Donald Trump: ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ చట్టానికి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:28 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్ యాక్ట్‌కు అక్కడి ప్రతినిధుల సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది.
ప్రతినిధుల సభలోనూ ఆమోదం
నేడు అధ్యక్షుడి సంతకంతో అమల్లోకి..
వాషింగ్టన్, జూలై 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్ యాక్ట్’కు అక్కడి ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం తెలిపింది. ప్రభుత్వ వ్యయంలో, సబ్సిడీలలో కోతలు, వివిధ పన్నుల్లో భారీ స్థాయిలో మార్పులు తలపెడుతూ ట్రంప్ యంత్రాంగం ఈ బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి మంగళవారం సెనేట్‌లో బొటాబొటీ మెజారిటీతో ఆమోదం లభించగా.. గురువారం ప్రతినిధుల సభలో దీనికి అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడి సంతకంతో చట్టం అమల్లోకి రానుంది.
940 పేజీలతో కూడిన ‘బిగ్ బ్యూటీఫుల్ బిల్ చట్టం’లో ట్రంప్ యంత్రాంగం చాలా కఠిన అంశాలే చేర్చింది. ఆహార సబ్సిడీలకు కోత, గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహకాల రద్దు, వలసదారులను స్వదేశాలకు తిప్పిపంపేందుకు కఠిన చర్యలు, విద్యా రుణాల సాయంలో కోతలు, రక్షణ రంగ వ్యయం భారీగా పెంపు, ఆరోగ్య రంగానికి సబ్సిడీల కోత, కొత్తగా జన్మించిన పిల్లల పేరిట వెయ్యి డాలర్ల చొప్పున జమచేసే ‘ట్రంప్ సేవింగ్స్’ ఖాతాలు, దిగుమతులపై మరిన్ని ఆంక్షలు, విమానయాన వ్యవస్థల ఆధునీకరణ వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి.