Share News

Tamil Nadu: ఇంకెన్నాళ్లీ అరాచకం.. స్కూల్లోనే ఇంత దారుణమా

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:48 PM

తోటి విద్యార్థులంతా క్లాస్ రూమ్‌లో కూర్చుని పరీక్ష రాస్తుంటే.. ఆ విద్యార్థిని మాత్రం.. క్లాస్ బయట కూర్చుని ఎగ్జామ్ రాస్తుంది. మరి ఇంతకు ఆ స్టూడెంట్ చేసిన నేరం ఏంటి.. అసలెందుకు తనను అలా బయట కూర్చోబెట్టారు అనే వివరాలు మీ కోసం..

Tamil Nadu: ఇంకెన్నాళ్లీ అరాచకం.. స్కూల్లోనే ఇంత దారుణమా
Tamil Nadu

చెన్నై: తినడం , నిద్ర పోవడం, స్నానం చేయడం.. ఇవన్ని మనిషి రోజువారీ జీవితంలో చోటు చేసుకునే నిత్యకృత్యాలు. అలానే మహిళల విషయానికి వస్తే.. రుతుస్రావం, పీరియడ్స్ అన్నది కూడా పైన చెప్పిన అలవాట్ల మాదిరే అత్యంత సాధారణ విషయం. రుతస్రావ ప్రక్రియ వల్లే.. ఆడపిల్ల అమ్మగా మారి.. మరో జీవికి జన్మనివ్వగలుగుతుంది. కానీ మన సమాజంలో మాత్రం అలాంటి ప్రక్రియను ఏదో పాపంలా చూస్తారు. నేటికి కూడా పీరియడ్స్ గురించి బహిరంగంగా చర్చించాలంటే చాలా మంది ఇబ్బంది పడతారు. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో పీరియడ్స్ సమయంలో వారిని ఇంటికి దూరంగా ఉంచుతారు. అంటరాని వారిగా చూస్తారు. సరే చదువులేని వారు.. గ్రామాల్లో అలా చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు.

కానీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే బడిలో కూడా పీరియడ్స్‌ని పాపంగా చూడటం.. విద్యార్థినిలను ఇబ్బంది పెడుతున్నారంటే.. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇలాంటి అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పీరియడ్స్ వచ్చిన విద్యార్థినిని క్లాస్ రూమ్ బయట కూర్చోపెట్టి పరీక్ష రాయించింది ఓ స్కూల్ యాజమాన్యం. ఆ వివరాలు..


ఈ అమానుష సంఘటన తమిళనాడు, కోయంబత్తురులోని సెంగుట్టై ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి స్కూల్‌కి వచ్చాక పీరియడ్స్ వచ్చాయి. దాని గురించి ప్రిన్సిపాల్‌కి చెప్పింది. విషయం తెలుసుకుని స్టూడెంట్‌కి మద్దతుగా ఉండాల్సిన ప్రిన్సిపాల్ కాస్త.. అమానుషంగా వ్యవహరించింది. పీరియడ్స్ రావడం మహా పాపం అన్నట్లుగా భావించి.. విద్యార్థినిని క్లాస్ రూమ్ బయట కూర్చొబెట్టింది. అక్కడే కూర్చోని పరీక్ష రాయాల్సిందిగా ఆదేశించింది.


క్లాస్ పిల్లలందరి ముందు ప్రిన్సిపాల్ ఇలా చేయడంతో ఆ విద్యార్థిని తీవ్రంగా మనస్థాపం చెందింది. బాధపుడుతూనే క్లాస్ రూమ్ బయటకు వెళ్లి కూర్చొని.. అక్కడే పరీక్ష రాసింది. ఇంతలో విద్యార్థిని తల్లి స్కూల్‌కి వచ్చింది. కుమార్తె క్లాస్ బయట ఉండటం చూసి.. ఏమైందని ప్రశ్నించింది. అప్పుడా విద్యార్థిని.. జరిగిన దాని గురించి తన తల్లికి చెప్పింది. తన బిడ్డ పట్ల ఇంత అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ తల్లి. స్కూల్లో ఇంత అరాచకంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించింది.


ఇక ఈ ఏడది, జనవరిలో ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా సంఘటననే వెలుగు చూసింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని.. పరీక్షకు వెళ్ళేముందు.. తనకు పీరియడ్స్ వచ్చాయని.. సానిటరీ ప్యాడ్ ఇవ్వాల్సిందిగా స్కూల్ ప్రిన్సిపాల్‌ని అడిగింది. ఓ గంట తర్వాత వారు వచ్చి.. సదరు విద్యార్థినిని ఇంటికి వెళ్లిపోమని చెప్పారు. ఇక విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. దీనిపై మహిళా సంక్షేమ శాఖ, రాష్ట్ర మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాడు. పీరియడ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన స్కూల్‌లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవం దారుణ అంటున్నారు వీటి గురించి తెలిసిన జనాలు.

ఇవి కూడా చదవండి:

ఒక్క టమాటా ధర రూ.1300.. ఎలా పెంచారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఈ చిట్కాలతో.. ఒక్క పూటలోనే నోటి పూత సమస్య పరార్..

Updated Date - Apr 10 , 2025 | 01:54 PM