Share News

Tamil Nadu: స్కూలు బస్సును ఢీకొన్న రైలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 02:20 AM

తమిళనాడులోని కడలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

Tamil Nadu: స్కూలు బస్సును ఢీకొన్న రైలు

  • ముగ్గురు విద్యార్థుల మృతి.. డ్రైవర్‌ సహా ఇద్దరికి గాయాలు

  • గేటుమ్యాన్‌కు తమిళం రాకపోవడం వల్లే ప్రమాదం: డీఎంకే

చెన్నై, జూలై 8 (ఆంధ్రజ్యోతి)/న్యూఢిల్లీ: తమిళనాడులోని కడలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సెమ్మంకుప్పం రైల్వేగేటు వద్ద పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, బస్సు డ్రైవర్‌, మరో విద్యార్థి గాయపడ్డారు. స్కూల్‌కు వెళ్లడంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు మూసివున్న గేటును తెరవాలని బస్సు డ్రైవర్‌ ఒత్తిడి చేశాడని, దీంతో నిబంధనలకు విరుద్ధంగా గేటుకీపర్‌ అందుకు అనుమతించాడని దక్షిణ రైల్వే చెబుతుండగా.. బస్సు వచ్చిన సమయానికి గేటు తెరిచే ఉందని డ్రైవర్‌ శంకర్‌తో పాటు గాయపడిన విద్యార్థి విశ్వేష్‌ చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంపై ఒక కొత్త కోణంలో రాజకీయ దుమారం రేగింది. క్రాసింగ్‌ వద్ద నియమించిన రైల్వే గేట్‌మ్యాన్‌కు తమిళం అర్థం కాలేదని అధికార డీఎంకే ఆరోపించింది. స్థానిక భాష తెలియకపోవడం వల్ల కమ్యూనికేషన్‌ లోపం జరిగిందని, చివరకు అది ఘోర దుర్ఘటనకు దారితీసిందని పేర్కొంది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇలంగోవన్‌ మాట్లాడుతూ ‘ఘటనాస్థలిలో ఇప్పటికే ఒక ప్రమాదం జరిగింది. అక్కడ ఉండే వ్యక్తికి తమిళ భాష తెలియకపోవమే అందుకు కారణమని రైల్వే అథారిటీ స్వయంగా చెప్పింది. ఇతరులు ఏం చెప్పారో ఆయనకు అర్థం కావడం లేదు. అదే ఇప్పటి ఘటనలో కూడా జరిగింది’ అని పేర్కొన్నారు. అలాంటి ముఖ్యమైన చోట్ల స్థానిక భాష తెలిసిన వారిని నియమించి, ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 02:20 AM