100 For Water 700 For Coffee: సినిమా హాళ్లపై సుప్రీంకోర్టు సీరియస్.. అలా అయితే మూతపడతాయ్..
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:36 PM
మల్లీప్లెక్స్‌లలో సిినిమా టికెట్ల దగ్గరినుంచి తిను బండారాల వరకు అన్నీ అధిక ధరలు ఉండటంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఇలానే కొనసాగితే సినిమా హాళ్లు ఖాళీగా మిగిలిపోతాయ్ అని హెచ్చరించింది.
ఒకప్పుడు చిన్నా, పెద్దా.. ఆడ, మగ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. గత కొన్నేళ్ల నుంచి సినిమా హాళ్లకు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు బాగా తగ్గిపోయాయి. మల్టీప్లెక్స్‌ల హవా నడుస్తోంది. అయితే, టికెట్ రేట్ల దగ్గరినుంచి తినే వస్తువుల వరకు మల్టీప్లెక్స్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మినిమం టికెట్ ధర 200 రూపాయలు పైనే ఉంటోంది.
కొన్ని మల్టీప్లెక్స్‌లలో వాటర్ బాటిల్ ధర 100 రూపాయలు.. కాఫీ ధర 700 రూపాయలు ఉంటోంది. సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు మల్టీప్లెక్స్‌లకు వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మల్టీప్లెక్స్‌లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యధిక ధరలు ఇలానే కొనసాగితే సినిమా హాళ్లు మూసుకోవాల్సి వస్తుందని అంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
మల్లీప్లెక్స్‌లలోని టికెట్ రేట్లు 200 రూపాయల వద్ద ఉండాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. కానీ.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అమ్మే ప్రతీ టికెట్‌కు సంబంధించిన ఆడిటబుల్ రికార్డ్స్ మెయిన్‌టేన్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. ఆఫ్‌లైన్‌లో టికెట్ కొనే వారి నుంచి ఐడీ ప్రూఫ్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయంపై ఓ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహ్తా బెంచ్ తాజాగా విచారణ జరిపింది.
విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ మాట్లాడుతూ.. ‘మీరు వాటర్ బాటిల్‌కు 100 రూపాయలు, కాఫీకి 700 రూపాయలు తీసుకుంటున్నారు’ అని అన్నారు. ఇందుకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున కేసు వాదిస్తున్న అడ్వకేట్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. ‘తాజ్ హోటల్‌లో కాఫీకి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. మరి మీరు ఆ రేట్‌ను ఫిక్స్ చేస్తారా?’ అని అడిగారు.
ఇందుకు విక్రమ్ నాథ్ బదులిస్తూ.. ‘ఈ రేట్లు స్థిరంగా ఉండాలి. సినిమా రంగం రోజురోజుకు దెబ్బ తింటోంది. ఇలాంటి సమయంలో జనం వచ్చి సినిమాను ఎంజాయ్ చేసేలా రేట్లు ఉండాలి. లేకపోతే సినిమా హాళ్లు ఖాళీగా ఉండాల్సి వస్తుంది’ అని అన్నారు. ముకుల్ స్పందిస్తూ..‘కర్ణాటక హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఆఫ్‌లైన్‌లో టికెట్ కొనే వారి నుంచి ఐడీ ప్రూఫ్ తీసుకోమంటే ఎలా?. ఐడీ కార్డులు పెట్టుకుని థియేటర్లకు ఎవరు వస్తారు?’ అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
రూపాయి, రూపాయి కూడబెట్టి భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త..
ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు