Dinosaur Era Fossils Uncovered : చెరువులో తవ్వుతుండగా కళ్లు జిగేల్.. బయటపడ్డ డైనోసార్ శిలాజాలు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 08:36 PM
Dinosaur Era Fossils Uncovered : మేఘ గ్రామంలో రైతులు చెరువులో మట్టి కోసం తవ్వుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ భారీ జంతువుకు సంబంధించిన శిలాజం బయటపడింది. దీంతో ఓ రైతు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
రాజస్తాన్‌లో మిలియన్ ఏళ్ల నాటి చరిత్ర బయటపడింది. చెరువు తవ్వుతుండగా డైనోసార్ శిలాజాలు వెలుగుచూశాయి. బుధవారం జైసల్మీర్ జిల్లాలోని మేఘ గ్రామంలో రైతులు చెరువులో మట్టి కోసం తవ్వుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ భారీ జంతువుకు సంబంధించిన శిలాజం బయటపడింది. దీంతో ఓ రైతు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆ శిలాజం డైనోసార్‌కు చెందినదిగా భావిస్తున్నారు. అయితే, సైంటిఫిక్ టెస్టులో అది డైనోసార్ శిలజమా కాదా అని తెలిసే వరకు ధ్రువీకరణకు రాలేమని అన్నారు. జియోలజిస్ట్ నారాయన్ దాస్ ఇఖియా మాట్లాడుతూ.. ‘ఇవి డైనోసార్ శిలాజాలు అయ్యే అవకాశం ఉంది. అవి మీడియం సైజ్ డైనోసార్‌కు చెందినవిగా అనిపిస్తున్నాయి. అవి రెక్కలకు సంబంధించిన శిలాజాలు కావచ్చు. దానిపై పరిశోధన జరిగే వరకు ఏ విషయం లేల్చి చెప్పలేము.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వస్తే.. దాని వయసు, చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. ఇక, ఈ శిలాజాన్ని బయటి ప్రపంచానికి చూపెట్టిన రైతు శ్యామ్ సింగ్ మాట్లాడుతూ.. ‘చెరువులో మేము ఎముకలు, రాళ్లతో కూడిన రూపాన్ని చూశాం. అవి పురాతనమైనవని నాకు అనిపించింది. వెంటనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులను సంప్రదించాను. ఇక్కడ కనపడ్డ దాని గురించి చెప్పాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
జైల్లో పరిచయం.. విడుదలైన నెల రోజులకే పెళ్లి ఇంట్లో కన్నం..
తాబేళ్ల రౌండ్ టేబుల్ సమావేశం.. ఈ వీడియోను కోటి మందికి పైగా ఎందుకు వీక్షించారంటే..