Supreme Court: రెండు వారాల్లోగా 18 కోట్లు కట్టండి
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:17 AM
గత వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది...
జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టు షాక్
‘ప్రతిమ’, జీసీకేసీని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశం
వైసీపీ హయాం ఇసుక అక్రమ తవ్వకాల కేసును విచారించిన బెంచ్
అక్రమ తవ్వకాల విస్తీర్ణంలో ఇంత తేడానా?
ప్రభుత్వం, పిటిషనర్ సమర్పించిన లెక్కలతీరుపై విస్మయం.. అఫిడవిట్ వేయాలని నిర్దేశం
న్యూఢిల్లీ, అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా ఇసుక తవ్వినందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విధించిన రూ.18 కోట్ల జరిమానాను రెండు వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఎన్జీటీ విధించిన జరిమానాపై గతంలో విధించిన స్టేను తొలగిస్తూ, బుధవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, జీసీకేసీని ప్రతివాదులుగా చేర్చాలని నోటీసులు జారీ చేసింది.
లోతైన పరిశీలన జరపండి
వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై లోతైన పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ తవ్వకాలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకొని నష్టం అంచనాలపై రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2021-24వరకు 2,743 హెక్టార్ల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేసింది. సగటున ఒక మీటర్‌లోతున అక్రమ తవ్వకాలు జరిగినట్లు పేర్కొంది. ఈ లెక్కలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టు స్పందిస్తూ...‘‘పిటిషనర్ నాగేంద్రకుమార్ సమర్పించిన అఫిడవిట్‌లో 6,500 హెక్టార్లలో అక్రమ తవ్వకాలు జరిగాయని ఉంది. 2,743 హెక్టార్లలోనే తవ్వకాలు జరిగాయని ప్రభుత్వం అంటోంది. రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకు?’’ అని సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కారును ప్రశ్నించింది. తాము గూగుల్ ఎర్త్‌ప్రో ఆధారంగా శాటిలైట్ చిత్రాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామని ప్రభుత్వం ప్రతినిధి కోర్టుకు నివేదించారు. పిటిషనర్ కూడా గూగుల్ ఎర్త్‌ప్రో టెక్నాలజీ ఆధారంగానే అక్రమతవ్వకాలను గుర్తించారని, ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందని కోర్టు మరోసారి ప్రశ్నించింది. ఈ నేపధ్యంలో పిటిషనర్ అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకొని అన్ని అంశాలను పరిశీలన చేయాలని ఆదేశించింది. ఈ అంశాన్ని పర్యవేక్షించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖలను ఆదేశించింది. వాదనల సందర్భంగా ఇసుక అక్రమ తవ్వకాలదారుల నుంచి రికవరీ అంశం ఎంతవరకు వచ్చిందని బెంచ్ ప్రశ్నించింది. జరిమానా చెల్లించకుండా హైకోర్టుకు వెళ్లిన అక్రమ ఇసుకదారుల కేసులో రెండు వారాల్లోగా తీర్పు వెల్లడించాలని హైకోర్టుకు సూచించింది. ఇదే అంశంపై ప్రభుత్వం స్పందిస్తూ.. బాధ్యులైన కంపెనీలు, వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ‘‘గత కొంతకాలంగా ఇదే మాట చెబుతున్నారు. నోటీసులు ఇవ్వడమేనా? రికవరీ చేయడం ఉందా?’’ అని గట్టిగా ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News