Share News

Justice Yashwant Varma: అంతర్గత కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమా

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:14 AM

తన అధికారిక నివాసంలో కట్టలు కట్టలుగా డబ్బు దొరికిన వ్యవహారంలో పార్లమెంటు అభిశంసనను ఎదుర్కోబోతున్న అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌..

Justice Yashwant Varma: అంతర్గత కమిటీ  ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమా

  • అలాగైతే దాని ముందు ఎందుకు హాజరయ్యారు?

  • విచారణ పూర్తయ్యేదాకా ఎందుకు వేచి చూశారు?

  • జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను నిలదీసిన సుప్రీంకోర్టు

  • పిటిషన్‌లో తన పేరు దాచి ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌’గా పేర్కొన్న వర్మ

న్యూఢిల్లీ, జూలై 28: తన అధికారిక నివాసంలో కట్టలు కట్టలుగా డబ్బు దొరికిన వ్యవహారంలో పార్లమెంటు అభిశంసనను ఎదుర్కోబోతున్న అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. నాడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ వర్మ ఇంట్లో (ఢిల్లీలో) ఈ ఏడాది మార్చి 14వ తేదీ సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. మంటలార్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి కట్టలకొద్దీ డబ్బు దొరికింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ అంశంపై విచారణకు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. పంజాబ్‌-హరియాణా హైకోర్టు, హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ శీల్‌ నాగు, జస్టిస్‌ జీఎస్‌ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌తో (మార్చి 22న) అంతర్గత కమిటీని నియమించడం రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు దాని ముందు విచారణకు ఆయన ఎందుకు హాజరయ్యారని కోర్టు ఆయన్ను నిలదీసింది. ఆ కమిటీని వేసినప్పుడే దాని చట్టబద్ధతను ఎందుకు సవాల్‌ చేయలేదని ప్రశ్నించింది. విచారణ పూర్తయ్యేదాకా ఎందుకు ఎదురుచూశారని అడిగింది. ఆ డబ్బు ఎవరిదో కమిటీ కనుగొంటుందన్న ఉద్దేశంతోనే దాని ముందు ఆయన హాజరయ్యారని జస్టిస్‌ వర్మ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. డబ్బు వ్యవహారంలో జస్టిస్‌ వర్మను అంతర్గత కమిటీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మే 4వ తేదీన తన నివేదికను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు సమర్పించింది. దరిమిలా పదవికి రాజీనామా చేయాలని.. లేదంటే తప్పనిసరి స్వచ్ఛంద పదవీవిరమణ చేయాలని జస్టిస్‌ వర్మకు సీజేఐ సూచించారు. తానే తప్పూ చేయలేదంటూ ఆయన అందుకు నిరాకరించడంతో కమిటీ నివేదికను రాష్ట్రపతి, ప్రధానమంత్రికి సీజేఐ పంపించారు. దీనిపై కేంద్రం జస్టిస్‌ వర్మను పార్లమెంటు ఉభయసభల్లో అభిశంసన తీర్మానం ద్వారా తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుత సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో అంతర్గత కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, న్యాయమూర్తిగా తనను తొలగించాల్సిందిగా సీజేఐ సిఫారసు చేయడాన్ని కూడా రాజ్యాంగవిరుద్ధం, ఆయన అధికార పరిధికి మించినదిగా ప్రకటించాలని కోరుతూ జస్టిస్‌ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఏజీ మసీ్‌హతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఎలాంటి ఫిర్యాదూ లేకుండానే జస్టిస్‌ వర్మపై అంతర్గత విచారణ ప్రారంభించారని సిబల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.


అలాగే ఆయనపై ఆరోపణలను పత్రికా ప్రకటన ద్వారా బహిరంగ పరచడంతో అసాధారణ మీడియా ట్రయల్‌ జరిగిందని తెలిపారు. ‘ఆ డబ్బు ఎవరిదో, ఎంత దొరికిందో తన నివేదికలో కమిటీ స్పష్టం చేయలేదు. తగు గడువివ్వకుండానే రాజీనామానో, స్వచ్ఛంద పదవీవిరమణో చేయాలని.. లేదంటో తొలగింపు ప్రక్రియ మొదలుపెడతామని సీజేఐ హెచ్చరించారు’ అని పేర్కొన్నారు. అయితే ఆయన పిటిషన్‌లో మూడు లోపాలను ధర్మాసనం ప్రస్తావించింది. ‘పిటిషన్‌ ఇలా దాఖలుచేసి ఉండాల్సింది కాదు.సెక్రటరీ జనరల్‌ కాకుండా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను కక్షిదారుగా చేర్చారు. మొదటి కక్షిదారుగా సుప్రీంకోర్టు. మీ వంటి సీనియర్‌ న్యాయవాది నుంచి మేం ఇది ఆశించలేదు. అంతర్గత కమిటీ రిపోర్టును పిటిషన్‌తో జతచేయలేదు. దానిపై మీరు వాదనలు వినిపించాలనుకుంటే అది కచ్చితంగా ఉండాల్సిందే’ అని స్పష్టంచేసింది. నివేదికను జతచేస్తామని సిబల్‌ తెలిపారు. జస్టిస్‌ వర్మకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రక్రియ ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధమో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఈ సందర్భంగా సూచించింది. వ్యవస్థీకృత చట్టప్రక్రియ ద్వారా తప్ప మరే విధంగానూ న్యాయమూర్తి ప్రవర్తనపై విచారణ జరడానికి వీల్లేదని ఆయన బదులిచ్చారు.

అనుకూల ఆదేశాల కోసమే వెళ్లారా?

అంతర్గత కమిటీ విచారణ జరపడానికి వీల్లేదని రాజ్యాంగ ధర్మాసనం చెబుతోందా అని కోర్టు అడిగింది. తనకు అనుకూలమైన ఆదేశాలు వస్తాయనే ఉద్దేశంతోనే జస్టిస్‌ వర్మ విచారణకు హాజరైనట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. కమిటీ నివేదిక అభిశంసన తీర్మానానికి ఆధారం కారాదని సిబల్‌ అన్నారు. అభిశంసనకు ఆదే ఆధారమని ఎవరు చెప్పారని జస్టిస్‌ దత్తా ప్రశ్నించారు. సీజేఐ లేఖను సిబల్‌ ప్రస్తావించారు. ‘లేఖలు పంపడం అంటే పార్లమెంటే అభిశంసించాలని చెప్పడం ఎలా అవుతుంది’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వాదనలను నిర్దిష్ట పాయింట్లతో ఒక్క పేజీలో సమర్పించాలని.. కక్షిదారుల మెమోను కూడా సవరించుకుని రావాలని ఆదేశించింది.

ట్రిపుల్‌ ఎక్స్‌ వర్సెస్‌ కేంద్రం

జస్టిస్‌ వర్మ తన పిటిషన్‌లో తన పేరును పొందుపరచలేదు. ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌ వర్సెస్‌ కేంద్రప్రభుత్వం’గా పేర్కొన్నారు. పిటిషన్‌లో ఇలా గుర్తింపు దాచుకోవడం అసాధారణమేమీ కాదు. సాధారణంగా అత్యాచార, లైంగిక వేధింపుల బాధితులు, మైనర్లు, జువెనైల్స్‌ తమ గుర్తింపు బహిర్గతం కాకుండా ‘ట్రిపుల్‌ ఎక్స్‌’ అని పేర్కొంటుంటారు. ఇక్కడ జస్టిస్‌ వర్మ తన గుర్తింపును దాచిపెట్టడం గమనార్హం.

Updated Date - Jul 29 , 2025 | 04:14 AM