Conwoman Instigates Acid Attack: సినిమాను మించిన ట్విస్ట్.. డబుల్ యాక్షన్ సినిమా చూపించింది..
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:57 PM
పోలీసులను చూడగానే అతడు తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులు మొదలెట్టాడు. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారు. నిషు రెండు కాళ్లకు బుల్లెట్లు తగలటంతో నేల కూలాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
ఓ మహిళ యువతిపై కక్ష గట్టింది. యువతిని ఎలాగైనా నాశనం చేయాలని అనుకుంది. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. తను ఎఫైర్ పెట్టుకున్న యువకుడికి మాయమాటలు చెప్పి దారుణానికి ఒప్పించింది. యువకుడితో యువతిపై యాసిడ్ దాడి చేయించింది. మొత్తానికి ఇద్దరు నిందితులు పోలీసులకు దొరికిపోయారు. పోలీసుల దర్యాప్తులో మతిపోగొట్టే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళ తెలివికి పోలీసులే షాక్ అయ్యారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కొన్ని నెలల క్రితం అమ్‌రోహా జిల్లాలోని టిగ్రి గ్రామానికి చెందిన నిషు తివారీ అనే వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా డాక్టర్ అర్చన పరిచయం అయింది. ఈ పరిచయం కొంత కాలానికే ప్రేమగా మారింది. ఇద్దరూ ఫోన్‌లో తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆర్చన తన బాధలన్నీ అతడికి చెప్పుకుంటూ ఉండేది. ఓ రోజు అర్చన తన చెల్లెలు జాహ్నవి గురించి నిషుకు చెప్పింది. ‘మా చెల్లెలు జాహ్నవికి కొన్ని నెలల క్రితం ఓ ఆర్మీ వ్యక్తితో పెళ్లి నిశ్చయిం అయింది. అయితే, అతడు పెళ్లి క్యాన్సిల్ చేశాడు.
వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అతడు ప్రేమించిన అమ్మాయి కారణంగా నా చెల్లెలు జీవితం నాశనం అయింది. ఆ అమ్మాయి టీచర్‌గా పని చేస్తోంది. తనపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి’ అని అంది. నిషును ఆ టీచర్‌పై యాసిడ్ దాడి చేసేలా బ్రెయిన్ వాష్ చేసింది. అతడు ఇందుకు ఒప్పుకున్నాడు. గురువారం రోడ్డుపై వెళుతున్న టీచర్‌పై స్కూటీపై వచ్చి యాసిడ్ పోశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు గాయపడ్డ టీచర్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సంఘటన గురించి సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు నిషు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కళ్యాణ్‌పూర్ గ్రామం దగ్గర స్కూటీపై వెళుతున్న అతడ్ని అడ్డగించారు. పోలీసులను చూడగానే అతడు తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులు మొదలెట్టాడు. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారు. నిషు రెండు కాళ్లకు బుల్లెట్లు తగలటంతో నేల కూలాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా అర్చన గురించి చెప్పాడు. పోలీసులు అర్చనను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
అర్చన, జాహ్నవి ఇద్దరు కాదు ఒకరని తేలింది. నిషును వలలో వేసుకోవడానికి అర్చన డబుల్ యాక్షన్ డ్రామా ఆడింది. నిషును నమ్మించడానికి తన ముఖంపై ఉన్న మచ్చను సైతం తీయించుకుంది. ఆమెకు అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఓసారి భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి నిషుతో ఊరు విడిచిపారిపోయింది. అయితే, టీచర్‌పై అర్చన ఎందుకు కక్ష గట్టిందన్న వివరాలు తెలియ రాలేదు. టీచర్‌పై కక్ష సాధించడానికి నిషును వాడుకుంది. అతడితో యాసిడ్ దాడి చేయించింది.
ఇవి కూడా చదవండి
అయ్యో పాపం.. వరదలో చిక్కుకుపోయిన పూజారి..
తెలంగాణలో భారీ వర్షాలు.. జనసేనికులకు ఉపముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం..