Share News

Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..

ABN , Publish Date - May 05 , 2025 | 12:53 PM

Mughal Descendant: తాను పేదరికంలో కొ్ట్టుమిట్టాడుతున్నానని, ప్రభుత్వం ఇచ్చే ఫించన్ చాలటం లేదని మొఘల్ వారసురాలు పేర్కొంది. ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను మళ్లీ తమకు స్వాధీనం చేయాలంటూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..
Mughal Descendant

దేశాన్ని వందల ఏళ్ల పాటు పరిపాలించిన మొఘల్ రాజవంశ వారసురాలు.. మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి ముని మనవడు మీర్జా మహ్మద్ బేదర్ భక్త్ భార్య సుల్తానా బేగమ్ పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. ఫించన్ డబ్బులతో జీవనం సాగిస్తోంది. ఆ ఫించన్ డబ్బులు సరిపోక మురికివాడల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఈ నేపథ్యంలోనే ఆమె తమ వారసత్వ సంపద అయిన ఢిల్లీలోని ఎర్ర కోట కోసం కోర్టు మెట్లు ఎక్కింది. గత కొన్నేళ్ళ నుంచి ఎర్రకోటను తమకు అప్పగించాలని కోరుతూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది.


2021లో ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. సుల్తానా బేగమ్ భర్త మీర్జా మహ్మద్ బేదర్ భక్త్ మొగల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ 2 వారసుడని ప్రభుత్వమే గుర్తించింది. 1960లో మొగల్ వారసుడిగా గుర్తించిన నాటి నుంచి ప్రభుత్వం అతడికి ఫించన్ ఇస్తూ వచ్చింది. అతడు చనిపోయిన తర్వాత 1980లో ఆ ఫించన్ సుల్తానా బేగమ్‌కు బదిలీ అయింది. అయితే, ఈ ఫించన్ డబ్బులు తన జీవనానికి సరిపోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేసింది.


ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత కోర్టుకు రావటాన్ని కోర్టు తప్పుబట్టింది. అయితే, సుల్తానా మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. ఈ సారి ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా, సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది. పిటిషన్‌ను అర్థం లేనిదిగా భావిస్తూ కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్న మాట్లాడుతూ.. ‘ ఎర్రకోట మాత్రమే ఎందుకు.. ఫతేఫుర్ సిఖ్రీ, తాజ్ మహాల్‌లు కావాలని అడగొచ్చు కదా.. దీనిపై మీరు వాదించాలని అనుకుంటున్నారా.. ఇదో చెత్త పిటిషన్’ అంటూ మండిపడ్డారు. సుల్తానా బేగమ్ వేసిన పిటిషన్‌ను కొట్టి పారేశారు.


ఇవి కూడా చదవండి

Hyderabad Woman: మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి

Terrorists Hideout: తప్పిన పెను ప్రమాదం.. ఉగ్ర స్థావరంలో భారీగా బయటపడ్డ ఐఈడీలు

Updated Date - May 05 , 2025 | 01:31 PM