమానాల్ని సరిహద్దుకు చాలా దూరంగా తీసుకువెళ్లిపోయింది. భారత్‌కు చెందిన ఎస్‌-400 విమాన విధ్వంసక వ్యవస్థల నుంచి ఎఫ్‌-16లను రక్షించుకునేందుకే పాక్‌ అలా చేసినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి భారత్‌కు వ్యతిరేకంగా వాడబోమనే హామీ మేరకే ఎఫ్‌-16లను పాక్‌కు అమెరికా విక్రయించింది. కానీ అలాంటి హామీల్ని నిలబెట్టుకునే అలవాటు పాక్‌కు లేదు. బాలాకోట్‌ సమయంలో ఎఫ్‌-16 కూలిందనే వార్తల వల్ల తమకు నష్టం జరిగినందున ఈసారి అలా జరగకుండా చూసేందుకే అమెరికా పాక్‌ను ప్రస్తుతం ఇలా గట్టిగా కోరి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే తాజా యుద్ధంలో ఎఫ్‌-16 పేరు అంతగా వినిపించలేదు. ఒక ఎఫ్‌-16ను భారత్‌ కూల్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ వాటిని భారత రక్షణ శాఖ ధ్రువీకరించలేదు. వెరసి రాఫెల్‌లు కూలిపోయినట్లు ప్రచారం ఎక్కువగా జరిగింది కానీ, ఎఫ్‌-16 కూలినట్లు ప్రచారం ఆ స్థాయిలో జరగలేదు. దీని వెనక అమెరికా ప్రచార లాబీ పనిచేసి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి.


చైనాకు చెందిన చెంగ్దు కార్పొరేషన్‌ అనే సంస్థ జే10 యుద్ధ విమానాల్ని తయారు చేస్తోంది. చాలావరకూ ఎఫ్‌-16లను పోలి ఉండే ఈ విమానాల డిజైన్‌ను ఇజ్రాయెల్‌(లావీ) నుంచి చైనా సంపాదించింది. ఈ జే10లను చైనా ఇటీవలే పాక్‌కు అమ్మింది. ఇది కాకుండా జేఎఫ్‌-17 అనే చౌకరకం యుద్ధ విమానం ఒకదాన్ని చైనా, పాక్‌ కలిసి తయారుచేశాయి. ఈ జేఎఫ్‌-17 విమానాల్ని వివిధ దేశాలకు అమ్మేందుకు పాక్‌ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. తాజా యుద్ధంలో జే-10లు, జేఎఫ్‌-17లు అనేక భారత యుద్ధ విమానాల్ని కూల్చివేసినట్లు చైనా, పాకిస్థాన్‌ కలిసి విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి. దీనివెనుక చెంగ్దు కార్పొరేషన్‌ ప్రచార వ్యూహం దాగి ఉంది.

ఒక దేశానికి చెందిన ఆయుధ కంపెనీలు మరో దేశానికి చెందిన కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఒక ఎత్తయితే.. ఒకే దేశానికి చెందిన వేర్వేరు ఆయుధ కంపెనీలు ఒకదానికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవడం మరో ఎత్తు. అమెరికాలో ఇలాంటివి సర్వసాధారణం. అక్కడ లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌ కంపెనీల మధ్య ఆయుధ కాంట్రాక్టుల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. 20 ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటనను పరిశీలిస్తే అమెరికాలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. 2004లో భారత్‌-అమెరికాల మధ్య కోప్‌ ఇండియా పేరిట వైమానిక విన్యాసాలు(వార్‌ గేమ్స్‌) జరిగాయి. వాటిలో అమెరికా తరఫున ఎఫ్‌-15(అమెరికన్‌ బోయింగ్‌ తయారీ) యుద్ధ విమానాలు పాల్గొనగా, భారత్‌ తరఫున ఎస్‌యూ-30కే(రష్యన్‌ సుఖోయ్‌ తయారీ) విమానాలు పాల్గొన్నాయి. ఈ విమానాల మధ్య జరిగిన పోటీలో 90 శాతం భారత సుఖోయ్‌ విమానాలు విజయం సాధించాయని, అమెరికన్‌ ఎఫ్‌-15లు ఓటమి చవిచూశాయని వాయుసేన వర్గాలను ఉటంకిస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. కోప్‌ ఇండియా విన్యాసాల ఫలితాలు ‘‘మన కళ్లు తెరిపించేలా ఉన్నాయి’’ అంటూ అమెరికా వాయుసేన చీఫ్‌ యూఎస్‌ కాంగ్రె్‌సలో ఒక ప్రకటన చేశారు కూడా! అయితే బోయింగ్‌ ఎఫ్‌-15లు పనికిరానివనే అభిప్రాయం కలిగించి వాటి స్థానంలో లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారీ ఎఫ్‌-22 యుద్ధ విమానాల్ని అమెరికా వాయుసేన చేత కొనిపించడం కోసమే ఈ దుష్ప్రచారం చేసి ఉండవచ్చని తర్వాత వార్తలు వచ్చాయి. తుదకు అమెరికా ఎఫ్‌-22 విమానాల్ని పరిమిత సంఖ్యలోనే కొనుగోలు చేసింది. వాటితోపాటు ఎఫ్‌-15లను కూడా తన వాయుసేనలో కొనసాగించింది. అదే ఎఫ్‌-15 ఇప్పుడు ఎఫ్‌-15ఈఎక్స్‌ రూపంలో భారత ఆర్డర్‌ కోసం పోటీ పడుతోంది.


యుద్ధ సమయంలో ఏ ప్రభుత్వమూ తమ ప్రజలకు పూర్తి నిజాలు చెప్పదు, చెప్పలేదు. ‘‘యుద్ధంలో మొదట చచ్చేది నిజమే’’ అనే నానుడి కూడా ఉంది. దానికి ఆయుధ కంపెనీల సమాచార పోరాటం కూడా తోడవ్వడంతో చాలాసార్లు నిజం సమాఽధి అయిపోతూ ఉంటుంది. లక్షల కోట్ల వ్యాపారం కంటే నిజం పెద్ద విలువైనదేమీ కాదని ఆ కంపెనీలు భావిస్తుంటాయి.

- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 05:44 AM