Supreme Court: పరిహారం ఇవ్వడంలో ఆలస్యమైతే.. మార్కెట్ రేటు చెల్లించాల్సిందే
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:01 AM
ఎప్పుడో 2003లో సేకరించిన భూమికి.. 2011నాటి ధరల ప్రకారం రేటు నిర్ధారించి.. ఆ సొమ్మును 2019లో చెల్లిస్తామంటే కుదరదని సుప్రీంకోర్టు తెల్చిచెప్పింది!

పాత ధరల ప్రకారమే పరిహారం అంటే
‘300ఏ’ అధికరణను ఉల్లంఘించినట్టే
భూసేకరణ ప్రక్రియలో వ్యవధే కీలకం: సుప్రీం
న్యూఢిల్లీ, జనవరి 3: ఎప్పుడో 2003లో సేకరించిన భూమికి.. 2011నాటి ధరల ప్రకారం రేటు నిర్ధారించి.. ఆ సొమ్మును 2019లో చెల్లిస్తామంటే కుదరదని సుప్రీంకోర్టు తెల్చిచెప్పింది! అధికారుల కారణంగా పరిహారం చెల్లింపులు ఆలస్యమైతే.. ఆ పరిహారం చెల్లించేనాటికి సదరు భూములకు మార్కెట్ రేటు ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందేనని, అలా మార్కెట్ ధరను పొందే హక్కు భూయజమానులకు ఉంటుందని స్పష్టం చేసింది. బెంగళూరు-మైసూరు మౌలిక వసతుల నడవా ప్రాజెక్టు (బీఎంఐసీపీ) కోసం 22 ఏళ్ల క్రితం భూములు సేకరించినా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ కీలక తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చేపట్టిన భూసేకరణలో భూములను కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందనిరైతులు, సామాన్యపౌరులకు ఉపశమనం ఇచ్చే తీర్పు ఇది. బీఎంఐసీపీ కోసం కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు (కేఐఏడీబీ) 2003లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. కేఐఏడీ చట్టం ప్రకారం 2005 నవంబరులో భూసేకరణ చేపట్టింది. సేకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా భూయజమానులకు పరిహారం చెల్లించలేదు. పదహారేళ్ల తర్వాత ఎట్టకేలకు 2019లో పరిహారం ఇచ్చారు. కానీ.. 2011 నాటి మార్కెట్ రేట్లు ఇచ్చారు! దీంతో భూయజమానులంతా బెర్నార్డ్ ఫ్రాన్సిస్ జోసెఫ్ అనే వ్యక్తి నేతృత్వంలో కోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో తీవ్రంగా స్పందించిన ధర్మాసనం...‘‘వారు 22 ఏళ్లుగా పలుమార్లు కోర్టు తలుపులు తడుతూనే ఉన్నారు. వారివైపు నుంచి ఎలాంటి అలసత్వం లేదు. రాష్ట్ర ప్రభుత్వ/కేఐఏడీబీ అధికారుల సోమరితనం కారణంగానే ఇంత ఆలస్యమయింది. అదీ కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చాకనే అధికారులు స్పందించారు. 2019 ఏప్రిల్ 22న.. భూమికి ఇవ్వాల్సిన మార్కెట్ ధరను ప్రత్యేక భూసేకరణ అధికారులు నిర్ణయించారు. కాబట్టి అప్పటి మార్కెట్ రేటు ప్రకారమే ఇప్పుడు పరిహారం చెల్లించాలి’’ అని ఆదేశించింది. ఒకవేళ 2003 నాటి ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తే అది న్యాయాన్ని, ఆస్తి హక్కు రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 300ఏ అధికరణాన్ని అపహాస్యం చేసినట్టవుతుందని వ్యాఖ్యానించింది. 2019 ఏప్రిల్ 22 నాటి మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని, మొత్తం నష్టపరిహారాన్ని లెక్కించాలని సూచించింది. 2నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భూ సేకరణ అధికారిని ఆదేశించింది. ఈ నిర్ణయం నచ్చకపోతే సవాలు చేసే హక్కు ఇరు పార్టీలకూ ఉందని పేర్కొంది.