Share News

Delhi Security Guard: కారు యజమాని ఘాతుకం.. హారన్ కొట్టొద్దన్నందుకు..

ABN , Publish Date - May 05 , 2025 | 02:02 PM

Delhi Security Guard: ఆగ్రహానికి గురైన విజయ్ కారుతో తొక్కిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ వెంటనే కారుతో రాజీవ్‌ను తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. బాధితుడి రెండు కాళ్లలో ఎముకలు చాలా చోట్ల విరిగిపోయాయి. రాజీవ్ అరుపులు విని అక్కడికి వచ్చిన పాదచారులు అతడ్ని అస్పత్రికి తరలించారు.

Delhi Security Guard: కారు యజమాని ఘాతుకం.. హారన్ కొట్టొద్దన్నందుకు..
Delhi Security Guard

మనుషుల్లో జాలీ, దయ నశిస్తున్నాయి. సమాజంలో తోటి మనుషుల ప్రాణాలు పోతున్నా.. చూసి కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. తాజాగా, ఇద్దరు వ్యక్తుల మధ్య హారన్ విషయంలో గొడవ జరిగింది. కారు యజమాని మానవత్వం మరిచిపోయి రాక్షసుడిలా ప్రవర్తించాడు. తన మాటలకు ఎదురు చెప్పిన ఓ సెక్యూరిటీ గార్డును కారుతో తొక్కించేశాడు. ఈ సంఘటనలో సెక్యూరిటీ గార్డు రెండు కాళ్లు విరిగిపోయాయి. బాధితుడు నొప్పితో గిలగిల్లాడుతున్నా కారు యజమాని పట్టించుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన రాజీవ్ కుమార్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మహిపాల్ గంజ్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రాత్రి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాడు. క్యాబ్‌లో మహిపాల్ పూర్ చౌక్ దగ్గర దిగాడు. ఓ థార్ ఎస్‌యూవీ అతడి వెనకాల కొచ్చి ఆగింది. ఆ వెంటనే కారు యజమాని విజయ్ గట్టిగా హారన్ కొట్టడం మొదలెట్టాడు. దీంతో రాజీవ్ హారన్ కొట్టొద్దని అన్నాడు. కారుకు అడ్డం జరగాలని విజయ్, రాజీవ్‌ను అడిగాడు. అయితే, ఇందుకు రాజీవ్ ఒప్పుకోలేదు.


దీంతో ఆగ్రహానికి గురైన విజయ్ కారుతో తొక్కిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. రాజీవ్ కోపంగా అక్కడినుంచి పక్కకు వెళుతుండగా.. విజయ్ దారుణానికి పాల్పడ్డాడు. కారుతో రాజీవ్‌ను తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. ముందుతో పాటు వెనుక టైరు కూడా రాజీవ్ మీదనుంచి వెళ్లింది. అతడు నొప్పితో గిలగిల్లాడిపోయాడు. గట్టిగా అరవసాగాడు. విజయ్ అంతటితో ఆగకుండా కారును రాజీవ్ పైకి రివర్స్ చేశాడు. బాధితుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. కారుతో తొక్కించిన తర్వాత విజయ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. రాజీవ్ అరుపులు విని అక్కడికి వచ్చిన పాదచారులు అతడ్ని అస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..

Hyderabad Woman: మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి

Updated Date - May 05 , 2025 | 02:02 PM