Supreme Court to Review Street Dog: సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఢిల్లీ వీధి కుక్కల కేసు
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:08 AM
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది..
నేడు విచారణ జరపనున్న బెంచ్
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది. ఆ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజరియాల ధర్మాసనం గురువారం దీన్ని విచారించనుంది. ఢిల్లీలోని వీధి కుక్కల బెడదపై సుమోటో కేసు తీసుకున్న జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ద్విసభ్య బెంచ్.. వీధి కుక్కలను షెల్లర్లకు తరలించాలంటూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు విషయం బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ ముందర రెండు సార్లు ప్రస్తావనకు కూడా వచ్చింది. వీధి కుక్కల సమస్యపై వచ్చిన అన్ని పిటిషన్లను గతేడాది మేలోనే జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత హైకోర్టులకు బదిలీ చేసిందని ఓ న్యాయవాది తెలిపారు. తాజా ఉత్తర్వులు అందుకు విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అప్‌లోడ్ చేయకముందే వీధి కుక్కలను తరలించడం ప్రారంభించారని మరో న్యాయవాది చెప్పారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘ఆ విషయాన్ని పరిశీలిస్తాను’ అని పేర్కొన్నారు. అనంతరం ఆ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు.