Share News

Supreme Court Questions: ట్రాఫిక్‌ జాంలో చిక్కుకుంటే టోల్‌ ఎందుకు కట్టాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:50 AM

ప్రయాణికులు ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకొని అవస్థలు పడిన సందర్భాల్లో టోల్‌ రుసుము ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు సోమవారం భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ...

Supreme Court Questions: ట్రాఫిక్‌ జాంలో చిక్కుకుంటే టోల్‌ ఎందుకు కట్టాలి

  • ఎన్‌హెచ్‌ఏఐకి సుప్రీంకోర్టు ప్రశ్న.. టోల్‌ వసూలును సమర్థించలేమని వ్యాఖ్య

  • అంతకుముందు ఆ హైవేపై నెల పాటు టోల్‌ వసూలు చేయద్దన్న కేరళ హైకోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ప్రయాణికులు ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకొని అవస్థలు పడిన సందర్భాల్లో టోల్‌ రుసుము ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు సోమవారం భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ని ప్రశ్నించింది. 65 కి.మీ. దూరం ప్రయాణానికి 12 గంటల సమయం తీసుకున్న సందర్భాల్లోనూ టోల్‌ రుసుము కింద రూ.150 చెల్లించాలా అని అడిగింది.


రోడ్డు సరిగ్గా లేకపోవడంతో కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా పలియెక్కర ట్లోల్‌ ప్లాజా వద్ద నాలుగు వారాల పాటు రుసుము వసూలు చేయకూడదని ఈ నెల 6న కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రోడ్డు పనులు జరుగుతుండడంతో 554 నెంబరు జాతీయ రహదారిలో ఎడపల్లి- మన్నుతి మధ్య ప్రయాణం దారుణంగా మారింది. అందువల్ల నెల రోజుల పాటు టోల్‌ రుసుము వసూలును సస్పెండ్‌ చేస్తున్నట్టు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలయిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. గంట ప్రయాణానికి అదనంగా 11 గంటలు తీసుకుంటే టోల్‌ రుసుము ఎందుకు చెల్లించాలని జస్టిస్‌ గవాయ్‌ ప్రశ్నించారు.


ఎన్‌హెచ్‌ఏఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ లారీ ప్రమాదానికి గురయిన కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని, ఆ ప్రమాదం దైవఘటన అని చెప్పారు. ఇందుకు జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ అంగీకరించలేదు. ఆ ప్రమాదం దైవఘటన కాదని, రోడ్డుపై ఉన్న గుంతలో లారీ దిగబడడం వల్లనే ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని గుర్తు చేశారు. 11గంటల ట్రాఫిక్‌ జామ్‌లో కూడా టోల్‌ వసూలు ఏ రకంగానూ సమర్థించలేమన్నారు. తీర్పును వాయిదా వేశారు.


ఇవీ చదవండి:

రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే

భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం

Read Latest and Business News

Updated Date - Aug 19 , 2025 | 07:48 AM