Supreme Court: అక్రమ నిర్మాణాలపై కఠినంగా ఉండండి
ABN , Publish Date - May 02 , 2025 | 05:05 AM
అక్రమ కట్టడాల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ సుప్రీంకోర్టు న్యాయస్థానాలకు సూచించింది. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలకు రెగ్యులరైజేషన్ అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేసింది.
రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఇవ్వొద్దు న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ, మే 1: అనుమతుల్లేని నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు అన్ని న్యాయస్థానాలకు సూచించింది. అక్రమ కట్టడాలకు చట్టపరంగా రెగ్యులరైజ్ చేసే అవకాశం కల్పించవద్దని తెలిపింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ బుధవారం జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం అక్రమ కట్టడాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ కట్టడాలను రక్షించుకుంటూపోతే ఎలాంటి శిక్షలు పడవులే అన్న ధోరణి పెరిగిపోతుందని తెలిపింది. అందువల్ల తగిన అధికారి నుంచి సరైన అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టారా, లేదా అని చూడాల్సిన తప్పనిసరి బాధ్యత కోర్టులపై ఉందని పేర్కొంది. ఆ విధంగా చట్టబద్ధపాలనను బలపరచాల్సి ఉంటుందని తెలిపింది. చట్టమంటే గౌరవం లేని వారికి రెగ్యులరైజేషన్ చేయాలని కోరే హక్కు ఉండదని పేర్కొంది. అక్రమంగా నిర్మించిన రెండు అంతస్తులను కూల్చివేయాలని కోల్‌కతా మునిసిపాలిటీ నోటీసులు పంపించగా దాన్ని సవాలు చేస్తూ యజమానులు తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించడంతోపాటు ‘ధైర్యం, నిబద్ధత’తో వ్యవహరించిందని ప్రశంసించింది. రెగ్యులరైజ్ చేయాలన్న వినతిని తిరస్కరించింది. కోర్టులు కూడా చట్టం ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. అతిక్రమించే వారిపై ఎలాంటి సానుభూతి చూపాల్సిన పనిలేదని, క్షమించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అక్రమ కట్టడాలను కూల్చి వేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News