Share News

Mumbai Attacks: ముంబై ఉగ్ర దాడి కేసు నిందితుడు రాణా అప్పగింతకు అమెరికా ఓకే

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:21 AM

రాణాను విచారిస్తే ముంబై దాడుల వెనక పాకిస్థాన్‌ నాటి ప్రభుత్వ పెద్దల హస్తంపైనా దర్యాప్తు అధికారులు ఆధారాలు సంపాదించే అవకాశం ఉంటుందని సమాచారం. దాడుల వెనక పాక్‌ పాత్రను కూడా బయటపెడతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Mumbai Attacks: ముంబై ఉగ్ర దాడి కేసు నిందితుడు రాణా అప్పగింతకు అమెరికా ఓకే

26/11 ఉగ్ర దాడి వెనక పాక్‌ నేతల పాత్రను వెలుగులోకి తెచ్చే అవకాశం!

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌ డీసీ, ఫిబ్రవరి 14: ముంబై 26/11 ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్న తహవుర్‌ హుస్సేన్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించింది. రాణాను విచారిస్తే ముంబై దాడుల వెనక పాకిస్థాన్‌ నాటి ప్రభుత్వ పెద్దల హస్తంపైనా దర్యాప్తు అధికారులు ఆధారాలు సంపాదించే అవకాశం ఉంటుందని సమాచారం. దాడుల వెనక పాక్‌ పాత్రను కూడా బయటపెడతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 2008 నవంబరు 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబై చేరుకొని.. తాజ్‌మహల్‌, ఒబెరాయ్‌ హోటళ్లు, రైల్వే స్టేషన్‌, యూదుల సెంటర్‌పై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 166 మంది మరణించగా.. వారిలో అమెరికన్లు, బ్రిటిషర్లు, ఇజ్రాయెలీలు కూడా ఉన్నారు. దాదాపు 60 గంటల పాటు జరిగిన భీకర దాడులతో యావత్‌ దేశమే వణికిపోయింది. ఒక దశలో భారత్‌.. పాకిస్థాన్‌పై యుద్ధానికి కూడా సన్నద్ధమైంది. ముంబైలో ఉగ్రవాదులు దాడులకు ఎంచుకున్న ప్రాంతాల్లో చాలా ముందుగానే డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.


అతడికి పాకిస్థాన్‌కు చెందిన కెనడా దేశస్థుడు తహవుర్‌ రాణా సహకరించినట్లు గుర్తించారు. రాణ ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతనికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది. రాణా, హెడ్లీపై ఉగ్ర దాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. రాణాకు పాక్‌కు చెందిన ఐఎ్‌సఐతోనూ సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. 2008 నవంబరు 11న భారత్‌కు వచ్చిన రాణా.. 21వ తేదీ వరకు దేశంలోనే ఉన్నాడు. మధ్యలో రెండు రోజులు ముంబైలోని ఓ హోటల్‌లో బస చేసినట్లు దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. రాణా, హెడ్లీ ఈ మెయిల్‌ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారని.. వాటిలో 26/11 దాడుల సమాచారం కూడా ఉందని వెల్లడించారు. 26/11 ముంబై ఉగ్రదాడులు జరిగిన ఏడాది తర్వాత.. 2009 అక్టోబరులో షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రస్తుతం లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రాణాకు పాక్‌ ఉగ్ర సంస్థలు లష్కరే తాయిబా, హర్కతుల్‌ జిహాదీ ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయని, ముంబై దాడుల్లో అతని భాగస్వామ్యం ఉందని భారత్‌ ఆరోపించింది. రాణాను అప్పగించాలంటూ చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తోంది.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:21 AM