DA and DR Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హోలీకి ముందే తీపి కబురు..
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:50 PM
ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఓసారి అంటే జనవరి, జులై నెలల్లో రెండుసార్లు డీఏ, డీఆర్‍ను సవరిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంటుంది. అదే విధంగా ఈ ఏడాదీ ఆ ట్రెండ్ కొనసాగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ ఏడాది హోలీ పండగ లోపు కేంద్ర క్యాబినెట్ వారికి తీపి కబురు చెప్పనుంది. మార్చి 14న జరిగే హోలీ పండగకు ముందే ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్(డీఏ), డియర్‌నెస్ రిలీఫ్(డీఆర్)ని పెంచుతూ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం ఒకవేళ డీఏ, డీఆర్‍లు పెంచితే ఏకంగా 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. డిసెంబర్ 2024కి సంబంధించిన AICPI-IW డేటా ప్రకారం ఈ ఏడాది డీఏలో 2 శాతం పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ చేతుల్లోనే ఉంటుంది.
ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఓసారి అంటే జనవరి, జులై నెలల్లో రెండుసార్లు డీఏ, డీఆర్‍ను సవరిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంటుంది. అదే విధంగా ఈ ఏడాదీ ఆ ట్రెండ్ కొనసాగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. కాగా, జనవరి నుంచి చేసే డీఏ, డీఆర్ సవరణలను మార్చిలో, జులైకి సంబంధించి అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రకటనలు చేస్తుంటారు. వీటి కోసం లబ్ధిదారులు వెయ్యి కళ్లతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి మార్చి 5న న్యూఢిల్లీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపుపై ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఉత్కంఠ నెలకొంది. కాగా, చివరి డీఏ పెరుగుదల జులై 2024లో 50 శాతం నుంచి 53 శాతానికి పెంచబడింది.
మార్చి 7, 2024న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో డీఏను 46 నుంచి 50 శాతానికి పెంచారు. ఇది హోలీకి కొద్ది రోజుల ముందు మార్చి 25, 2024న అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వం 7వ పే కమిషన్ కింద అక్టోబర్ 16, 2024న డీఏ, డీఆర్‍ను మరోసారి పెంచింది కేంద్రం. ఈసారి 3 శాతం పెంచి ఏకంగా 53 శాతానికి తీసుకెళ్లింది. దీన్ని జులై 1, 2024 నుంచి అమలు చేశారు. దీంతో ఈసారీ భారీగానే పెంచుతారనే అంతా భావిస్తున్నారు.
అయితే జనవరి 2025లో కేంద్రం 8వ వేతన సంఘం కోసం ప్రణాళికలను ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది నాటికి అమలులోకి వస్తుంది. ఒకవేళ 8వ వేతన సంఘం అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అంతా భావిస్తున్నారు. వారి ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే 8వ పే కమిషన్ అమల్లోకి వస్తే ఇప్పటికే ఉన్న అలవెన్సులు రద్దై కొత్తవి ప్రవేశపెట్టవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Tejasvi Surya: బీజేపీ ఎంపీ రిసెప్షన్ వేడుక.. అతిథులకు కీలక సూచన..
Gold Smuggling Case: రన్యా రావుకు ఈ విషయంలో గత ప్రభుత్వ సహకారం.. KIADB నివేదిక విడుదల..