Nirmala Sitharaman: పన్ను తగ్గింపు ఫలాలు ప్రజలకు అందుతాయి
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:25 AM
జీఎస్టీ సంస్కరణలు, పన్ను రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సాధారణ ప్రజలకు పూర్తిస్థాయిలో కచ్చితంగా అందుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపడతామని చెప్పారు..
ఈ నెల 22 తర్వాత మాకు చాలా పనుంది
పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగుతుంది
ప్రయోజనాలను ప్రజలకు చేరుస్తామని కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి
అలా చేయని వాటితో మాట్లాడి తేలుస్తాం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జీఎస్టీ సంస్కరణలు, పన్ను రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సాధారణ ప్రజలకు పూర్తిస్థాయిలో కచ్చితంగా అందుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపడతామని చెప్పారు. సంస్కరణలు అమల్లోకి వచ్చే ఈ నెల 22వ తేదీ తర్వాత ప్రభుత్వానికి చాలా పని ఉందని, అదో పకడ్బందీ నిఘా కార్యక్రమమని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల అమల్లో సహకరిస్తామని, ప్రయోజనాలను ప్రజలకు అందిస్తామని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ హామీ ఇచ్చాయని.. ఒకవేళ ఏదైనా కంపెనీ భిన్నంగా వ్యవహరిస్తే వారితో మాట్లాడి తేలుస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ‘‘దేశంలో సాధారణ, మధ్య తరగతి వారి కనీస అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునే జీఎస్టీ సంస్కరణలు తెచ్చాం. ప్రస్తుతం 90 శాతానికిపైగా వస్తువులు 5శాతం పన్నుపరిధిలోకి వచ్చాయి. ఒకశాతం వస్తుసేవలపై మాత్రమే 40ు పన్ను ఉంది’’ అని చెప్పారు. పన్ను తగ్గింపు ఫలాలు సాధారణ ప్రజలకు కచ్చితంగా చేరుతాయన్న విశ్వాసంతో ఉన్నామని, ఇందుకోసం కొన్ని నెలలు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ధరల తగ్గింపును క్షేత్రస్థాయిలో ఎంపీలు పర్యవేక్షిస్తార న్నారు. పన్ను తగ్గింపుతో కేంద్ర, రాష్ట్రాలకు ప్రస్తుతం ఆదాయం తగ్గుతుందని.. అయితే వినియోగం పెరగడం వల్ల తిరి గి ఆదాయం పెరుగుతుందని చెప్పారు.