Share News

Supreme Court: మధ్యప్రదేశ్‌ మంత్రిపై సిట్‌

ABN , Publish Date - May 20 , 2025 | 05:14 AM

మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌షా చేసిన కల్నల్‌ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోర్టు మంత్రి ఇచ్చిన క్షమాపణలు సరిపోదని, నిజాయితీగా క్షమాపణ చెప్పాలని కోరింది.

Supreme Court: మధ్యప్రదేశ్‌ మంత్రిపై సిట్‌

కల్నల్‌ సోఫియాపై అనుచిత వ్యాఖ్యల

కేసులో సుప్రీంకోర్టు ఆదేశం

విజయ్‌షా క్షమాణపలో నిజాయితీ లేదు

ఆయన వ్యాఖ్యల పట్ల దేశం

సిగ్గుపడుతోందన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, మే 19: మహిళా సైనికాధికారి కల్నల్‌ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌షాపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన క్షమాపణలను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం మంగళవారం ఉదయం 10 గంటల లోపు ముగ్గురు ఐజీ ర్యాంకు ఐపీఎస్‌ అధికారులతో ప్రత్యేక దర్యాప్తుబృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్‌ డీజీపీని ఆదేశించింది. ముగ్గురిలో ఒకరు మహిళా అధికారి ఉండాలని, తొలి దశ నివేదికను ‘సిట్‌’ ఈ నెల 28వ తేదీ లోగా సమర్పించాలని నిర్దేశించింది. అరెస్టు నుంచి మంత్రికి ఉపశమనం కలిగించింది. అదేసమయంలో, ‘పరిణామాలు తప్పవు’ అని హెచ్చరించింది. ఈ కేసును తామే పర్యవేక్షించాలనుకుంటున్నామని, ‘ఇది మీకు లిట్మస్‌ టెస్ట్‌’ అని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.


ఆపరేషన్‌ సిందూర్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన అనంతరం, ఈ నెల 12వ తేదీన మంత్రి విజయ్‌షా ఓ సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ పని పట్టేందుకు ప్రధాని మోదీ ‘అక్కడున్న వారి మతానికి’ చెందిన మహిళనే పంపించారంటూ.. కల్నల్‌ సోషియా ఖురేషీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా... ‘‘మీరు (ఉగ్రవాదులు) మా సోదరీమణులను వితంతువులను చేశారు. కాబట్టి మీ మతానికి చెందిన సోదరితోనే మీ సంగతి తేల్చేస్తామని, ప్రతీకారం సాధించగలమని ప్రధాని మోదీ నిరూపించారు’’ అని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న సుప్రీం కోర్టు.. కల్నల్‌ సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెప్పాలని గత గురువారం ఆదేశించింది. సోమవారం విచారణ సందర్భంగా మంత్రి క్షమాపణలు కోరిన తీరుపై కోర్టు ఆగ్రహించింది. ‘‘ఏమిటీ ఆ క్షమాపణ? కోర్టు కోరింది కాబట్టి క్షమాపణ చెబుదామన్నట్టు మీ వైఖరి ఉంది. చేసిన పిచ్చి వ్యాఖ్యలకు నిజాయితీగా క్షమాపణ అడగడానికి మీకు ఏం అడ్డుపడుతోంది?’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ నిలదీశారు. మంత్రి వ్యాఖ్యలతో దేశం సిగ్గుతో తల దించుకుందని మండిపడ్డారు. మరోవైపు, ఆపరేషన్‌ సిందూర్‌పై వివాదాస్పద పోస్టు పెట్టారంటూ అశోకా యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం విభాగం అధిపతి ప్రొఫెసర్‌ ఆలీ ఖాన్‌ మహముదాబాద్‌ను అరెస్టు చేయడంపై విచారణ జరుపుతామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:14 AM