India's Iron Age: ఇనుప యుగం తమిళనేలపైనే ఆరంభం!
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:46 AM
పురాతన నాగరికతకు నిలయమైన భారతదేశంలో ఇనుప యుగం.. శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే రెండు వేల ఏళ్ల ముందే ప్రారంభమైందా..? క్రీస్తుపూర్వం 3,345 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుప లోహాన్ని వినియోగించారా...?
5,300 ఏళ్ల కిత్రమే ఇనుప వస్తువుల వినియోగం
శివకళై తవ్వకాల్లో బయల్పడిన ఇనుప పనిముట్లు
పరిశోధనల్లో క్రీ.పూ.3,345 ఏళ్ల నాటివిగా గుర్తింపు
పురావస్తు పరిశోధనల్లో సరికొత్త మలుపు
చెన్నై, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పురాతన నాగరికతకు నిలయమైన భారతదేశంలో ఇనుప యుగం.. శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే రెండు వేల ఏళ్ల ముందే ప్రారంభమైందా..? క్రీస్తుపూర్వం 3,345 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుప లోహాన్ని వినియోగించారా...? ప్రపంచంలోనే ఇనుప యుగం తమిళనేలపైనే ఆరంభమైందా..? అంటే తాజా అధ్యయనాలు అవుననే చెబుతున్నాయి. తమిళనాట 5,300 సంవత్సరాల క్రితమే ఇనుపయుగం ఆరంభమైనట్లు పురావస్తు శాఖ జరిపిన అధ్యయనంలో తేలింది. తమిళనాడులోని మాంగాడు (సేలం), కీళ్‌నమండి (తిరువణ్ణామలై), మయిలాండుంపారై (కృష్ణగిరి), ఆదిచ్చనల్లూరు, శివకళై (తూత్తుకుడి) తదితర ప్రాంతాల్లోని శ్మశానవాటికల్లో జరిపిన తవ్వకాల్లో పలు ఇనుప వస్తువులు లభించాయి. వీటిలో శివకళై వద్ద లభించిన ఇనుప ఆయుధం 5,300 సంవత్సరాల నాటిదని భారత్‌తోపాటు అమెరికాలో జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయింది.

శివకళై వద్ద సుమారు 2,000 ఎకరాల స్థలంలో ఇనుప వ్యర్థాలు పరచుకుని ఉండటాన్ని ఆ ప్రాంతానికి చెందిన మాణిక్యం అనే ఉపాధ్యాయుడు గమనించి అక్కడ పురావస్తు తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు తమిళనాడు ప్రభుత్వం 2020లో తవ్వకాలు ప్రారంభించింది. ఆ తవ్వకాల్లో మట్టి కుండలు, ధాన్యపు గింజలు, మనిషి దవడ ఎముకలు, దంతాలు, బూడిద బయల్పడ్డాయి. ఆ తర్వాతి ఏడాది జరిపిన తవ్వకాల్లో ఇనుముతో తయారైన కత్తులు, బాణపు కొసలు, ఉంగరాలు, కొడవళ్లు సహా 85కు పైగా ఇనుప పనిముట్లు లభించాయి. వాటిని పరీక్షించగా క్రీ.పూ. 3,345 ఏళ్ల నాటివని స్పష్టమైంది. దీంతో ఆ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర పురావస్తు పరిశోధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ‘ఇనుము ప్రాచీనత’ (యాంటిక్విటీ ఆఫ్ ఐరన్) అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. సుమారు 5,300 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుముతో చేసిన వస్తువులను వినియోగించినట్టు శాస్త్రీయంగా నిరూపితమైందని అన్నారు. శివకళై వద్ద జరిపిన తవ్వకాలలో తమిళ లిపి అక్షరాలు కలిగిన మట్టి కుండ క్రీ.పూ. 685 ఏళ్లనాటిదని నిర్ధారణ అయిందని, అక్కడ లభించిన మూడు ఇనుప పరికరాలు క్రీ.పూ 2953, క్రీ.పూ 3256, క్రీ.పూ 3345 ఏళ్ల నాటివని పేర్కొన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా తొలుత తమిళనాడులోనే ఇనుప యుగం ప్రారంభమైందని ఎలుగెత్తి చాటుతున్నామని చెప్పారు.
చరిత్ర ఏం చెబుతుందంటే..!
చారిత్రక ఆధారాల ప్రకారం ప్రపంచంలో ఇనుప యుగం క్రీ.పూ.1300లో మొదలైందని కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌లో క్రీ.పూ. 1,500-200 మధ్యలో ఇనుప యుగం కొనసాగింది అనేది చరిత్రకారుల వాదన. అయితే ఇప్పుడు తమిళనాడులో బయటపడిన ఇనుప వస్తువలను పరీక్షంచగా అవి క్రీ.పూ. 3345-3259 సంవత్సరాల నాటివని తేలింది. అంటే ఈ ప్రాంతంలో వాడిన ఇనుప వస్తువులు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవని భావించాలి.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News