Mumbai Actress Son's Death: 57వ అంతస్తు నుంచి దూకి టీవీ నటి కుమారుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 03 , 2025 | 08:14 PM
ముంబైకి చెందిన ఓ టీవీ నటి కుమారుడు (14) 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో అతడు తగాదా పడి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో బుధవారం సాయంత్రం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ నటి కుమారుడు (14) 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాందీవలీ ప్రాంతంలోని ఓ ఆకాశహర్మ్యంలోగల 51వ అంతస్తు అపార్ట్‌మెంట్‌లో ఆ నటి తన కుమారుడితో కలిసి ఉంటున్నారు (TV actress son suicide Mumbai).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. అయితే, ట్యూషన్‌కు వెళ్లే విషయంలో బాలుడికి, అతడి తల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. ట్యూషన్‌కు వెళ్లేందుకు బాలుడు సుతారమూ ఇష్టపడలేదని పోలీసులు తెలిపారు. తల్లితో గొడవ పడి బయటకు వచ్చిన అతడు 57వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడని తెలిసింది.
బాలుడి ఆత్మహత్య యత్నాన్ని గమనించిన పొరుగు వ్యక్తి అతడి తల్లికి సమాచారం అందించారు. అయితే, ఈ ఘటనలో అనుమానాస్పదమేమీ లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ సర్వీసు అధికారులు యాక్సిడెంటల్ డెత్‌గా కేసును రిజిస్టర్ చేశారు.
ఈ ఘటనలో ఇప్పటివరకూ తమకు అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే, బాలుడి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. నటికి బాలుడు ఒక్కడే సంతానమని పోలీసులు తెలిపారు. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కొడుకుతో కలిసి విడిగా ఉంటోందని అన్నారు. పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాప్యులర్ అయ్యారు.
మృతుడి తల్లి, టీచర్లు, ఆ కుటుంబానికి సన్నిహితులను విచారించి బాలుడి ఒత్తిడికి కారణమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. చదువుల్లో ఒత్తిడే బాలుడిని ఈ ఆత్మహత్యకు పురిగొల్పిందా అనేదానిపై ప్రధానంగా దృష్టి పెట్టామని అన్నారు. బాలుడి మానసిక స్థితి, స్కూల్లో వాతావరణం, కుటుంబ పరిస్థితులనన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఎఫ్-35 జెట్‌ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్.. చిన్న భాగాలుగా విడగొట్టి..
అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్‌డీఓ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి