Denied Aadhaar Over Burqa: బుర్ఖా విషయంలో గొడవ.. భార్యా, పిల్లల్ని చంపేసిన వ్యక్తి
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:16 AM
ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. బుర్ఖా విషయంలో గొడవ కారణంగా భార్యాపిల్లల్ని హత్య చేశాడు. పుట్టింట్లో ఉన్న సమయంలో భార్య బుర్ఖా వేసుకోలేదన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
బుర్ఖా విషయంలో గొడవ ఓ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఓ వ్యక్తి తన భార్యాపిల్లల్ని అత్యంత దారుణంగా చంపేశాడు. భార్య బుర్ఖా వేసుకోకుండా పుట్టింట్లో ఉందన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శామ్లీకి చెందిన ఫరూఖ్, తహీరా భార్యాభర్తలు. చాలా చిన్న వయసులోనే వీరికి పెళ్లయింది. వీరికి ఐదుగురు సంతానం. ఫరూఖ్ పెళ్లిళ్లకు వంటలు చేస్తూ ఉంటాడు. తహీరా ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకుంటూ ఉంది. పెళ్లైన నాటినుంచి ఫరూఖ్ భార్యను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.
ఆమెను బుర్ఖా లేకుండా ఇంటి బయటకు వెళ్లనిచ్చేవాడు కాదు. ఆఖరికి ఆదార్, రేషన్ కార్డులను కూడా తీసుకోనివ్వలేదు. వాటి కోసం బుర్ఖా లేకుండా ఫొటో దిగాలన్న కారణంతో అడ్డు చెప్పాడు. ఈ విషయంలో గత కొద్దిరోజులనుంచి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల అక్కడే ఉండి భర్త దగ్గరకు వచ్చింది. అయితే, తహీరా పుట్టింట్లో ఉన్న సమయంలో బుర్ఖా వేసుకోలేదని ఫరూఖ్‌కు తెలిసింది. దాన్ని అతడు అవమానంగా భావించాడు. భార్య మీద ఆగ్రహానికి గురయ్యాడు. డిసెంబర్ 10వ తేదీన వంటింట్లో ఉన్న భార్యను తుపాకితో కాల్చి చంపేశాడు.
గన్ పేలిన శబ్ధం రావటంతో పెద్ద కూతురు అఫ్రీన్ వంట గది దగ్గరకు వెళ్లింది. అతడు ఆమెను కూడా తుపాకితో కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన రెండో కూతురు సెహ్రీన్‌ను గొంతు నులిమి చంపేశాడు. మూడు శవాలను మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన గుంతలో వేసి పూడ్చేశాడు. దాని మీద రాళ్లు పరిచాడు. ఆరు రోజులు అయినా కోడలు, ఇద్దరు మనవరాళ్లు కనిపించకపోవటంతో ఫరూఖ్ తండ్రికి అనుమానం వచ్చింది. ఫరూఖ్‌ను వారి గురించి నిలదీశాడు. శామ్లీలోని అద్దె ఇంట్లో ఉంచానని ఫరూఖ్ ఆయనకు చెప్పాడు. ఫరూఖ్ మాటలు ఆయనకు నమ్మబుద్ధి కాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫరూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఫరూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండిః
మెస్సి కోల్‌కతా పర్యటన.. కోర్టును ఆశ్రయించిన గంగూలీ!
కాంగ్రెస్‌లో అంతర్మథనం.. రంగారెడ్డి శివార్లలో గట్టిపోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్