Supreme Court Withdraws Orders: వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:46 AM
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని క్రిమినల్ కేసుల విచారణ చేపట్టకుండా నిషేధించాలని ఇచ్చిన
అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాల ఉపసంహరణ
తీర్పు నుంచి సంబంధిత రెండు పేరాల తొలగింపు
సీజేఐ విజ్ఞప్తి మేరకేనన్న సుప్రీం జడ్జి జస్టిస్ పార్దీవాలా
కేసును పునర్విచారించాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 8: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని క్రిమినల్ కేసుల విచారణ చేపట్టకుండా నిషేధించాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత తీర్పులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మీద చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 4న వివాదాస్పద తీర్పును వెలువరించింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ను పదవీ విరమణ చేసే వరకు ఎలాంటి క్రిమినల్ కేసులు విచారించకుండా చూడాలని ఆదేశించింది. ఒక సివిల్ వ్యవహారంలో క్రిమినల్ చర్యలు చేపట్టాలని కింద కోర్టు తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ నిరాకరించారు. సివిల్ కేసుగా చేపడితే బాధితుడికి ఎప్పటికీ న్యాయం జరగదని తీర్పులో అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో అప్పీలుకు రాగా జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తీవ్ర నిర్ణయాన్ని ప్రకటించింది. దాన్ని పునస్సమీక్షించాలని స్వయంగా ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేయడంతో జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తన తీర్పులోని వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించడంతో పాటు మిగతా తీర్పు అమలు కూడా పక్కనబెట్టింది. కేసును తాజాగా మళ్లీ విచారించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిపాలన అధికారాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని చెప్పింది. జడ్జిలకు విధులు కేటాయించే అధికా రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిదేనని అంగీకరించింది. కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ బన్సాలీని కోరింది. ఈ నెల 4న ఇచ్చిన తీర్పులో జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ తీర్పును అత్యంత చెత్త, తప్పుడు తీర్పుల్లో ఒకటిగా అభివర్ణించింది. తాజాగా ఆ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, ఎవరినీ ఇబ్బంది పెట్టే, జడ్జికి ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించే ఉద్దేశం తనకు లేదని పేర్కొంది. గొప్ప తీర్పులు వచ్చినపుడు హైకోర్టు జడ్జిలను కొనియాడుతున్నామని గుర్తు చేసింది. హైకోర్టులు స్వతంత్ర వ్యవస్థలు కావని, భారత న్యాయ వ్యవస్థకు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం కుదరదని చెప్పింది. న్యాయవ్యవస్థ తలెత్తుకొనే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాము తీర్పులో వ్యాఖ్యలు చేశామని తెలిపింది. హైకోర్టు తీర్పులోని వ్యవహారం న్యాయప్రక్రియలో జరిగిన పొరపాటు కాదని, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, విశ్వసనీయతను ప్రభావితం చేసిదిగా ఉందని పేర్కొంది. వాటిని కాపాడేందుకే తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.
ముగిసిన వివాదం
ఆగస్టు 4 తీర్పులోని 25, 26 పేరాలను సుప్రీంకోర్టు తొలగించింది. జస్టిస్ కుమార్‌కు పదవీ విరమణ వరకు క్రిమినల్ కేసులు వినే అవకా శం ఇవ్వరాదని, ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తి పక్కన రెండో న్యాయమూర్తిగా ఆయన్ను కూర్చోబెట్టాలని ఇచ్చిన రెండు ఆదేశాలను రద్దు చేసింది. న్యాయస్థానాల్లోనే చట్టబద్ధ పాలన లేకుంటే న్యాయాన్ని అందించే వ్యవస్థ అంతరించినట్లేనని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు సమర్థంగా పనిచేస్తారని, విధులను శ్రద్ధగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ కేసును ముగించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యంతో న్యాయవ్యవస్థ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయట పడింది. హైకోర్టు జడ్జిని విధుల నుంచి తప్పించడమంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విధుల్లో జోక్యం చేసుకోవడమేనంటూ అలహాబాద్ హైకోర్టు నుంచి 13 మంది జడ్జిలు సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తికి లేఖ రాశారు. జస్టిస్ పార్దీవాలా తీర్పును పక్కనబెట్టాలని కోరారు. కాగా, సుప్రీం తాజా ఆదేశాల పట్ల అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. సుప్రీం తీర్పులో తన తప్పు దిద్దుకోవడం గొప్ప విషయమని అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ కొనియాడారు. హైకోర్టులు సుప్రీంకోర్టుకు కింది స్థాయి వ్యవస్థలు కాదు, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు అన్నారు.