Man Climbs Electric Tower: భార్య చనిపోతే ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు మూడో పెళ్లి కావాలట..
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:22 PM
గురువారం ఉదయం ఊరు చివరన ఉన్న టవర్ దగ్గరకు వెళ్లాడు రాజ్. టవర్ ఎక్కి ‘నాకు నా మరదలితో పెళ్లి చేయాల్సిందే. లేదంటే కిందుకు దూకి చచ్చిపోతా’ అంటూ బెదిరింపులకు దిగాడు.
ఉత్తర భారతదేశంలో మతి పోగొట్టే ఫ్యామిలీ డ్రామాలు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిజ జీవితాల్లోనూ సినిమాలను మించి ట్విస్ట్‌లు ఉంటున్నాయి. తాజాగా చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఆ సంఘటనలో ఓ యువకుడు భార్య చెల్లెలితో పెళ్లి చేయాలంటూ ఏకంగా టవర్ ఎక్కాడు. దాదాపు ఏడు గంటలు టవర్ మీదే ఉండిపోయాడు. మరదలితో పెళ్లి చేస్తామని మాట ఇచ్చిన తర్వాతే కిందకు దిగి వచ్చాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కనౌజ్‌కు చెందిన రాజ్ సక్సేనా అనే యువకుడికి 2021లో అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లయింది. పెళ్లయిన సంవత్సరానికే ఆ యువతి అనారోగ్యం కారణంగా చనిపోయింది. దీంతో అత్తింటి వారు యువతి చెల్లెలిని అతడికిచ్చి పెళ్లి చేశారు. గత రెండేళ్లుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే, భార్య చెల్లెలితో రాజ్ ప్రేమలో పడ్డాడు. ఆమె లేకపోతే బతకలేను అన్న స్థాయికి వచ్చాడు. ఇదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరాడు. ఇందుకు భార్య ఒప్పుకోలేదు.
దీంతో గురువారం ఉదయం ఊరు చివరన ఉన్న టవర్ దగ్గరకు వెళ్లాడు రాజ్. టవర్ ఎక్కి ‘నాకు నా మరదలితో పెళ్లి చేయాల్సిందే. లేదంటే కిందికి దూకి చచ్చిపోతా’ అంటూ బెదిరింపులకు దిగాడు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎంత బతిమలాడినా అతడు కిందకు దిగిరాలేదు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడికి నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నం చేశారు. అయితే, అతడు కిందకు దిగలేదు. చివరకు చేసేది ఏమీ లేక అతడి కోరికను అత్తింటి వారు అంగీకరించారు. మూడో కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. రాజ్ కిందకు దిగి వచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మరదలు కూడా అతడ్ని ప్రేమిస్తోందట.
ఇవి కూడా చదవండి
ఎస్టీ జాబితాలో లంబాడీ, సుగాలీ, బంజారాలు.. కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ప్రముఖ యూనివర్సిటీ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు