Share News

US Education: ఎఫ్‌-1 వీసా నిబంధనల్లో త్వరలో మార్పులు

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:19 AM

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్‌-1 వీసా నిబంధనల్లో మార్పులకు ట్రంప్‌ యంత్రాంగం చేసిన ప్రతిపాదనలు భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ను దెబ్బకొట్టేలా ఉన్నాయి.

US Education: ఎఫ్‌-1 వీసా నిబంధనల్లో త్వరలో మార్పులు

  • అమల్లోకి వస్తే వర్సిటీ, కోర్సుల మార్పు కష్టమే

  • కోర్సులు చేస్తూ ఉండిపోవడం కుదరదు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్‌-1 వీసా నిబంధనల్లో మార్పులకు ట్రంప్‌ యంత్రాంగం చేసిన ప్రతిపాదనలు భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ను దెబ్బకొట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లి ఏదో ఒక కోర్సు చేస్తున్నామని చెబుతూ అక్కడే సెటిల్‌ అయిపోదామనుకునే వారి ఆశలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. ఎఫ్‌-1 వీసాతో అమెరికా వెళ్లిన విద్యార్థులు తాము చదువుకునే కోర్సు కాలపరిమితి ప్రకారం ఆ దేశంలో ఉండవచ్చు. కోర్సులో చేరిన తర్వాత మేజర్స్‌ లేదా ప్రోగ్రామ్‌ను కూడా మార్చుకోవచ్చు. కోర్సు అధికారికంగా పూర్తయిన తర్వాత అదనంగా మరో 60 రోజులు అక్కడే ఉండవచ్చు. ఆ తర్వాత కూడా మరికొన్ని రోజులు అక్కడే ఉండాలనుకుంటే ఓపీటీ(ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) లేదా స్టెమ్‌(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాఽథమెటిక్స్‌) ఓపీటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కోర్సులు లేదా ట్రైనింగ్‌ ప్రొగ్రామ్‌ ఆధారంగా వీసా గడువును పొడిగిస్తారు. అయితే, ట్రంప్‌ యంత్రాంగం తాజాగా చేసిన ప్రతిపాదనలు ఈ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధులు తమ మేజర్స్‌, ప్రోగ్రామ్స్‌ను అమెరికా వెళ్లిన తొలి సంవత్సరంలో మార్చుకునే వీలు ఉండదని అంటున్నారు. ఓ డిగ్రీని అమెరికాలో పూర్తి చేసి అదే స్థాయి లేదా అంతకంటే తక్కువ స్థాయి డిగ్రీ చేసేందుకు మళ్లీ ఎఫ్‌-1 వీసా పొందాలంటే ఇక కుదరదని చెబుతున్నారు. అలాగే, ఓ కోర్సు చేసేందుకు ఎఫ్‌-1 వీసాపై అమెరికా వెళ్లి మరో కొత్త కోర్సు చేస్తామంటే అంగీకరించరని అంటున్నారు. కొత్త కోర్సు చేయాలనుకునే వారు స్వదేశానికి వచ్చి వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు.


డీహెచ్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందే

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం కోర్సు కాల పరిమితి ప్రకారం గరిష్ఠంగా నాలుగేళ్ల కాల పరిమితితో ఎఫ్‌-1 వీసా జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా అమెరికాలో ఉండాలనుకునే వారు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎ్‌స)కు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఎఫ్‌-1 వీసాదారులు తమ కోర్సు పూర్తయిన తర్వాత 60 రోజులు దాకా అమెరికాలో ఉండవచ్చు. ఈ సమయంలో చాలామంది ఉద్యోగం సాధించి హెచ్‌-1బీ వీసా పొందుతున్నారు. ఇప్పుడు 60 రోజుల గడువును 30 రోజులకు కుదించనున్నారు. దీంతో విద్యార్థి వీసాతో అమెరికా వచ్చి ఆ తర్వాత హెచ్‌-1బీ వీసా పొందడం మరింత కష్టం కానుందని భారతీయ అమెరికన్‌ శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌ వస్తుందని ఆశించే వారు ఇకపై ఈఓఎ్‌సతో పాటు వర్క్‌ ఆథరైజేషన్‌ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు.


ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలే లక్ష్యం కావాలి

ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి వస్తే ఓపీటీ ద్వారా హెచ్‌-1 బీ వర్క్‌ వీసా పొందడం, విద్యార్ధులు ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాల్లో చేరడం కష్టం అవుతుంది. అందువల్ల విద్యార్థులు మేజర్స్‌/ప్రోగ్రామ్‌లలో మార్పులు తగ్గించుకోవాలి. చివరి నిమిషం వరకూ వేచి ఉండకుండా ఈఓఎ్‌స(ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ స్టే)కు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఈఓఎస్‌ నిబంధనలకు అనుగుణంగా ఓపీటీ/స్టెమ్‌ అప్లికేషన్‌లు ఉండేలా చూసుకోవాలి. అధిక జీతం వచ్చే ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకోవాలి. అప్పుడే హెచ్‌-1 బీకు అవకాశం ఉంటుంది.

- దిలీప్‌ కుమార్‌ నూనె, రిజిస్టర్డ్‌ మైగ్రేషన్‌ ఏజెంట్‌, కాస్మిక్‌ ఓవర్‌సీస్‌ కన్సల్టెంట్స్‌

Updated Date - Aug 31 , 2025 | 05:19 AM