Hyderabad Floods 2025: అయ్యో పాపం.. వరదలో చిక్కుకుపోయిన పూజారి..
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:44 AM
30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది.
హైదరాబాద్‌లో మూసీ ఉగ్రరూపం దాల్చింది. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వరద రావటంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. మూసీ ఉధృతికి ఎమ్‌జీబీఎస్ బస్టాండ్ వరద నీటిలో చిక్కుకుపోయింది. అధికారులు బస్టాండ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. పూర్తిగా బస్టాండ్‌ను ఖాళీ చేయించారు. బయటినుంచే రాకపోకలు సాగుతున్నాయి. రాత్రి ఒక్కసారిగా వరద రావటంతో మూసానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. జనం కట్టుబట్టలతో ఇళ్లనుంచి బయటకు వచ్చేశారు.
తమ సామాన్లు మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయాయని చెబుతూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పురానాపూల్ దగ్గర ఓ పూజారి వరదలో చిక్కుకుపోయాడు. గుడిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. పూజారికి సంబంధించిన దృశ్యాల తాలూకా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, అధికారులు పూజారిని వరద నుంచి బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.