Supreme Court: ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమీ కాదు
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:04 AM
ఎంఐఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తిరుపతి నరసింహ మురారి అనే వ్యక్తి తరఫున దాఖలైన...
వేదాలు, ఉపనిషత్తుల బోధనకూ అభ్యంతరం అవసరం లేదు
రాజకీయ పార్టీలు విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం
మైనారిటీలకు రాజ్యాంగ రక్షణలు
మతచిచ్చు, కులచిచ్చు.. రెండూ ప్రమాదకరమైనవే: సుప్రీంకోర్టు
ఎంఐఎం గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
ఎంఐఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తిరుపతి నరసింహ మురారి అనే వ్యక్తి తరఫున దాఖలైన ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున విష్ణుశంకర్‌జైన్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎంఐఎం పార్టీ ముస్లింలలో ఇస్లామిక్ విద్యను పెంపొందిస్తామని, షరియా చట్టం పట్ల అవగాహన పెంచుతామని చెబుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘దీంట్లో తప్పేముంది? ఇస్లామిక్ విద్యను బోధించటం తప్పేమీకాదు. మరిన్ని రాజకీయపార్టీలు ఇలా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తే మేం స్వాగతిస్తాం’ అని వ్యాఖ్యానించింది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను నేర్పించటానికి హిందూ పేరుతో తాను ఒక రాజకీయపార్టీ పెడతానంటే ఎన్నికల సంఘం అంగీకరించదని, ఇది వివక్షేనని అన్నా రు. దీనికి ధర్మాసనం బదులిస్తూ.. ‘వేదాలు, ఉపనిషత్తులు బోధించటానికి ఈసీ అభ్యంతరం చెబితే సంబధిత వేదికలపై ఫిర్యాదు చేయండి. చట్టం తప్పకుం డా తగిన చర్యలు తీసుకుంటుంది’ అని స్పష్టం చేసిం ది. ఒక మతపరమైన చట్టానికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తున్నప్పుడు..
ఆ మతపరమైన చట్టాన్ని తా ము బోధిస్తామని ఏదైనా రాజకీయపార్టీ చెబితే అం దులో అభ్యంతరాలు ఉండక్కర్లేదని తెలిపింది. ఇక, దేశంలోని మైనారిటీల హక్కులకు రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించిందని, ఆ రక్షణల అమలు కోసం పని చేస్తామని ఎంఐఎం రాజ్యాంగం స్పష్టం చేస్తోందని పేర్కొంది. సమాజం శ్రేయస్సు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. సమాజంలో మతపరమైన చిచ్చు రేపే పనులు చేసే పార్టీలు, అభ్యర్థులు ఉండే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. కొన్ని పార్టీలు కులంపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నాయని, ఇది సమాజానికి ప్రమాదకరమని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి