Share News

Supreme Court : మెడికల్‌ పీజీలో లోకల్‌ కోటా వద్దు

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:56 AM

వైద్య విద్య పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. పీజీ వైద్య విద్య రాష్ట్ర కోటా (50శాతం) సీట్లను నివాస ఆధారంగా భర్తీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Supreme Court  : మెడికల్‌ పీజీలో లోకల్‌ కోటా వద్దు

ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్య ప్రవేశాలు

రాష్ట్ర కోటాలో ‘నివాస ఆధారిత’ భర్తీ కుదరదు

అది రాజ్యాంగ విరుద్ధం.. ఆర్టికల్‌ 14 ఉల్లంఘన

ఎంబీబీఎస్‌ కోర్సులకు నివాస కోటా ఉండొచ్చు

దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు

సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు

ఇప్పటికే ‘నివాస’ కోటాలో భర్తీ అయిన

పీజీ సీట్లకు ఈ తీర్పు వర్తించదని వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 29: వైద్య విద్య పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. పీజీ వైద్య విద్య రాష్ట్ర కోటా (50శాతం) సీట్లను నివాస ఆధారంగా భర్తీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. నివాస ఆధారిత కోటాలో భర్తీ చేయడమంటే ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించడమేనని పేర్కొంది. సమానత్వ హక్కును కాలరాయడమేనని తెలిపింది. నివాస(స్థానికత) ఆధారిత రిజర్వేషన్లు ఎంబీబీఎస్‌ ప్రవేశాల వరకు ఆమోదయోగ్యమని, పీజీకి మాత్రం కుదరదని పేర్కొంది. పీజీలో స్పెషాలిటీ వైద్య సేవలు ఉంటాయని గుర్తుచేసింది. నీట్‌ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగానే రాష్ట్ర కోటా పీజీ సీట్లనూ భర్తీ చేయాలని బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ‘‘మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నట్లే ఎక్కడైనా చదువుకునే హక్కు కూడా ఉంది. మనమందరం భారత భూభాగంలో నివాసితులం. ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం అనే తేడా ఉండదు. ఎక్కడైనా ఉద్యోగం, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. అలాగే చదువుకునే హక్కు కూడా ఉంది’’ అని జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సుధాంశు ధులియా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్టిల ధర్మాసనం తేల్చి చెప్పింది. పీజీ కోర్సుల్లో నివాస ప్రాంతాన్ని ప్రాతిపాదికగా తీసుకుంటే.. రాజ్యాంగంలోని 14వ అధికరణం కల్పించిన సమానత్వపు హక్కుని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. రాష్ట్రాల కోటా సీట్లలో నిర్దేశిత రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత మిగిలిన సీట్లను తప్పనిసరిగా ఆలిండియా పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేష్లనకు, ఆ కోటా కింద పట్టభద్రులైన వారికి ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ధులియా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు ‘శాశ్వత నివాసం’ పదానికి పర్యాయపదంగా ‘నివాసం’ పదాన్ని వాడుతున్నాయన్నారు. శాశ్వత నివాసం అంటే ఓ వ్యక్తి నివాసం ఉంటున్న ప్రాంతం అని కాదని స్పష్టం చేశారు. భారతీయులందరి ఒకే ఆవాస ప్రాంతమని పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడైనా చదువుకొనే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వైద్య విద్య పీజీ ప్రవేశాల్లో నివాసిత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని 2019లోనే పంజాబ్‌ హరియాణా హైకోర్టు తీర్పునిచ్చింది. చండీగఢ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో రాష్ట్ర కోటా కింద 64 పీజీ సీట్లు ఉన్నాయి. ఆ సీట్లను చండీగఢ్‌ నివాసితులు లేదా అదే కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివిన వారితో భర్తీ చేశారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. అలాంటి రిజర్వేషన్లు సరికాదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ సందర్భంగా గతంలో సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. 64 సీట్లలో విద్యా సంస్థ, ఇతర రిజర్వేషన్లకు అనుగుణంగా 32 సీట్లను భర్తీ చేసుకోవచ్చని తెలిపింది. మిగిలిన 32 సీట్లను స్థానికత ఆధారంగా భర్తీ చేయడం తప్పని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా సుప్రీం త్రిసభ్య ధర్మాసనానికి సిఫారసు చేయగా.. తాజా తీర్పు వెలువడింది. దీంతో పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో దేశవ్యాప్తంగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీట్లు దక్కనున్నాయి.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 03:56 AM